Satyasai District News : సత్యసాయి జిల్లాలో భూములు విలువ అమాంతంగా పెరగడంతో హిందూపురంలో రికార్డుల ప్రకారం బతికి ఉన్నవారిని చంపుతున్నారు, చచ్చిన వారీని బతికి స్తున్నారు. ఇందుకు నిదర్శనమే తాజాగా వెలుగుచూసిన ఉదంతం. ఇందుకు సంబంధించి వివరాలు టూ టౌన్ సీఐ సూర్యనారాయణ శుక్రవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. హిందూపురం పట్టణానికి చెందిన మహబూబ్ సాబ్ అతని భార్య పేరు మీదుగా హౌసింగ్ బోర్డ్ ఉత్తరం వైపు సడ్లపల్లి పొలం సర్వే నెంబర్ 429/3 లో మూడు సెంట్ల ప్లాట్ నెంబర్ 67, 68 ఇంటి స్థలాలను గతంలో కొనుగోలు చేశారు. అయితే మహబూబ్ సాబ్ చాలా ఏళ్ల క్రితం మృతి చెందారు. అతని కుమారుడు బెంగళూరులో నివాసముంటున్నాడు.


ఎలా బయటపడిందంటే?


అయితే ఇటీవల మహబూబ్ సాబ్ కుమారూడు ఇంటి స్థలాలు తెలుసుకోవడానికి హిందూపురం వచ్చి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఈసీ తీసుకోగా మరొకరి పేరుపై రిజిస్ట్రేషన్ అయినట్లు వచ్చింది. దీంతో తమ తల్లిదండ్రుల ఇళ్ల స్థలాలు వేరే వారు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా హస్నాబాద్ కు చెందిన మహ్మద్ జాహూర్ తో పాటు మరికొంత మంది మహబూబ్ సాబ్ 1987లో మృతి చెందిన ఆయన బతికే ఉన్నాడని ఆయన స్థానంలో మరొకరిని చూపించి ఇంటి స్థలం రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అదే విధంగా అతని భార్య బతికుండగానే అతని స్థానంలో వేరొకరిని తీసుకువచ్చి ఆ స్థలం కూడా రిజిస్ట్రేషన్ చేయించారు. ఈ అక్రమాలకు పాల్పడిన నిందితుదు జాహూర్ తో పాటు మరికొంత మందిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్ పంపినట్లు సీఐ తెలిపారు.


లోన్ ఇస్తామని మోసం! 


మీకు లోన్ కావాలా??? ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు...ఇచ్చే వారే నేరుగా కార్ వేసుకుని మరీ మీ ఇంటికి వస్తారు. మీకు సంబంధించిన పత్రాలు అన్నింటిని చెక్ చేస్తారు. ఎన్ని లక్షలైనా సరే మీకు లోన్ మంజూరు చేస్తారు. అలా లక్షలు లోన్ ఇవ్వడానికి ముందు మాత్రం వేలల్లో డబ్బులు సమర్పించుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి ఆఫర్‌లతో అమాయకులను మోసం చేస్తున్న ముఠాను రామగుండం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 


కమాన్పూర్ మండలం గొల్లపల్లి గ్రామానికి చెంది నాగపల్లి శ్రీనివాస్‌కు లోన్ అవసరం ఉంది. విషయాన్ని ఎలా తెలుసుకుందో గానీ... ఓ ముఠా కాంటాక్ట్ అయింది. తక్కువ వడ్డీకి ఎక్కువ రుణం ఇస్తామంటూ హైదరాబాద్‌కు చెందిన ఈ ముఠా ఫోన్ చేసింది. నాగపల్లి శ్రీనివాస్‌కు డబ్బులు అవసరం ఉన్నందున అందుకు సరేనంటూ ఒప్పుకున్నాడు. అప్పు ఇచ్చేందుకు ఒప్పుకున్న ఆ ముఠా... ప్రాపర్టీ వెరిఫికేషన్ అంటూ మెలికి పెట్టింది. అప్పు ఇచ్చేటప్పుడు ఇవన్నీ కామన్‌  అనుకున్న శ్రీనివాస్‌.. వాళ్లను రమ్మని చెప్పాడు. ప్రాపర్టీని చూడటంతోపాటు దాని పత్రాలు వెరిఫై చేయాల్సి ఉంటుందన్నారు.  డబ్బులు అవసరం ఉన్న శ్రీనివాస్ వాళ్లు చెప్పిన కండిషన్స్‌కు సరే అన్నాడు.  లోన్ ఇస్తామన్న ముఠా హైదరాబాదు నుంచి TS 22A 7531 నంబర్ గల మారుతి షిఫ్ట్ డిజైర్ కారులో కమాన్పూర్‌ వచ్చారు. శ్రీనివాస్‌కు ఫోన్ చేసి ప్రాపర్టీ చూపించమన్నారు. డాక్యుమెంట్స్ తీసుకురమ్మన్నారు. వాటికి సంబంధించిన జిరాక్స్‌లు తీసుకున్నారు. ఇప్పుడు చూసిన ప్రాపర్టీపై లోన్ ఇచ్చేందుకు ఓకే కూడా చెప్పారు. కొన్ని పత్రాలపై సంతకాలు కూడా చేయించుకున్నారు.  


లోన్‌ ప్రాసెస్‌కు కాస్త టైం పడుతుందని శ్రీనివాస్‌కు వివరించారు. ఇదంతా బ్యాంకు వ్యవహారం కాబట్టి లేట్ అవుతుందని శ్రీనివాస్ కూడా తనను తాను సర్ధిచెప్పుకున్నాడు. లోన్ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలంటే.. కాస్త ఖర్చవుతుందని అసలు విషయం అప్పుడు చెప్పారు. ఎంతా అంటే 20 వేలు ఇస్తే 40 లక్షల లోన్ వస్తుందని కలరింగ్ ఇచ్చారు. 20 వేలు ఇప్పుడు ఇస్తే రేపటి లోపు 40 లక్షలు నీ అకౌంట్ల పడతాయంటూ చెప్పడంతో శ్రీనివాస్‌కు అనుమానం వచ్చింది. ముందు లేట్ అవుద్దీ అన్నారు.. ఇప్పుడు డబ్బులు ఇస్తే 24 గంటల్లోనే డబ్బులు వేస్తామంటున్నారని డౌట్‌తోనే తలాడించాడు. వేరే వాళ్లను అడిగి ఇస్తానంటూ పక్కకు వెళ్లి ఫోన్ చేశాడు శ్రీనివాస్. 


డబ్బులు వస్తున్నాయని ఆనందపడుతున్న ఆ ముఠాకు శ్రీనివాస్ షాక్ ఇచ్చాడు. శ్రీనివాస్‌ ఫోన్ చేసింది తమ ఏరియా బాబాయ్‌లను పిలిచాడు. అంటే పోలీసులకు లోన్‌ విషయంలో జరిగింది చెప్పాడు. వెంటనే అలర్ట్‌ అయిన పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చారు. లోన్‌ ఇచ్చేందుకు వచ్చిన ముఠాను పట్టుకున్నారు. అసలు ఏ బ్యాంక్‌ నుంచి వచ్చారని...లోన్‌లు ఎలా ఇస్తారంటూ ఆరా తీశారు. వాళ్లు నీళ్లు నమలడంతో ఇదంతా దొంగల ముఠా అని గుర్తించి లోపలేసేశారు. ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. కేదారి రాకేష్, వనం రవి, వనం లోకేష్, దాసరి రవి, జగన్నాథం, వనం రామవ్వను అరెస్టు చేశారు. వీళ్లంతా హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌ పరిసరప్రాంతాల్లో నివసిస్తున్నారు.  ఎవరైనా అపరిచితులు తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తామంటే అత్యాశకు పోయి మోసపోవద్దని ఆన్లైన్ రుణాలు కూడా తీసుకోవద్దని సూచిస్తున్నారు గోదావరిఖని టూ టౌన్ సిఐ శ్రీనివాసరావు. అపరిచిత వ్యక్తులకు ఎట్టి పరిస్థితిలోనూ మొబైల్‌కు వచ్చే ఓటీపీలు చెప్పవద్దని సూచించారు. అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే లింక్‌లను ఓపెన్ చేయవద్దని, సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని ఎవరిని గుడ్డిగా నమ్మి మోసపోవద్దని హెచ్చరించారు.