Udaypur Crime Gangrape:రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో ఒక ఐటీ కంపెనీ మహిళా మేనేజర్‌పై జరిగిన సామూహిక అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. తాను పనిచేస్తున్న సంస్థ సీఈఓ ,సహోద్యోగులే ఈ దారుణానికి ఒడిగట్టారని పోలీసులకుఫిర్యాదు చేసింది. బర్త్ డే పార్టీలో దారుణం - సీఈఓ సహా ముగ్గురి అరెస్ట్
రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో ఒక ఐటీ సంస్థ మహిళా మేనేజర్‌పై జరిగిన సామూహిక అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది. GKM IT అనే ప్రైవేట్ సంస్థ సీఈఓ జితేష్ సిసోడియా , ఎగ్జిక్యూటివ్ హెడ్ శిల్పా సిరోహి , ఆమె భర్త గౌరవ్ సిరోహి కలిసి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. డిసెంబర్ 20న సీఈఓ పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఈ ఘటన జరిగినట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి, వారిని నాలుగు రోజుల పోలీస్ రిమాండ్‌కు తరలించారు.
పోలీసుల కథనం ప్రకారం, శోభాగ్‌పురా ప్రాంతంలోని ఒక హోటల్‌లో సీఈఓ జితేష్ సిసోడియా బర్త్ డే , న్యూ ఇయర్ పార్టీ నిర్వహించారు. ఈ వేడుకకు బాధితురాలైన మహిళా మేనేజర్ కూడా హాజరయ్యారు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఆమెకు మత్తుగా అనిపించడంతో ఇంటికి వెళ్లాలని కోరారు. ఆ సమయంలో శిల్పా సిరోహి తన కారులో దింపుతానని నమ్మించి బాధితురాలిని ఎక్కించుకున్నారు. కారులో అప్పటికే సీఈఓ జితేష్ , శిల్ప భర్త గౌరవ్ ఉన్నారు. మార్గమధ్యంలో ఆమెకు సిగరెట్ ఇచ్చి తాగించారని, ఆ తర్వాత పూర్తిగా స్పృహ కోల్పోయానని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
అనంతరం నిందితులు ముగ్గురూ కలిసి కదులుతున్న కారులోనే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని ఆమె గుర్తించింది. తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో ఆమెను ఇంటి వద్ద వదిలి వెళ్లారు. మరుసటి రోజు ఉదయం స్పృహలోకి వచ్చిన బాధితురాలు, తన శరీరంలోని గాయాలను , లోదుస్తులు, చెవి రింగులు కనిపించకపోవడాన్ని గమనించి జరిగిన దారుణాన్ని గ్రహించారు. వెంటనే పోలీసులను ఆశ్రయించడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. వైద్య పరీక్షల్లో కూడా ఆమెపై అఘాయిత్యం జరిగినట్లు ప్రాథమిక ఆధారాలు లభించాయి.
ఈ కేసులో కారులోని డ్యాష్ క్యామ్ అత్యంత కీలకమైన ఆధారంగా మారింది. నిందితులు దారుణానికి పాల్పడుతున్న సమయంలో కారులోని ఆడియో ,వీడియో దృశ్యాలు ఈ డ్యాష్ క్యామ్‌లో రికార్డ్ అయినట్లు పోలీసులు గుర్తించారు. బాధితురాలి స్టేట్‌మెంట్, ఈ సాంకేతిక ఆధారాల బలంతో నిందితులను సుఖేర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహిళలకు అత్యంత సురక్షితమైన సంస్థగా ప్రచారం చేసుకుంటున్న కంపెనీలోనే స్వయంగా సీఈఓ ఇలాంటి దారుణానికి పాల్పడటంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
