Annamayya Road Accident | రాయచోటి: ఏపీలోని అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మామిడికాయల లోడ్‌తో వెళ్తున్న లారీ బోల్తా పడింది. ఈ ఘటనలో 9 మంది మృతిచెందగా, మరికొందరు కూలీలు గాయపడ్డారు.
రాజంపేట నుంచి రైల్వేకోడూరు మార్కెట్ కు మామిడికాయల లోడుతో లారీ వెళ్తోంది. ఈ క్రమంలో రెడ్డిపల్లి చెరువు కట్టపై లారీ అదుపుతప్పి బోల్తా పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం జరిగిన సమయంలో లారీలో 16 మంది వరకు మామిడికాయలు కోసే కూలీలు ఉన్నారు. జేసీబీ సాయంతో లారీ కింద చిక్కుకుపోయిన కూలీలను బయటకు తీశారు. గాయపడిన వారిని 108 అంబులెన్స్‌లో రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.
పుల్లంపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులను కోడూరు మండలం శేట్టిగుంట ఎస్టి కాలనీకి చెందిన వారిగా గుర్తించారు. మృతులు చిట్టెమ్మ (25), గజ్జల దుర్గయ్య (32), గజ్జల శీను (33), గజ్జల లక్ష్మీదేవి (36), వెంకట సుబ్బమ్మ (37), ముని చంద్ర (38), రాధా (39), గజ్జల రమణ(42), సుబ్బ రత్నమ్మ (45)లుగా పోలీసులు తెలిపారు.
రోడ్డు ప్రమాదంపై మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి దిగ్భ్రాంతి..
అన్నమయ్య జిల్లాలో లారీ బోల్తా పడి 8 మంది మృతి చెందడంపై జిల్లా ఇన్చార్జి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మామిడికాయల లోడ్‌తో రైల్వేకోడూరుకు వెళ్తుండగా రెడ్డిపల్లె చెరువు కట్టపై లారీ బోల్తా పడి 8 మంది మృతి చెందడం తీవ్ర ఆవేదన కలిగించిందన్నారు రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. మృతులంతా రోజువారి కూలీలు కావడం బాధాకరం అన్నారు
లారీ బోల్తా పడిన ఘోర రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, మెరుగైన వైద్య సహాయం అందించాలని జిల్లా అధికారులను ఆదేశించారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.