POCSO case filed against Tuni Rapiest: తుని బాలికల గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న ఓ బాలికను తాతను అని చెప్పి తాటిక నారాయణరావు అనే వ్యక్తి స్కూల్ నుంచి బయటకు తీసుకెళ్లారు. స్కూటీ మీద బాలికను ఓ తోటలోకి తీసుకెళ్లాడు. అత్యాచార యత్నం చేశాడు. అదే సమయంలో గమనించి తోట యజమాని ఈ తతంగాన్ని వీడియో తీశారు. స్కూల్లో ఉండాల్సిన బాలికను తోటకు ఎందుకు తీసుకొచ్చావని ప్రశ్నించాడు. తనకు సంబంధం లేదంటూ బుకాయించే ప్రయత్నం చేశాడు. నారాయణరావు మీద బాలిక కుటుంబం, బంధువులు దాడి చేశారు. చితకబాదిన తరువాత నిందితుడ్ని పోలీసులకు అప్పగించారు. బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదుతో తుని పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
ఈ ఘటనలో నిందితుడు.. తాను కౌన్సిలర్‌నని చెప్పుకోవడంతో.. టీడీపీ నేత అన్న ప్రచారం జరిగింది. దీనిపై టీడీపీ వివరణ ఇచ్చింది. సభ్య సమాజం తలదించుకునేలా జరిగిన ఈ ఘటన క్షమించరానిది. ఇటువంటి చర్యలను ఈ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. ఎంతటి వారినైనా, ఏ పార్టీకి చెందిన వారినైనా కఠినంగా శిక్షిస్తుంది. టీడీపీకి సంబంధించిన ఏ విభాగంలో కూడా ప్రస్తుతం నిందితుడికి ఏ పదవీ లేదు. తప్పు చేస్తే నాయకులకైనా, సామన్యులకైనా ఒకే శిక్షలు ఉంటాయి. ఇప్పటికే నిందితుడిపై కేసులు నమోదు చేసి, అరెస్ట్ చేసి రిమాండుకు పంపుతున్నారు. కఠినమైన శిక్షలు పడేలా పోలీసుల చర్యలు తీసుకుంటున్నారని స్పష్టం చేసింది.
ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా ఈ అంశంపై స్పందించారు . తుని రూరల్ గురుకుల పాఠశాల విద్యార్థినిపై తాటిక నారాయణరావు అనే కామాంధుడు అత్యాచార యత్నానికి పాల్పడినట్లు తెలుసుకొని షాక్ కు గురయ్యాను. సంఘటన వివరాలు తెలిసిన వెంటనే పోలీసులు అతడిపై పోక్సో కేసు నమోదు చేసి అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు. ఇటువంటి ఘటనలకు పాల్పడే వాడెవరైనా ఉక్కుపాదంతో అణచివేస్తాం. బాధితురాలు ధైర్యంగా ఉండేలా కౌన్సిలింగ్ ఇచ్చి, అన్నివిధాలా సహాయ, సహకారాలు అందిస్తాం. గురుకుల పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లలో చదువుకునే విద్యార్థినులకు పటిష్టమైన భద్రత కల్పించాల్సిందిగా అధికార యంత్రాంగానికి ఆదేశాలు ఇచ్చామన్నారు.