వైద్యో నారాయణో హరి అని అంటాం.  తల్లిదండ్రులు జన్మను ఇస్తే వైద్యులు పునర్జన్మనిస్తారు. అందుకే దేవునితో సమానంగా వైద్యుడిని నారాయణుడితో పోలుస్తారు. కానీ అందుకు భిన్నంగా ఓ వైద్యుడు తన పైశాచికత్వాన్ని ప్రదర్శించారు. 


అనంతపురం పట్టణంలోని మారుతి నగర్ ఫస్ట్ క్రాస్‌లో ఉన్న ప్రైవేట్ నర్సింగ్ హోమ్‌లోని గదుల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. మహిళలకు సర్జరీకి ముందు తర్వాత చేసే డ్రెస్సింగ్ దృశ్యాలను సీసీ కెమెరాల ద్వారా తన సెల్ఫోన్లో చూస్తూ సదరు వైద్యుడు పైశాచికత్వాన్ని పొందుతున్నాడని రోగి బంధువులు తీవ్ర స్థాయిలో ఆరోపిస్తూ వైద్యుడిపై దాడికి దిగారు. 


పట్టణంలోని ఐదో రోడ్‌లో నివాసం ఉంటున్న ఓ మహిళకు మొలల శస్త్రచికిత్స అవసరమని వైద్యులు చెప్పారు. దీంతో మారుతి నగర్‌లోని ప్రైవేట్ నర్సింగ్ హోమ్‌లో చికిత్స నిమిత్తం చేర్పించారు. సర్జరీకి ముందు సదరు మహిళకు డ్రస్సింగ్ చేశారు. అనంతరం ఆపరేషన్ థియేటర్‌కు తరలించి సర్జరీ సైతం పూర్తి చేసి తిరిగి వార్డుకు తీసుకువచ్చారు. సదరు రోగి బంధువులకు అనుమానం వచ్చి సీసీ కెమెరాలను పరిశీలించారు. ఆపరేషన్ థియేటర్‌లోనూ రోగులకు డ్రెస్సింగ్ చేసే వార్డులలో సీసీ కెమెరాలు ఎందుకు బిగించారని ఆమె బంధువులు ఆస్పత్రి సిబ్బందిని నిలదీశారు. సీసీ కెమెరాలు పని చేయవని సిబ్బంది బుకాయించే ప్రయత్నం చేయగా డాక్టర్ గదిలోకి వెళ్లి పరిశీలిస్తే అక్కడున్న మానిటర్‌లో చూస్తే అన్ని లైవ్‌లో ఉన్నాయి. కెమెరాల ఫుటేజీలు కనిపిస్తుండటంతో ఆగ్రహానికి గురైన రోగి బంధువులు డాక్టర్ ను నిలదీశారు. 


అసలు సీసీ కెమెరాలు ఎందుకు పెట్టారని ఆ అవసరం ఏమొచ్చిందని వైద్యున్ని నిలదీశారు రోగి బంధువులు. సరైన సమాధానం రాకపోయేసరికి దాడికి పాల్పడ్డారు. అడ్డొచ్చిన ఆసుపత్రి సిబ్బందిపై కూడా దాడి చేశారు. అనంతరం సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి డాక్టర్‌పై చర్యలు తీసుకొని ఆసుపత్రిని సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. పేషెంట్ల పరిస్థితి మానిటరింగ్ చేయాలంటే సీసీ కెమెరాలు అత్యవసరం అని కవర్ చేస్తున్నాడు వైద్యులు రాము. ఇందులో తప్పేముంది వాదనకు దిగాడు. తనపై జరిగిన దాడికి పై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశామని వైద్యుడు తెలిపారు.


రోగి బంధువులు కూడా వైద్యుడిపై ఫిర్యాదు చేశారు. ఇరు వర్గాల ఫిర్యాదులతో రంగంలోకి దిగారు పోలీసులు. విచారణ చేపట్టారు. ఆసుపత్రిని పరిశీలించారు. సీసీటీవీ ఫుటేజ్‌ కూడా చెక్ చేశారు. ఆ సీసీటీవీ ఫుటేజ్‌తపాటు డాక్టర్ మొబైల్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు.