Indecent behavior in cycling track: హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో అసభ్యకరంగా ప్రవర్తించే ఆకతాయిలు ఎక్కువైపోయారన్న విమర్శలు వస్తున్నాయి. తాజాగా ఓ యువతి సైక్లింగ్ ట్రాక్ పై రన్నింగ్ చేస్తున్న సమయంలో ఓ వ్యక్తి ఆమెను చూస్తూ అసభ్యకరంగా ప్రవర్తించాడు. దాంతో ఆమె...ఆ దృశ్యాలను రికార్డు చేసి.. భద్రతా పరమైన సందేహాలను లేవనెత్తారు. దాంతో ఆ వీడియో వైరల్ గా మారింది.
హైదరాబాద్ ఐటీ కారిడార్‌లోని నానక్‌రామ్‌గూడ సైక్లింగ్ ట్రాక్‌పై జరిగిన ఈ అసభ్యకర ఘటన నగరవాసులను ఉలిక్కిపడేలా చేసింది. ఉదయం ఆరు గంటలకు జాగింగ్‌కు వెళ్లిన ఒక యువతికి ఎదురైన చేదు అనుభవం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఉదయం 6:15 గంటల సమయంలో తాను రన్నింగ్ చేస్తున్నప్పుడు ఒక వ్యక్తి అసభ్యకర చేష్టలకు పాల్పడటం చూసి సదరు యువతి దిగ్భ్రాంతికి గురైంది. ఆ దృశ్యాలను తన ఫోన్‌లో రికార్డు చేసి సోషల్ మీడియాలో షేర్ చేసింది.
తాను రన్నింగ్ దుస్తుల్లో ఉన్నానని ఇందులో తప్పేముందని ప్రశ్నించింది. కేవలం భద్రత కోసమే సూర్యుడు వచ్చిన తర్వాత రన్నింగ్‌కు వస్తున్నా.. అయినా ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరం అని వాపోయింది. ఆఖరికి ఆటోలో వెళ్తున్నప్పుడు కూడా ప్రజల చూపుల వల్ల తాను అభద్రతా భావానికి లోనవుతున్నానని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఈ వీడియో వైరల్ కావడంతో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్పందించారు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్లు వెల్లడించారు. బాధితురాలు ధైర్యంగా సోషల్ మీడియాలో ఫిర్యాదు చేయడాన్ని ఆయన అభినందించారు. ప్రస్తుతం సీసీటీవీ ఫుటేజీలు , ఇతర ఆధారాల ద్వారా నిందితుడి ఆచూకీ కోసం గాలిస్తున్నామని, త్వరలోనే అతడిని అరెస్ట్ చేస్తామని స్పష్టం చేశారు.
ఇలాంటి ఘటనలు ఎదురైనప్పుడు మహిళలు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే 100 కు డయల్ చేయాలని పోలీసులు సూచించారు. సకాలంలో సమాచారం అందితే నిందితులను పట్టుకోవడం సులభమవుతుంది. ఫిర్యాదు చేయడానికి వెనుకాడొద్దు, మీ భద్రతే మా ప్రాధాన్యత అని ఆయన నగరవాసులకు భరోసా ఇచ్చారు. పబ్లిక్ ప్రదేశాల్లో భద్రతను మరింత కఠినతరం చేసేందుకు నిరంతర నిఘా ఉంచుతామని పోలీసులు తెలిపారు.
