Staged Hit and Run Murder Ahmedabad:  అది ఆగస్టు 12 అర్ధరాత్రి వేళ.. అహ్మదాబాద్ సర్కేజ్ పరిధిలోని సమృద్ధి డైరీ సమీపంలో ఒక ద్విచక్రవాహనం ఘోర ప్రమాదానికి గురైందంటూ పోలీసులకు సమాచారం అందింది. తన చెల్లెలు సోఫియా ఫారూఖ్  ను బైక్‌పై తీసుకెళ్తుండగా వెనుక నుంచి గుర్తుతెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోయిందని, తీవ్రంగా గాయపడిన ఆమెను సోలా సివిల్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించిందని ఆమె సోదరుడు హబిల్ ఫారూఖ్  న్నీరుమున్నీరయ్యాడు. తొలుత పోలీసులు దీనిని ఒక సాదాసీదా  హిట్ అండ్ రన్  కేసుగా భావించి దర్యాప్తు ప్రారంభించారు. కానీ, క్షతగాత్రురాలి శరీరంపై ఉన్న గాయాలు, ఘటనా స్థలంలో ఉన్న ఆధారాలు ప్రమాద శైలికి భిన్నంగా ఉండటంతో ఆ అనుమానమే ఒక సంచలనాత్మక మర్డర్ మిస్టరీకి నాంది పలికింది.

Continues below advertisement

రోడ్డు ప్రమాదంలో చెల్లి చనిపోయిందని పోలీసులకు అన్న ఫిర్యాదు 

పోలీసులు ఈ కేసులో లోతుగా విచారణ చేపడుతున్న కొద్దీ సోదరుడి కథనంలో వరుస లోపాలు బయటపడ్డాయి. ప్రమాదం జరిగిందని చెప్తున్న తీరుకు, సోఫియా తలకు బలంగా తగిలిన గాయాలకు అస్సలు పొంతన కుదరలేదు. దీంతో పోలీసులు సాంకేతిక ఆధారాలు, సిసిటివి దృశ్యాలు ,  ఫోన్ కాల్ డేటాను విశ్లేషించడం ప్రారంభించారు. ఒకవైపు బైక్ యాక్సిడెంట్ అని చెప్తూనే, మరోవైపు కుటుంబ సభ్యుల ప్రవర్తన అనుమానాస్పదంగా మారడంతో ఎం-డివిజన్ ట్రాఫిక్ పోలీసులు , స్థానిక క్రైమ్ విభాగం ఈ మిస్టరీ చిక్కుముడులను విప్పడంపై దృష్టి సారించాయి.      

Continues below advertisement

దర్యాప్తులో తేలిన అసలు నిజం                       

పోలీసుల శైలి విచారణలో నిందితులు కక్కిన నిజాలు విస్తుపోయేలా చేశాయి. అది రోడ్డు ప్రమాదం కాదు, కన్న తండ్రి మహమ్మద్ ఫారూఖ్  , సొంత సోదరుడు హబిల్ ఫారూఖ్ కలిసి ఆడిన  నాటకం! సోఫియా ఒక  స్నేహితుడితో కలిసి ఉన్న వీడియో మూడు నెలల క్రితం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, కుటుంబ పరువు పోయిందనే కక్షను తండ్రీకొడుకులు పెంచుకున్నారు. ప్రణాళిక ప్రకారమే ఆగస్టు 12న ఆమెను గెల్జీపురా గ్రామం సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. ప్యాంట్‌లో దాచుకున్న ఇనుప సుత్తితో సోదరుడు హబిల్ ఆమె తలపై మూడుసార్లు బలంగా బాదగా, తండ్రి అతనికి సహాయం చేశాడు.       

కటకటాల వెనక్కి పంపిన పోలీసులు                  

రక్తమడుగులో పడివున్న సోఫియాను, ఆమె బైక్‌ను ప్రధాన రహదారిపైకి తీసుకెళ్లి.. గుర్తుతెలియని వాహనం ఢీకొట్టినట్లు సీన్ క్రియేట్ చేశారు. పోలీసులను దారిమళ్లించడానికి స్వయంగా నిందితులే హిట్ అండ్ రన్ ఫిర్యాదు కూడా ఇచ్చారు. 'కుటుంబ పరువు' కాపాడుకోవడానికి సొంత కూతురినే సుత్తితో కొట్టి చంపేసి, యాక్సిడెంట్‌గా చిత్రీకరించేందుకు వేసిన ఈ స్కెచ్ చివరికి పోలీసుల చాకచక్యంతో పటాపంచలైంది. ప్రస్తుతం నిందితులిద్దరిపై హత్య కేసు నమోదు చేసి కటకటాల వెనక్కి నెట్టారు.