Racket Busted In Hyderabad:  హైదరాబాద్ నగరంలోని  ఓ హోటల్లో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను వెస్ట్ ​జోన్​ టాస్క్​ఫోర్స్​ పోలీసులు అరెస్ట్​చేశారు. ఈ కేసులో ఇద్దరు ఆర్గనైజర్లు, ముగ్గురు సబ్ ఆర్గనైజర్లు, ఒక కస్టమర్‌ను అరెస్టు చేశారు. ఆరుగురు మహిళలను పోలీసులు రక్షించారు. నిందితులను కె విజయ్ శేఖర్ రెడ్డి (49), అర్కోజిత్ ముఖర్జీ (30), వేణుగోపాల్ బాలాజీ (50), కిలారు కీర్తితేజ(29) గా గుర్తించారు. వీరంతా హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు.  వ్యభిచారం, అక్రమ రవాణాకు విజయ్ శేఖర్ రెడ్డితో పాటు సూర్యకుమారి  ప్రధాన సూత్రధారి అని తేలింది. 


సూర్యకుమారే లీడర్
ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు చెందిన ఆమె ఈ వ్యభిచార ముఠాకు లీడర్. ఈమె పై గతంలో కూడా పలు కేసులు నమోదయ్యాయి.  2020లో పీడీ యాక్టు కింద జైలుకు వెళ్లి వచ్చినా ఆమె తీరు మారలేదు.  పదికి పైగా మారు పేర్లతో చలామణి అవుతున్న సూర్యకుమారి  మధురానగర్​లో నివసిస్తోంది. తిరుపతికి చెందిన కె. విజయశేఖర్​ రెడ్డి (49) అక్కడే ఉండేవాడు. వీరుద్దరూ కలిసి నగరంలో వ్యభిచార గృహాలు నిర్వహించేవారు. 2020లో పీడీ యాక్టు కింద జైలుకు పంపినా తీరు మారలేదు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డబ్బు, ఉద్యోగాలు ఇప్పిస్తానని  విజయ శేఖర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, త్రిపుర తదితర రాష్ట్రాల నుంచి అమ్మాయిలను హైదరాబాద్‌కు పిలిపించుకునేవారని పోలీసులు తెలిపారు. తర్వాత వారిని బలవంతంగా వ్యభిచారంలోకి దింపేవారు.


కస్టమర్ల డేటాబేస్ శేఖర్ రెడ్డి పని
నిందితుల్లో ఒకరైన విజయ శేఖర్ రెడ్డి ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ ద్వారా కస్టమర్ల డేటాబేస్‌ను నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. శేఖర్ రెడ్డి కస్టమర్ల డేటాను యాప్ లో ఉంచేవారు. దాని ఆధారంగా కస్టమర్లు సూచించిన ప్రాంతాలు, హోటళ్లకు అమ్మాయిలను తీసుకెళ్లారు.  అందుకు సదరు మహిళ  క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా కస్టమర్ల నుంచి డబ్బులు తీసుకునేది. ఈ మేరకు టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ సాధన రష్మీ పెరుమాళ్‌ గురువారం మీడియాకు వివరాలు వెల్లడించారు.  ఆమె కస్టమర్లతో లావాదేవీలు జరిపేందుకు వివిధ రకాల చెల్లింపు పద్ధతులను ఉపయోగించారని  డీసీపీ తెలిపారు.


పార్క్ హోటల్‏లో సోదాలు
విశ్వసనీయ సమాచారం మేరకు పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని పార్క్‌ హోటల్‌లో సోదాలు నిర్వహించగా  కీర్తితేజతో పాటు ఒకరిని అదుపులోకి తీసుకున్నారు.  వాళ్లు ఇచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు  మిగతా నివాసాలపై దాడులు నిర్వహించి, ప్రధాన నిర్వాహకులు,  సబ్-ఆర్గనైజర్లను అరెస్టు చేశారు. ఈ కేసులో తదుపరి విచారణ జరుగుతుందని పోలీసులు తెలిపారు. ఈ సోదాలో పోలీసులు రూ.89,500 నగదు, రెండు వాహనాలు, 18 సెల్‌ఫోన్లు, రెండు ల్యాప్‌టాప్‌లు,  రెండు ట్యాబ్లెట్లు, వివిధ బ్యాంకులకు చెందిన 45 డెబిట్/క్రెడిట్ కార్డులు, మూడు పాస్‌బుక్‌లు, ఒక చెక్‌బుక్, 22 చెక్కులు, ఐదు సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే నిందితుల నుంచి 25 ఆధార్ కార్డులు, ఏడు పాన్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో పలు చర్యల కింద కేసు నమోదైంది.


పోలీసుల హెచ్చరిక
ఇదిలా ఉంటే, ప్రజలు తమ ఇళ్లను అద్దెకు ఇచ్చే సమయంలో జాగ్రత్తగా ఉండాలని..  అద్దెదారుల కుటుంబ నేపథ్యాన్ని తప్పనిసరిగా తనిఖీ చేయాలని పోలీసులు హెచ్చరించారు. దీనితో పాటు, తమ ప్రాంతంలో అక్రమ రవాణా, వ్యభిచారానికి సంబంధించిన ఏదైనా సమాచారం గురించి పోలీసులకు తెలియజేయాలని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.