వాటర్‌ ట్యాంక్‌ శుభ్రం చేస్తూ దాని నుంచి నీరు సరపరా అయ్యే పైప్‌లో పడి ఓ పారిశుద్ధ్య కార్మికుడు మృతి చెందిన సంఘటన ఖమ్మం నగరంలో చోటు చేసుకుంది. ట్యాంక్‌ నుంచి నీరు వెళ్లేందుకు ఏర్పాటు చేసిన అతి పెద్ద పైప్‌లో ప్రమాదవశాత్తు అతను పడిపోవడంతో ఈ సంఘటన చోటు చేసుకుంది. సుమారు ఐదు గంటల పాటు రెస్క్యూ చేయడంతో మృతదేహం లభ్యమైంది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.


ఖమ్మం నగరంలోని నయా బజార్‌లో కార్పోరేషన్‌కు నీరు సరపరా చేసే అతిపెద్ద ట్యాంక్‌ ఉంది. ఈ ట్యాంక్‌ను ప్రతి పదిహేను రోజులకు ఒకసారి కార్పోరేషన్‌ అధికారులు శుభ్రం చేయిస్తుంటారు. అదే క్రమంలో ముగ్గురు కార్మికులు ట్యాంక్‌ను శుభ్రం చేసేందుకు ట్యాంక్‌లోకి దిగారు. చిర్రా సందీప్‌ (23) అనేే యువకుడు ట్యాంక్‌ కింది భాగంలో శుభ్రం చేసేందుకు దిగడంతో ట్యాంక్‌ నుంచి మంచినీరు సరపరా చేసే పైప్‌లోకి జారిపోయాడు. విషయం గమనించిన తోటి కార్మికులు అధికారులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ టీం సభ్యులు అక్కడికి చేరుకుని సందీప్‌ను కాపాడేందుకు ప్రయత్నించారు.


ఐదు గంటలు సాగిన రెస్క్యూ ఆపరేషన్‌..
సందీప్‌ను కాపాడేందుకు ఐదు గంటల పాటు అధికారులు రెస్క్యూ పనులు నిర్వహించారు. ట్యాంక్‌ నుంచి నీరు వెళ్లే మార్గంలో సందీప్‌ ఎక్కడ చిక్కుకున్నాడనే విషయం అర్థం కాక పోవడంతో అతనిని కాపాడలేకపోయారు. చివరకు ట్యాంక్‌ నుంచి వచ్చే పైప్‌ను పగలగొట్టగా అక్కడ సందీప్‌ మృత దేహం కనిపించలేదు. జేసీబీ సహాయంతో కొద్ది దూరంలో పైప్‌ను పగలగొట్టగా అతని కాళ్లు కనిపించాయి. దీంతో పైపును తొలగించి సందీప్‌ మృతదేహాన్ని బయటకు తీశారు.


అధికారుల నిర్లక్ష్యం వల్లే కార్మికుడు మృతి..
అతిపెద్ద వాటర్‌ ట్యాంక్‌ను శుభ్రం చేసే క్రమంలో నిపుణులైన వారిని అక్కడ వినియోగించాలి. అయితే ఎలాంటి రక్షణ పరికరాలు లేకుండానే కార్మికులను వాటర్‌ ట్యాంక్‌లో దించడం వల్ల కార్మికుడు చనిపోయాడని ప్రజాసంఘాలు ఆందోళన చేపట్టాయి. ట్యాంక్‌లో దిగినప్పుడు వారు పడిపోకుండా తాడు లాంటివి కట్టుకోవాల్సి ఉంటుంది. అయితే ఇవేవి లేకుండానే కార్మికులు నేరుగా దిగడంతో పైప్‌లో పడి సుమారు 200 మీటర్ల మేరకు పైప్‌లోకి వెళ్లిపోవాల్సిన పరిస్థితి నెలకొంది. కిందకు దిగినప్పుడు రక్షణగా తాడ్లు కట్టుకుంటే ఈ పరిస్థితి ఉండేది కాదని, వెంటనే ఇందుకు బాద్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రజాసంఘాల నాయకులు ధర్నాకు దిగారు. వెంటనే స్పందించిన అధికారులు ప్రభుత్వం నుంచి రూ.6 లక్షల పరిహారం, కుటుంబంలో ఒకరికి ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగం ఇచ్చేందుకు అంగీకారం తెలపడంతో ధర్నా విరమించారు. ఏది ఏమైనా వాటర్‌ ట్యాంక్‌ శుభ్రం చేసేందుకు వెళ్లిన కార్మికుడు పైప్‌లో పడి మృతి చెందడం ఖమ్మంలో సంచలనంగా మారింది.