Maharashtra Crime News: పూణేలోని వార్జే-మల్వాడి ప్రాంతంలో ఒక దిగ్భ్రాంతికరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. శ్రావణ మాసంలో మాంసాహారం అడిగిన విషయంలో జరిగిన గొడవలో ఒక తండ్రి తన సొంత కొడుకును హత్య చేశాడు. మద్యం సేవించి ఇంటికి వచ్చిన 30 ఏళ్ల ఆ వ్యక్తి, మటన్ కావాలని డిమాండ్ చేశాడు. 

Continues below advertisement

శ్రావణ్ కారణంగా ఇంట్లో మాంసాహారం వండనని తండ్రి పట్టుబట్టడంతో వివాదం ముదిరింది. దీంతో తండ్రి తన కొడుకు తల, ముఖంపై దారుణంగా దాడి చేయడంతో అతను మరణించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అనంతరం ఈ ఘటన గురించి పోలీసులకు సమాచారం అందించారు.

మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు 

మృతుడిని మహేష్ భగవత్ గైక్వాడ్ (30)గా గుర్తించారు. మహేష్ సోదరుడి ఫిర్యాదు ఆధారంగా వార్జే-మల్వాడి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. పోలీసులు మృతుడి తండ్రి భగవత్ సూర్యభాన్ గైక్వాడ్ (64), తల్లి పార్వతి భగవత్ గైక్వాడ్ (60)లను అరెస్టు చేశారు.

Continues below advertisement

పోలీసుల కథనం ప్రకారం, వార్జే-మల్వాడిలోని రామ్‌నగర్ ప్రాంతంలో ఆగస్టు 24 రాత్రి 10:30 గంటల నుంచి ఆగస్టు 25 ఉదయం 4:00 గంటల మధ్య ఈ ఘటన జరిగింది. మహేష్‌కు మద్యపాన వ్యసనం ఉందని, అతను ఉద్యోగం చేసేవాడు కాదని సమాచారం. పగలంతా మద్యం తాగుతూ ఎక్కడెక్కడో తిరిగే వాడు. రాత్రి అయ్యే సరికి ఇంటికి వెళ్లి భోజనం చేసి పడుకునే వాడు. 

తండ్రి కొడుకుల మధ్య తరచూ గొడవలు  

అతను తన తాగుడు అలవాట్ల విషయంలోనూ, మాంసాహారం కావాలన్న తన పట్టుదల విషయంలోనూ తరచుగా తండ్రితో గొడవపడేవాడు. ప్రస్తుతం శ్రావణ మాసం కావడంతో ఇంట్లో మాంసాహారం వండటం లేదు. ఆగష్టు 24వ తేదీ రాత్రి, మహేష్ తాగి ఇంటికి తిరిగి వచ్చి మటన్ చేయాలని పట్టుబట్టాడు. 

మాంసం కావాలని పట్టుపట్టిన కొడుకు 

శ్రావణ్ కారణంగా మాంసాహారం వండవద్దని కుటుంబ సభ్యులు పట్టుబట్టినప్పటికీ, తన పట్టును వదల్లేదు. దీంతో తండ్రీకొడుకుల మధ్య గొడవ జరిగింది. తీవ్ర ఆగ్రహానికి గురైన తండ్రి, మహేష్ ముఖం, తలపై దాడి చేశాడని ఆరోపణలు ఉన్నాయి. ఈ దాడిలో మహేష్ మరణించాడు.

పోలీసులు ఏం చెబుతున్నారు?

పోలీసుల కథనం ప్రకారం, మహేష్ మరణం గురించి తెలిసినప్పటికీ, అతని తల్లి తన భర్తను కాపాడటానికి వెంటనే ఆ విషయాన్ని పోలీసులకు చెప్పలేదు. ఆమె ఈ ఘటనకు సంబంధించిన సాక్ష్యాలను ధ్వంసం చేసిందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. దీంతో పోలీసులు తల్లిని నిందితురాలిగా అరెస్టు చేశారు.

తల్లిదండ్రులను విచారిస్తున్న పోలీసులు

మహేష్‌కు సుమారు 10 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. అయితే, అతనికి మద్యపాన వ్యసనం ఉండటం, ఉద్యోగం లేకపోవడం వల్ల అతని భార్య వారి ఇద్దరు పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్లిపోయింది. కొంతకాలం క్రితం వారికి విడాకులు అయ్యాయి. ఆ తర్వాత మహేష్ ఒంటరిగా జీవిస్తూ, భోజనం కోసం తన పుట్టింటికి వెళ్లేవాడు. వార్జే-మల్వాడి పోలీసులు ప్రస్తుతం ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు, అరెస్టు అయిన తల్లిదండ్రులను విచారిస్తున్నారు.