Pradip Guruji fake note racket: ఆధ్యాత్మిక గురువుగా చలామణి అవుతూ, సమాజ సేవ పేరుతో కోట్లాది రూపాయల దొంగ నోట్లను ముద్రించిన ప్రదీప్ గురూజీ అలియాస్ ప్రదీప్ జోతంగియా ఉదంతం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ ఈ కేసులో ప్రధాన నిందితుడైన ప్రదీప్ గురూజీని పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పుడు ఆయన చెప్పిన సమాధానం విని అందరూ నోరెళ్లబెట్టారు. మంచి పనులు చేయాలనుకున్నాం, కానీ మా దగ్గర తగినన్ని డబ్బులు లేవు. అందుకే మాకు కావలసిన డబ్బును మేమే తయారు చేసుకోవాలని నిర్ణయించుకున్నాం అని ఆయన పోలీసుల విచారణలో చాలా సాధారణంగా చెప్పుకొచ్చారు. సమాజ సేవ కోసం చేసిన తప్పు కాబట్టి అది నేరం కాదన్నట్లుగా ఆయన వాదించడం గమనార్హం. సూరత్‌లో శ్రీ సత్యం యోగ ఫౌండేషన్ పేరిట ఆశ్రమాన్ని నడుపుతున్న ఈ గురూజీ, తన అనుచరులతో కలిసి ఈ ముఠాను ఏర్పాటు చేశారు. యోగా తరగతులు, ఆధ్యాత్మిక బోధనల ముసుగులో గత మూడు నాలుగు నెలలుగా గుట్టుచప్పుడు కాకుండా తన ఆశ్రమంలోనే నకిలీ నోట్ల కర్మాగారాన్ని నడిపించారు. అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఒక కారును వెంబడించి పట్టుకోవడంతో, సుమారు రూ. 2.38 కోట్ల విలువైన నకిలీ నోట్లు బయటపడ్డాయి. ఈ గ్యాంగ్ సామాన్యమైన దొంగ నోట్లు తయారు చేయలేదు. దొంగ నోట్ల ముద్రణకు అవసరమైన హై-క్వాలిటీ సెక్యూరిటీ పేపర్‌ను వీరు చైనా నుండి ఆన్‌లైన్ ద్వారా తెప్పించుకున్నారు. విచారణలో బయటపడిన మరో విస్తుపోయే విషయం ఏమిటంటే.. వీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ , ఫోటో ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్‌లను ఉపయోగించి అసలు నోట్లకు ఏమాత్రం తీసిపోని విధంగా డిజైన్లను రీప్రొడ్యూస్ చేశారు. నోట్లపై ఉండే వాటర్‌మార్క్, సెక్యూరిటీ థ్రెడ్‌లను కూడా అత్యంత నేర్పుగా సృష్టించారు. గురూజీ అరెస్ట్ అయిన తర్వాత ఆయనకు ఉన్న పలుకుబడి చూసి పోలీసులు సైతం ఆశ్చర్యపోయారు. ఆయనకు పలువురు రాజకీయ నేతలు, మాజీ ఉన్నతాధికారులతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు సోషల్ మీడియా ఫోటోల ద్వారా తెలుస్తోంది. ప్రభుత్వ వాహనాలపై ఉండే తరహా గుర్తులను తమ వాహనాలపై వేసుకుని, పోలీసుల కళ్లు గప్పి రాష్ట్రవ్యాప్తంగా ఈ నోట్లను చలామణి చేసేందుకు ప్లాన్ చేశారు. ఏజెంట్లకు 20 నుండి 25 శాతం కమిషన్ ఇస్తూ మార్కెట్లోకి ఈ నోట్లను వదిలినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.
సేవ కోసమే నోట్లు ముద్రించాం అని గురూజీ ఎన్ని కల్లిబొల్లి కబుర్లు చెప్పినా పోలీసులు మాత్రం కఠినంగానే ఉన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే ఇలాంటి నేరాలు దేశద్రోహం కిందకే వస్తాయని అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం గురూజీతో పాటు ఏడుగురు అనుచరులను అరెస్ట్ చేసి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యు ఫోరెన్సిక్ టీమ్ సాయంతో ఈ నకిలీ నోట్ల నెట్‌వర్క్ ఎంత లోతుగా ఉందో ఆరా తీస్తున్నారు.
