రాప్తాడు: అప్పటివరకూ ఏంతో ప్రశాంతంగా ఉన్న స్కూల్ వాతావరణం భయానకంగా మారింది. ఓ యువకుడు ఉన్మాదిగా మారి చెట్లు కోసే రంపంతో దాడి చేయడంతో ఓ టెన్త్ క్లాస్ విద్యార్థిని తీవ్ర గాయాలయ్యాయి. అనంతపురం జిల్లా రాప్తాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం నాడు ఈ ఘటన చోటుచేసుకుంది. 

Continues below advertisement

జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న గోపిక లక్ష్మి అనే విద్యార్థినిపై ఓ ఉన్మాది అత్యంత దారుణంగా దాడికి పాల్పడ్డాడు. సమాచారం ప్రకారం, నిందితుడు చెక్క మొద్దులు కోసే రంపపు మిషన్‌తో విద్యార్థిని గొంతు కోసి పరారైనట్లు తెలుస్తోంది. ఈ హఠాత్ పరిణామంతో స్కూల్ ప్రాంగణంలో ఉన్న విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు సైతం తీవ్ర భయాందోళనకు గురయ్యారు. నరరూప రాక్షసుడి దాడిలో తీవ్రంగా గాయపడిన గోపిక లక్ష్మిని వెంటనే చికిత్స నిమిత్తం అనంతపురం జిల్లా ఆసుపత్రికి తరలించారు. బాధితురాలికి ఓ చేతి తెగిపోవడంతో పాటు ముఖం, మెడ భాగంలో గాయాలతో తీవ్రరక్తస్రావం అయింది. ఈ ఘటలో మరో విద్యార్థి కూడా గాయపడినట్లు సమాచారం. కాగా, ఈ దాడికి గల కారణాలు, నిందితుడి వివరాలు ఇంకా తెలియరావాల్సి ఉంది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Continues below advertisement

బడికెళ్లిన బాలిక క్లాస్ రూములోనే రక్తపు మడుగులో కుప్పకూలిపోయింది. పుస్తకాలతో స్కూలుకు వెళ్లిన కుమార్తెపై పాశవిక దాడి జరిగిందన్న సమాచారంతో కుటుంబసభ్యులు, బంధువులు ఆందోళనతో అక్కడికి వెళ్లారు. తరగతి గదిలో రక్తంతో భయానక వాతావరణం నెలకొంది. వారికి ఎటు చూసినా రక్తపు మరకలే కనిపించడంతో తీవ్ర ఆందోళన చెందారు.  కుమార్తె భవిష్యత్తుపై ఎన్నో కలలు కంటున్న పదో తరగతి విద్యార్థినిపై ఓ ఉన్మాది అత్యంత కిరాతకంగా దాడి చేయడం స్థానికంగా కలకలం రేపింది. చెట్లు, కలప కోసేందుకు ఉపయోగించే విద్యుత్ రంపంతో ఉన్మాది క్లాస్ రూములోకి ఎలా ప్రవేశించాడని వారు ప్రశ్నిస్తున్నారు. టీచర్లు, సిబ్బంది ఏం చేస్తున్నారని నిలదీశారు.  

మరోవైపు ఆ బాలిక అనంతపురం ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతోంది. ఏదైనా సమస్య ఉంటే చంపడం పరిష్కారం కాదని పోలీసులు, అధికారులు చెబుతున్నారు. 

నిందితుడిని వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షించాలని బాలిక మేనత్త డిమాండ్ చేశారు. స్కూళ్లలోకి ఇలా ఆయుధాలతో వచ్చి దాడులు చేస్తున్నారంటే, తమ పిల్లల భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతిరోజూ స్కూలుకు ఆటోలో వెళ్లి వస్తుందని, ఎప్పటిలాగే ఈరోజు స్కూలుకు వెళ్లిన పాపై చెట్లు కోసే రంపంతో దాడి జరగడం మాకు గుండెకోత అని ఆవేదన వ్యక్తం చేశారు.