Real Money Heist in Germany:  జర్మనీలోని ఓ నగరంలో క్రిస్మస్ పర్వదినం వేళ  భారీ బ్యాంకు దోపిడీ వెలుగులోకి వచ్చింది. ప్రముఖ నెట్‌ఫ్లిక్స్ సిరీస్ మనీ హైస్ట్ ను తలపించేలా, దుండగులు అత్యంత పక్కా ప్లాన్‌తో బ్యాంకు లాకర్‌ రూమ్‌లోకి చొరబడి సుమారు  100 మిలియన్ల యూరోల  విలువైన నగదు, బంగారాన్ని దోచుకెళ్లారు. పండుగ సెలవుల కారణంగా బ్యాంకు మూసి ఉండటాన్ని ఆసరాగా చేసుకుని ఈ భారీ స్కెచ్ అమలు చేశారు.  దొంగలు ఈ దోపిడీ కోసం ఎంచుకున్న మార్గం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. బ్యాంకు పక్కనే ఉన్న ఒక ఖాళీ భవనం ఉంది. ఆ భవనం నుంచి  దొంగలు బ్యాంకు గోడకు రంధ్రం చేసినట్లు పోలీసులు గుర్తించారు. అత్యున్నత సాంకేతికత కలిగిన  డ్రిల్లింగ్ మిషన్లను  ఉపయోగించి, ఎవరికీ అనుమానం రాకుండా కాంక్రీట్ గోడలను చీల్చుకుంటూ నేరుగా బ్యాంక్ మెయిన్ వాల్ట్ లోకి ప్రవేశించారు.     

Continues below advertisement

 వాల్ట్ లోపలికి ప్రవేశించిన తర్వాత, దుండగులు అక్కడున్న వందలాది ప్రైవేట్ సేఫ్టీ డిపాజిట్ బాక్సులను  లక్ష్యంగా చేసుకున్నారు. గ్యాస్ కట్టర్లు, ఇతర పరికరాలతో లాకర్లను పగులగొట్టి, అందులో ఉన్న భారీ మొత్తంలో విదేశీ కరెన్సీ, బంగారు బిస్కెట్లు, వజ్రాభరణాలను ఊడ్చేశారు. బ్యాంకులోని అలారమ్ వ్యవస్థలు పని చేయకుండా ముందే జాగ్రత్త పడటంతో, దోపిడీ జరుగుతున్న సమయంలో అధికారులకు ఎలాంటి సమాచారం అందలేదు.    పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం.. ఈ దోపిడీ వెనుక ప్రొఫెషనల్ గ్యాంగ్ హస్తం ఉందని తెలుస్తోంది. నిందితులు బ్యాంకు సెక్యూరిటీ నెట్‌వర్క్, కెమెరాల ప్లేస్‌మెంట్ , వాల్ట్ గోడల మందం గురించి ముందే పూర్తి సమాచారం సేకరించారు. క్రిస్మస్ వేడుకల హడావిడిలో జనం ఉండటం, వీధుల్లో బాణసంచా చప్పుళ్ల వల్ల డ్రిల్లింగ్ శబ్దాలు బయటకు వినిపించకపోవడం దొంగలకు కలిసివచ్చింది.      

Continues below advertisement

బ్యాంకు తెరిచిన తర్వాత ఈ భారీ చోరీ వెలుగులోకి రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఘటనా స్థలంలో దొరికిన ఆధారాలు, సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు విశ్లేషిస్తున్నారు. ఈ "క్రిస్మస్ మనీ హైస్ట్" వెనుక అంతర్జాతీయ ముఠాల ప్రమేయం ఏమైనా ఉందా అనే కోణంలో  ఇంటర్‌పోల్ సాయంతో దర్యాప్తును వేగవంతం చేసింది.