Police crack kidnapping case of a man in Amberpet: వాళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు. మూడున్నరేళ్ల వరకూ కలసి ఉన్నా..తర్వాత ఉండలేమని విడాకులు తీసుకున్నారు. పెళ్లి సమయంలో అమెరికాలో ఉన్న ఇద్దరూ ఇండియాకు వచ్చేశారు. మూడేళ్ల తర్వాత ఇప్పుడు ఆ వ్యక్తి కిడ్నాపయ్యాడు. చేయించింది మాజీ భార్యేనని పోలీసులు తేల్చి అరెస్టు చేశారు.
గత 29న శ్యామ్ అనే వ్యక్తి కిడ్నాప్
అంబర్‌పేట్ డీడీ కాలనీలో గత నెల 29వ తేదీన చోటుచేసుకున్న కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. ఈ ఘటనలో పాలుపంచుకున్న 10 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి తెలిపారు.మంత్రి శ్యామ్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేసి రూ.1.5 కోట్ల రూపాయలు డిమాండ్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుల వద్ద నుంచి మూడు కార్లు, రెండు ద్విచక్ర వాహనాలు, ఎనిమిది మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఆరుగురు నిందితులు శ్యామ్‌ను అపహరించారని పోలీసులు గుర్తించారు.
డబ్బుల కోసం మాజీ భార్యనే కిడ్నాప్ చేసినట్లుగా గుర్తింపు
వారు రెంట్ కార్లలో ఈ నేరానికి పాల్పడినట్లు విచారణలో తేలింది.ప్రధాన నిందితురాలు మాధవీలత అమెరికాలో మంత్రి శ్యామ్‌తో వివాహం చేసుకొని మూడు సంవత్సరాల వ్యవధిలోనే విడాకులు పొందింది. గత మూడు సంవత్సరాలుగా ఆమె భర్తకు దూరంగా ఉంది. బాధితుడు శ్యామ్ తన పేరును ‘అలీ’గా మార్చుకొని ఫాతిమా అనే మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. శ్యామ్ తండ్రి నుంచి వచ్చిన రూ.20 కోట్ల విలువైన ఆస్తిని విక్రయించినట్లు సమాచారం. అయితే విడాకుల ఒప్పందంలో ఆస్తులు తనకు రావాలని మాజీ భార్య గొడవకు దిగుతున్నట్లుగా తెలుస్తోంది. దాంతో ఆమె అలీగా మారిన శ్యామ్ ను కిడ్నాప్ చేసి డబ్బులు దండుకోవాలని నిర్ణయించింది. ప్లాన్ ను అమలు చేసింది.
మహిళా బౌన్సర్‌తో పాటు రెక్కీ చేసిన మహిళా నిందితులు
ఈ గ్యాంగ్ ప్రధాన సూత్రధారి సాయి అనే వ్యక్తి రామనగర్ ప్రాంతానికి చెందినవాడని పోలీసులు తెలిపారు. మరో నిందితురాలు జీ.ప్రీతి లేడీ బౌన్సర్‌గా పనిచేస్తుండగా, ఎల్.సరిత అనే మరో మహిళ బాధితుడు ఉన్న అపార్ట్‌మెంట్‌లోనే ఘటనకు రెండు రోజుల ముందు నివసించి, అతని కదలికలపై నిఘా పెట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు. బాధితుడిని చెర్లపల్లి ప్రాంతానికి తీసుకెళ్లి రెండు ప్రదేశాల్లో తిప్పుతూ రూ.30 లక్షలు డిమాండ్ చేసినట్లు విచారణలో తేలింది.
బాధితుడు డబ్బులు సర్దుబాటు చేసుకోవడానికి తన స్నేహితుడికి ఫోన్ చేయగా, ఆ స్నేహితుడు వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. శ్యామ్ తెలివిగా తప్పించుకుని పోలీసులకు వివరాలు తెలియజేశాడు.కేసు నమోదు చేసిన పోలీసులు 10 మందిని అరెస్ట్ చేశారు. కేసులో మిగిలిన నలుగురిని త్వరలో పట్టుకుంటామని డీసీపీ బాలస్వామి తెలిపారు.