RFCL Job Scam: రామగుండం ఆర్ఎస్ సీఎల్ లో ఉద్యోగాలు ఇప్పిస్తామని మాయ మాటలు చెప్పి లక్షలు దండుకుని.. చివరకు ఓ యువకుడి చావుకు కారణం అయిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఇందుకు సబంధించిన పూర్తి వివరాలను పెద్దపల్లి డీసీపీ రూపేష్ కుమార్ వివవించారు.  


అసలేం జరిగిందంటే..? 
1979లో యూరియా తయారీ నిమిత్తం ఎఫ్‌సీఐ (ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) కర్మాగారాన్ని రామగుండంలో ప్రారంభించారు. 1996 లో కొన్ని కారణాల వల్ల ఈ ఫ్యాక్టరీ మూతపడింది. తిరిగి 2016 లో  కేంద్ర ప్రభుత్వం ఈ కర్మాగారానికి ఆర్ఎఫ్ సీఎల్ (రామగుండం ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ లిమిటెడ్) అనే పేరు పెట్టి మళ్లీ వినియోగంలోకి తీసుకువచ్చింది. రైతుల అవసరాల కోసం యూరియా  ఉత్పత్తి ని పునః ప్రారంభించింది. అందులో భాగంగానే లోడింగ్, అన్ లోడింగ్  పనులు చేయడం కోసం ఆన్లైన్ టెండర్ కు పిలువగా,  2020 నవంబర్ లో ఎస్వీఎల్ (శ్రీ వేంకటేశ్వర లాజిస్టిక్ ) అనే కంపెనీ ద్వారా నిందితులు మోహన్ గౌడ్, గుండు రాజులు కలిసి కోడింగ్ చేశారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ టెండర్ రిజెక్ట్ అయింది.


300 మంది నుంచి 14 కోట్లు వసూలు..! 
ఫైవ్ స్టార్ అనే మరో కంపెనీకి ఈ టెండర్ దక్కింది. దానిపై మోహన్ గౌడ్, గుండు రాజులు హైకోర్టుకు వెళ్లగా.. స్టే వచ్చింది. తరువాత ఇరు వర్గాలు రాజీకి వచ్చి ఫైవ్ స్టార్ కంపెనీకి రెంండు కోట్ల రూపాయలు ఇచ్చి లోడింగ్, అన్ లోడింగ్ పనులు చేసే విధంగా ఒప్పందం చేసుకున్నారు. కంపెనీ కొత్తగా మదలు కావడం వల్ల ఎక్కువ మొత్తంలో వర్కర్స్ అవడం ఉండడాన్ని గమనించారు. అదే అదునుగా భావించి కొత్త తరహా సంపాదనకు తెర లేపారు. కేంద్రానికి సంబంధించిన కంపెనీ.. ఒక్కసారి ఉద్యోగం వస్తే మీ లైఫ్ సెట్ అంటూ ప్రజలకు మాయ మాటలు చెప్పారు. ఇక్కడ ఉద్యోగం వస్తే.. ప్రతీ నెల జీతం పెరుగుతుందని, క్వార్టర్స్, వైద్య సదుపాయాలు ఉంటాయని.. నిరుద్యోగులైన యువతను నమ్మించి ఒక్కొక్కరి వద్ద నుంచి 3 నుంచి 7 లక్షల వరకు తీసుకున్నారు. ఇలా దాదాపు 650 ఉద్యోగాలల్లో 300 మంది వద్ద నుంచి 14  కోట్ల రూపాయల వరకు వసూలు చేశారు. 


కాంట్రాక్ట్ వేరే వాళ్లకి రావడంతో.. 200 మంది ఉద్యోగాలు కట్! 
డిసెంబర్ 2021 నుంచి లోడింగ్/ఆన్ లోడింగ్ కంపెనీ కాంట్రాక్టు చౌదరి కన్ స్ట్రక్షన్ కు రాగా.. కంపెనీకి అవసరం లేని 200  వందల మంది గేట్ పాస్ లను రద్దు చేసింది. దీంతో నిందితులు చేసిన మోసాలు వెలుగులోకి వచ్చాయి. లక్షల్లో డబ్బులు కట్టి ఉద్యోగాలకు వచ్చామని.. ఇప్పుడు తమను తీసేస్తూ.. తమ బతుకు ఏమైపోవాలంటూ బాధితులంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ డబ్బులు తమకు ఇవ్వాలనీ లేదా ఉద్యోగాలైన కల్పించాలంంటూ నేరస్తుల వెంట పడ్డారు. నోటికొచ్చిన మాటలు చెప్తూ.. చాలా కాలమే వారిని మాయ చేశారు. అయితే ఎంతకూ వాళ్లు స్పందించకపోవడంతో.. బాధితులంతా కలిసి ఆందోళన నిర్వహించారు. ఇలా ఉద్యోగం కోల్పోయిన వాళ్లలో ఒకరైన కేశవపట్నం మండలం అంబాలాపూర్ కి చెందిన ముంజ హరీష్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. 


నా చావు వల్లనైనా మిగతా వాళ్లకి న్యాయం జరగాలి..!


హరీష్ కు శాశ్వత హమాలీ ఉద్యోగం ఆశ చూపి ఏడాది క్రితం ఏడు లక్షల రూపాయలు వసూలుచేశారు నిందితులు. కొంతకాలం పని చేయించుకున్నారు. కాంట్రాక్ట్ వేరే వాళ్లకు రావడంతో.. ఐదు నెలల క్రితం ఉద్యోగం పోయింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఉద్యోగం వస్తుందన్న ఆశతో లక్షల డబ్బు కట్టి మోసపోయాడు. ఉద్యోగమే, డబ్బు ఇవ్వాలని నిందితుల చుట్టూ తిరిగినా లాభం లేకపోయింది. దీంతో ఆగస్టు 26వ తేదీన ఉదయం 9 గంటలకు.. ఇంటి నుంచి తన ద్విచక్ర వాహనంపై బయలు దేరాడు. సాయంత్రం నాలుగు గంటలకు ఆర్ఎఫ్ సీఎల్ బాధితుల సంఘం గ్రూపులో తాను చనిపోతున్నాని.. తన చావు వల్లనైనా మిగతా బాధితులకు న్యాయం జరగాలంటూ మెసేజ్ చేశాడు. అది గమనించిన వాళ్లంతా హరిష్ తల్లిదండ్రులకు, పోలీసులకు సమాచారం అందించారు. లొకేషన్ ఆధారంగా ఎక్కడున్నదీ తెలుసుకున్నారు. కమన్ పూర్ మండలం పిల్లపల్లి శివారులోని చెరువు కట్ట వద్ద బండి, దాని పక్కనే ఉన్న బావి వద్ద వాచ్, హెడ్ సెట్ పెట్టడాన్ని గుర్తించారు. అయితే ఆ బావిలో గాలించగా హరీష్ మృతదేహం లభ్యం అయింది. ఈ క్రమంలోనే కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.