Proddatur Accident : వైఎస్ఆర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని టెంపో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. కడప జిల్లా ప్రొద్దుటూరు సమీపంలోని చాపాడు వద్ద శుక్రవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతి శ్రీవారి దర్శనం చేసుకుని కాసేపట్లో ఇంటికి చేరుకుంటామనే సమయంలో ఆగి ఉన్న లారీని టెంపో ఢీకొనడంతో ప్రమాదం చోటుచేసుకుంది. మృతులు అనూష, ఓబులమ్మ, రామలక్ష్మిగా పోలీసులు గుర్తించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన చాపాడు పోలీసులు దర్యాప్తు చేశారు.
టైర్ పేలి అదుపుతప్పిన వాహనం
వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు చనిపోయారు. మరో ఎనిమిది మందికి తీవ్రగాయాలయ్యాయి. ప్రొద్దుటూరులోని వైఎంఆర్ కాలనీకి చెందిన 11 మంది బంధువులు టెంపో వాహనంలో తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లారు. అక్కడ నుంచి తిరిగి స్వగ్రామానికి వస్తుండగా శుక్రవారం తెల్లవారుజామున మైదుకూరు- ప్రొద్దుటూరు జాతీయ రహదారిపై టెంపో టైర్ పంక్చర్ అయింది. దీంతో టెంపో అదుపుతప్పి చాపాడు వద్ద రోడ్డుపై నిలిచి ఉన్న బొగ్గు లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రామలక్ష్మమ్మ(50), ఓబులమ్మ(47), అనూష(30) ఘటనాస్థలిలోనే మృతి చెందారు. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. మరో 10 కిలోమీటర్లు ప్రయాణిస్తే ఇంటికి చేరుకుంటారనగా ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.
యువకుడి కడుపులో గుచ్చుకున్న బోర్ హ్యాండిల్
ఓ పద్దెనిమిదేళ్ల యువకుడు రాత్రి ఇసుక పని కోసం ఇంటికి వెళ్లాడు. వేకువజామున ఇంటికి తిరిగి వచ్చే క్రమంలో అదుపుతప్పి బోరుబావిపై పడిపోయాడు. ఈ క్రమంలోనే బోర్ హ్యాండిల్ యువకుడి కడుపులోకి చొచ్చుకెళ్లింది. విషయం గుర్తించిన స్థానికులు దాన్ని వెల్డింగ్ మిషన్ తో కట్ చేశారు. కొంత భాగం కడుపులో ఉండడంతో అతడికి శస్త్ర చికిత్స నిర్వహించి దాన్ని తొలగించారు. ప్రకాశం జిల్లా కనిగిరి రాజీవ్ నగర్ లో గురువారం వేకువ జామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కనిగిరి ఇందిరా కాలనీకి చెందిన 18 ఏళ్ల కంటు నాగరాజు బుధవారం రాత్రి ఇసుక పనికి వెళ్లి తెల్లవారుజామున తన ద్విచక్ర వాహనంపై ఇంటికి వస్తున్నారు. రాజీవ్ నగర్ వద్ద అదుపు తప్పి ఎదురుగా ఉన్న చేతి పంపును ఢీకొట్టారు. దీంతో బోర్ హ్యాండిల్ ఆయన కడుపులోకి చొచ్చుకెళ్లింది. విషయం గుర్తించిన స్థానికులంతా అక్కడకు వచ్చారు. అతడి కడుపులోంచి దాన్ని ఎలా తీయాలా అని చాలా ఆలోచించారు. చివరకు వెల్డింగ్ మిషన్ ద్వారా చేతి పంపును కోసేయాలనుకున్నారు. ఈ క్రమంలోనే స్థానికంగా ఉన్న వెల్డింగ్ దుకాణ యజమానికి చెప్పి దాన్ని తొలగించారు.
అయితే అప్పటికే కడుపులో కాస్త భాగం ఇరుక్కుపోవడంతో.. వెంటనే యువకుడిని ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి మరింత విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం ఒంగోలులోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వైద్యులు శస్త్ర చికిత్స చేసి క్షతగాత్రుడి కడుపులోంచి రాడ్డును తొలగించారు. ప్రస్తుతం అత్యవసర విభాగంలో చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న సదురు యువకుడి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తమ కళ్ల ముందే కడుపులో బోరు హ్యాండిల్ ఇరుక్కుపోవడాన్ని చూసి గుండెలవిసేలా రోదించారు. తమ కుమారుడికి ఏం జరగడకూడదని దేవుడిని ప్రార్థిస్తూనే ఉన్నారు.