Peddapalli Engineering Student Death: పెద్దపల్లి జిల్లా ఇంజినీరింగ్ విద్యార్థిని తాండ్ర అక్షితారాణి(20) హత్య కేసు మిస్టరీ వీడింది. ఉస్మానియా యూనివర్సిటీలో బీఈ (మైనింగ్) చదువుతున్న అక్షితారాణిని ఆమె పాలిటెక్నిక్ లెక్చరర్ జెట్టి నవీన్‌కుమార్ హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. బొగ్గుగనుల్లో శిక్షణకు వచ్చిన ఆమెపై సూపర్‌వైజర్ బొమ్మకంటి రవికుమార్ అత్యాచారం చేసినట్లు కూడా పోలీసులు విచారణలో గుర్తించారు. హత్య, అత్యాచారం కేసుల్లో ఈ ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి తెలిపారు.
అసలేం జరిగింది?
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రెపల్లికి చెందిన అక్షితారాణి మంచిర్యాల జిల్లా నస్పూర్‌లోని సింగరేణి పాలిటెక్నిక్‌లో 2022లో డిప్లొమా పూర్తి చేసింది. ఆ సమయంలో వారి గ్రామానికి చెందిన జెట్టి నవీన్‌కుమార్ పాలిటెక్నిక్ కాలేజీలో కాంట్రాక్టు లెక్చరర్‌గా పనిచేస్తుండేవాడు. వీరి ఇద్దరిదీ ఒకే ఊరు కావడంతో అక్షితారాణితో స్నేహం పెంచుకున్నాడు. భార్యతో విభేదాల కారణంగా ఒంటరిగా ఉంటున్న నవీన్‌కుమార్ అక్షితారాణిని వివాహం చేసుకుంటానని నమ్మించాడు. పాలిటెక్నిక్ అనంతరం అక్షితారాణి ఉస్మానియా వర్సిటీలో బీఈ మైనింగ్‌లో చేరింది. ఆమె కుటుంబం కూడా గోదావరిఖనికి మారడంతో బొగ్గు గనుల్లో 12 రోజుల ఇంటర్న్‌షిప్ కోసం జనవరిలో అక్కడ చేరింది. ఆ గనిలో ఓవర్‌మన్‌గా పనిచేస్తున్న బొమ్మకంటి రవికుమార్, తాను కూడా నస్పూర్ పాలిటెక్నిక్‌లో చదివానని నవీన్‌కుమార్ శిష్యుడినని ఆమెను నమ్మించాడు. ఆమెను లైంగికంగా వేధించాడు. అక్షితారాణి రవికుమార్‌పై సింగరేణి యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది. ఈ విషయంపై కమిటీ వేసి విచారణ జరిపిన యాజమాన్యం రవికుమార్ తప్పిదం లేదని నిర్థారించింది. ఆ తర్వాత బాధితురాలిని రవికుమార్ లైంగికంగా లొంగదీసుకున్నాడు. వీరి సాన్నిహిత్యాన్ని తెలుసుకున్న నవీన్ తట్టుకోలేకపోయాడు.
పురుగుల మందు తాగించి
అక్షితారాణిని హత్య చేయాలని నిర్ణయించుకుని సెప్టెంబర్ 12న ఆమెను కారులో ఎక్కించుకుని, బలవంతంగా పురుగుమందు తాగించాడు. అనంతరం ఆమెతో సూసైడ్ నోట్ రాయించి, ఆత్మహత్యగా చిత్రీకరించాడు. అక్షితారాణి స్పృహ కోల్పోయిన తర్వాత ఆమె ఫోన్ నుంచి ఆమె తండ్రికి ఫోన్‌చేసి గవర్నమెంట్ ఆసుపత్రిలో చేర్పించి పరారయ్యాడు. బాధితురాలు చికిత్స పొందుతూ ఈ నెల 13న మరణించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు..సీసీ కెమెరా, బాధితురాలి కాల్ రికార్డులు ఆధారంగా నిందితుడిని ఆదివారం అరెస్టు చేశారు. మరో నిందితుడు రవికుమార్‌ను కూడా రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
