Police arrest grandmother involved in street robberies and murders: 16 ఏళ్ల క్రితం జాతీయ రహదారిపై ఓ హత్య జరిగింది. నిందితులు ఎవరో పోలీసులు కనిపెట్టలేకపోయారు. కానీ అనూహ్యంగా పదహారేళ్ల తర్వాత ఓ 70 ఏళ్ల  బామ్మను పోలీసులు అరెస్టుచేశారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఈ ఘటన జరిగింది.  హైవే దోపిడీ-హత్య కేసులో  ఆమె కీలక పాత్రధారిగా గుర్తించారు.  

కుటుంబంతో కలిసి దోపిడీ ముఠాను నిర్వహిస్తున్న బామ్మ                 

2009 మార్చి 18న, రాత్రి 9:45 గంటల సమయంలో, అహ్మదాబాద్‌లో   ఇందిరానగర్ వద్ద హైవేలో  హత్య జరిగింది.  దక్ష అనే మహిళ ,  ఆమె భర్త రాజేష్, ఘట్లోడియాలో ఒక పరిచయస్తుడి అంత్యక్రియలకు హాజరై ఇంటికి తిరిగి వెళ్తుండగా దాడి జరిగింది.  జమ్నా సహా తొమ్మిది మంది నిందితుల గ్యాంగ్ ఈ దంపతులను అడ్డగించి, లాండ్రీ బ్యాట్‌తో కొట్టి తీవ్రంగా గాయపరిచారు. ఆ తర్వాత వారి నగదు, నగలు,  ఫోన్‌లను దోచుకుని పరారయ్యారు.  గాయపడిన దంపతులను దారిపోయే వారు ఆసుపత్రికి తరలించారు. అయితే, చికిత్స సమయంలో రాజేష్ మరణించాడు. దక్ష ప్రాణాలతో బయటపడింది.                    

అందరూ దొరికినా పదహారేళ్ల పాటు తప్పించుకు తిరిగిన బామ్మ             

దక్ష ఫిర్యాదు ఆధారంగా, అస్లాలీ పోలీస్ స్టేషన్‌లో జమ్నా మరియు మరో ఎనిమిది మందిపై  కేసు నమోదైంది.  తొమ్మిది మంది నిందితులలో ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. వీరిలో నలుగురు దక్ష కుమారులు. వీరిలో ఏడుగురు ట్రయల్ కోర్టు ద్వారా దోషులుగా నిర్ధారించింది.  హత్య ఆరోపణల ఆధారంగా కొంత మందికి ఏడు సంవత్సరాలు, మరి కొంత మంది జీవిత ఖైదు శిక్షలకు గురయ్యారు.  ఒక నిందితుడు నిర్దోషిగా విడుదలయ్యాడు. అయితే  జమ్నా మాత్రం 16 సంవత్సరాలుగా పోలీసులకు అందకుండా గుజరాత్‌లోని వివిధ గ్రామాలు, నగరాలలో తిరుగుతూ తప్పించుకుంది.                    

కుమార్తెను కలవడానికి రావడంతో పట్టుకున్న పోలీసులు       

జమ్నా తన కుమార్తెను కలవడానికి అహ్మదాబాద్‌లోని అస్లాలీలో తన ఇంటికి వచ్చిన సమయంలో, అహ్మదాబాద్ రూరల్ పోలీసులు ఆమెను జూలై 29, 2025న అరెస్ట్ చేశారు. ఆమె పరారీలో ఉన్న  కాలంలో, జమ్నా భర్త అర్జన్ కోవిడ్ సమయంలో మరణించాడు. ఆమె నలుగురు కుమారులలో ఇద్దరు శిక్ష పూర్తి చేసి జైలు నుండి విడుదలయ్యారు, మరో ఇద్దరు  ఇంకా జైలులో ఉన్నారు.

జమ్నా కుటుంబం ఈ కేసులో పూర్తిగా ఇరుక్కుపోయింది.  ఆమె భర్త , నలుగురు కుమారులు కూడా ఈ దోపిడీ-హత్య కేసులో నిందితులుగా ఉన్నారు. ఈ కుటుంబం గతంలో కూడా ఇతర నేరాలలో పాల్గొన్నట్లు పోలీసులు తెలిపారు. - జమ్నా ప్రస్తుతం అహ్మదాబాద్ రూరల్ పోలీసుల అదుపులో ఉంది. ఆమెపై విచారణ పూర్తి చేసి.. శిక్ష వేసేలా కోర్టులో వాదించనున్నారు.