Circar Express Robbery | బాపట్ల: తమిళనాడులోని చెంగల్‌పట్టు నుంచి కాకినాడ పోర్ట్‌కు వెళుతున్న సర్కార్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో దొంగలు బీభత్సం సృష్టించారు. ప్రయాణికుల నుంచి బంగారు ఆభరణాలు దోచుకుని పారిపోయే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో వారిని పట్టుకునేందుకు పోలీసులు కాల్పులు జరపడం కలకలం రేపింది. ఆదివారం అర్ధరాత్రి దాటాక సుమారు 1.15 గంటల సమయంలో బాపట్ల శివారులోని నల్లమడ వాగు రైల్వే వంతెన సమీపంలో ఈ దోపిడీ యత్నం జరిగింది. 

Continues below advertisement

సర్కార్ ఎక్స్ ప్రెస్ రైలులోని ఎస్‌-3, ఎస్‌-6 బోగీల్లో నిద్రిస్తున్న ఇద్దరు మహిళా ప్రయాణికుల మెడల్లోంచి దుండగులుబంగారు ఆభరణాలను లాక్కున్నారు. బాధితులు గట్టిగా కేకలు వేయడంతో పాటు, తోటి ప్రయాణికులు చైన్‌ లాగడంతో రైలు అక్కడికక్కడే నిలిచిపోయింది. మొత్తం ఆరుగురు దొంగలు రైలులో చోరీకి పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. 

Continues below advertisement

పారిపోతున్న దొంగలు.. 9 రౌండ్లు కాల్పులు జరిపిన పోలీసులు

రైలు ఆగగానే దొంగలు కిందకు దూకి చీకట్లో పొలాల మీదుగా బాపట్ల-గుంటూరు రోడ్డు వైపు పారిపోవడానికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో రైలులో ఎస్కార్ట్‌ విధుల్లో ఉన్న రైల్వే పోలీసులు తక్షణమే స్పందించి దొంగలను ఛేజ్ చేశారు. వారిని లొంగిపోవాలని హెచ్చరించినా ప్రయోజనం లేకపోయింది. దాంతో పోలీసులు ఏకంగా 9 రౌండ్లు గాల్లోకి కాల్పులు జరపగా, దుండగులు చీకట్లోకి వెళ్లి పారిపోయే ప్రయత్నం చేశారు. సమాచారం అందిన వెంటనే జిల్లా ఎస్పీ ఉమామహేశ్వరరావు రూరల్ పోలీసులను అప్రమత్తం చేశారు. ప్రస్తుతం అప్పికట్ల-బత్తిపూడి పరిసర పొలాల్లో పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.Also Read: Chandrababu Naidu Importance In NDA: ఎన్డీఏకు తృణమూల్ చీలిక వర్గం మద్దతు - చంద్రబాబు కింగ్ మేకర్ పోస్టు పోయిందా?

ప్రయాణికులను ఆందోళనకు గురిచేస్తున్న వరుస ఘటనలు

ఈ రైల్వే పరిధిలో దొంగల ముఠాలు వరుస చోరీలకు పాల్పడుతుండటం ప్రయాణికులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. 3 వారాల కిందట బాపట్ల సరిహద్దులోని గుంటూరు జిల్లా నిడుబ్రోలు సమీపంలో దొంగలు రైల్వే సిగ్నల్స్‌ను టాంపరింగ్‌ చేసి రైలును ఆపి చోరీకి యత్నించారు. ఆ సమయంలోనూ రైల్వే పోలీసులు అప్రమత్తమై కొన్ని రౌండ్లు కాల్పులు జరిపినప్పటికీ దొంగలు తప్పించుకున్నారు. వరుసగా జరుగుతున్న ఈ రైల్వే దొంగతనాలు స్థానిక పోలీసు వ్యవస్థకు, రైల్వే భద్రతా దళాలకు పెద్ద సవాల్‌గా మారాయి.

కేరళ, బెంగళూరు మార్గాల్లోనూ గతంలో ఇలాంటి ఘటనలు జరిగాయి. కేవలం 2 నెలల వ్యవధిలో, 20 కిలోమీటర్ల పరిధిలోనే ఇలాంటి వరుస ఘటనలు జరిగాయి. గత ఏప్రిల్ 19న అప్పికట్ల సమీపంలో బెంగళూరు-నర్సాపూర్‌ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌లో నిద్రిస్తున్న మహిళల మెడల్లోంచి దుండగులు 130 గ్రాముల బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు.