Vizag Crime News : విశాఖపట్నంలో న్యూ ఇయర్ వేడుకల్లో డ్రగ్స్ చెలామణీ చేసేందుకు వచ్చిన ముఠాలోని ఐదుగురు సభ్యుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కానీ వారిలో ఒకరు పోలీసుల కళ్లు గప్పి స్టేషన్ నుంచి పారిపోయాడు. దాంతో అతని కోసం వైజాగ్ పోలీసులు అన్ని చోట్లా గాలిస్తున్నారు. వైజాగ్ మూడో పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఈ ఘటన జరిగింది.
విశాఖపట్నంలో న్యూ ఇయర్ రోజున యూత్‌కి డ్రగ్స్ అమ్మేందుకు వైజాగ్ లో అడుగుపెట్టిన ముఠా పై నిఘా ఉంచిన పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేశారు. వారిని అదుపులోకి తీసుకున్న ఏరియా మూడో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోనిది కావడంతో ఆ స్టేషన్‌కి నిందితుల్ని అప్పగించారు. వీరిని ఆదివారం సాయంత్రం సుమారు 4.30 గంటల ప్రాంతంలో కోర్టుకు తీసుకెళ్లేందుకు పోలీసులు ఏర్పాట్లు చేశారు.ఆ నిందితుల్లో ఒకరైన కరుణాకర్ (25) టాయిలెట్ వస్తోంది.. అని అడిగాడు.
దాంతో పోలీసులు లాకర్ నుంచి అతడ్ని బయటికి వదిలి.. స్టేషన్ సమీపంలోనే ఉన్న బాత్‌రూముకి వెళ్లమన్నారు. కానీ అతను ఎంతకీ తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చి వెళ్లి చూడగా.. అక్కడ అతను లేడు. దాంతో తప్పించుకున్నట్లు నిర్ధారించుకుని ఉన్నతాధికారులకి సమాచారం అందించారు.కరుణాకర్‌ని పట్టుకోవడానికి ప్పోలీస్ టీమ్‌ని ఏర్పాటు చేశారు. బస్టాండ్, రైల్వేస్టేషన్ వద్ద నిఘా పెట్టారు. అలానే నిందితుడు వెళ్లిన మార్గాల్లోని సీసీ టీవీ ఫుటేజీల్ని పరిశీలిస్తున్నారు. స్టేషన్‌లో సిబ్బంది తక్కువగా ఉండటంతో అతడ్ని పర్యవేక్షించలేకపోయినట్లు పోలీసులు చెబుతున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన నగరంలో హాట్ టాపిక్ అయింది.
మరో వైపు హైదరాబాద్‌లో ఇంటర్నేషనల్ డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టయ్యింది. ముంబై నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఓ ముఠాను రాచకొండ పోలీసులు పట్టుకున్నారు. ఒక నైజీరియన్‌తో పాటు మరో నిందితుడ్ని పట్టుకున్నారు. నిందితుల నుండి 30 గ్రాముల ఎండీఎంఏ, డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. అటు.. మరో కేసులోనూ అంతర్‌రాష్ట్ర డ్రగ్స్ ముఠా అరెస్ట్ అయ్యింది. రాజస్థాన్ నుండి హైదరాబాద్‌కు డ్రగ్స్ తరలిస్తుండగా.. పోలీసులు ఆ ముఠాని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుండి 45 గ్రాముల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. నగరంలో భారీఎత్తున డ్రగ్స్ దందా కొనసాగుతోందని సమాచారం అందుకున్న పోలీసులు.. దీనిని అరికట్టేందుకు ఆపరేషన్లు చేపట్టారు. డ్రగ్స్ దందా చేస్తున్నవారిని పట్టుకుంటున్నారు.
న్యూ ఇయర్ వేడుకల కోసం.. విదేశాలకు మత్తు మందు ఎగుమతి చేస్తున్న ఇద్దరిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ. 9 కోట్లు విలువ చేసే 8 కిలోల డ్రగ్స్‌ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా హైదరాబాద్ నుంచి కొరియర్ ద్వారా విదేశాలకు మాదకద్రవ్యాలు సరఫరా చేస్తున్నట్లు వెల్లడించారు. అంతకుముందు కూడా హైదరాబాద్ నార్కోటిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ సిబ్బందితో కలిసి మంగళ్‌హాట్ పోలీసులు.. ముగ్గురు గంజాయి వ్యాపారులను, ఒక గంజాయి రవాణాదారుని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 72 కేజీల గంజాయి, 1.8 కేజీల గంజాయి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో హైదరాబాద్ మంగళ్‌హాట్‌లోని ధూల్‌పేట్ ఆకాష్ సింగ్‌ను ప్రధాన నిందితుడిగా గుర్తించారు. 2018 నుంచి అతను ఖమ్మంకు చెందిన షేక్ సుభానీ నుంచి గంజాయిని సేకరించి.. హైదరాబాద్‌లో పలువురు వినియోగదారులకు విక్రయిస్తున్నాడు.