Parigi Road Accident | పరిగి: వికారాబాద్ జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, టూరిస్టు బస్సు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మహిళలు సహా నలుగురు వ్యక్తులు మృతిచెందగా, మరో 20 మందికి వరకు గాయపడ్డారు. పరిగి మండలం రంగాపూర్ సమీపంలోని బీజాపూర్- హైదరాబాద్ జాతీయ రహదారిపై మే 20న ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది.
పోలీసుల తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం చెన్వెళ్లికి చెందిన పలువురు పరిగిలో జరిగిన విందుకు హాజరయ్యారు. టూరిస్టు బస్సులో తిరిగి వస్తుండగా మార్గం మధ్యలో ఓ చోట రోడ్డుపై నిలిచి ఉన్న లారీని వీరు ప్రయాణిస్తున్న వాహనం వెనుక నుంచి వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే చనిపోయాగా, గాయపడిన వారిని పరిగి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వారిని పరీక్షించిన డాక్టర్లు మరో ముగ్గురు మార్గం మధ్యలోనే ప్రాణాలు కోల్పోయారని నిర్ధారించారు. తీవ్ర గాయాలపాలైన వారికి పరిగి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన ట్రీట్మెంట్‌కు హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.