Parents killed daughter:  చిత్తూరులో యాస్మిన్ భాను అనే యువతి అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది. చిత్తూరులోని మసీదు మిట్ట లో  నివాసం ఉంటే యాస్మిన్ ను..  మూడు నెలల క్రితం  తల్లిదండ్రులను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకుంది.  పూతలపట్టు మండలం కు చెందిన సాయి తేజ తో నాలుగు సంవత్సరాలుగా ప్రేమలో ఉంది. తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో ఇంటి నుండి వెళ్లిపోయి  ఫిబ్రవరి 9న నెల్లూరులో  యాస్మిన్ భాను, సాయి తేజ్ లు  పెళ్లి చేసుకున్నారు. తర్వాత తమ ప్రాణాలకు రక్షణ కావాలని  తిరుపతి ముత్యాల రెడ్డి పల్లి పోలీస్ స్టేషన్ లో ఫిబ్రవరి 13న  ఫిర్యాదు చేశారు.        

ప్రాణభయం ఉందని గతంలో పోలీసుల్ని ఆశ్రయించిన  సాయితేజ్, యాస్మిన్ భాను జంట       

సాయితేజ్, యాస్మిన్ భాను ఫిర్యాదు ఆధారంగా.. పోలీసులు  యాస్మిన్ భాను తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్ కు పిలిపించారు.  కౌన్సిలింగ్ ఇచ్చి  పంపించారు. వారు మేజర్లు అని వారి జీవితాలను వారు గడపనివ్వాలని ..జోక్యం చేసుకోవద్దని చెప్పి పంపించారు. తర్వాత అంతా కలిసిపోయామని .. మర్చిపోయామని.. పెళ్లికి అంగీకరిస్తామన్నట్లుగా  యాస్మిన్ భానుతో ఫోన్లో మాట్లాడటం ప్రారంభించారు తల్లిదండ్రులు. తిరుపతిలోనే కొత్త కాపురం పెట్టిన యాస్మిన్ భాను.. తమ పెళ్లిని తల్లిదండ్రులు అంగీకరిస్తున్నారని తెలుసుకుని సంతోషపడ్డారు.      

తండ్రికి హెల్త్ బాగోలేదని చెప్పి యాస్మిన్ భానును తీసుకెళ్లిన సోదరుడు          

రెండు రోజుల కిందట హఠాత్తుగా  యాస్మిన్ భాను తండ్రికి ఆరోగ్యం సరిగా లేదు పంపించాలని సాయి తేజ్ ను  కుటుంబ సభ్యులు కోరారు. తండ్రికి బాగోలేదనడంతో యాస్మిన్ భాను కూడా చిత్తూరు వెళ్లేందుకు సిద్ధమయ్యారు.  ఆదివారం 11 గంటలకు యాస్మిన్ భాను ను  చిత్తూరుకు తీసుకొచ్చాడు భర్త సాయి తేజ్ . అయితే సాయి తేజ్ ను.. అక్కడే ఉంచి..  యాస్మిన్ భానుని కారులో తీసుకెళ్లాడు అతని సోదరుడు లాలు. ఏం జరిగిందో తెలియదు కానీ.. కాసేపటికి యాస్మిన్  భాను చనిపోయిందని సమాచారాన్ని సాయితేజ్ ఇచ్చారు.       

యాస్మిన్ భాను చనిపోయిందని సమాచారమిచ్చిన కుటుంబసభ్యులు తల్లిదండ్రుల ఇంటిలో మృతి చెందడం వెనుక కుట్ర ుందని..  యాస్మిన్ భాను తల్లిదండ్రులే ఆమెను హత్య చేశారని ఆరోపిస్తున్న సాయి తేజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.  మృతదేహాన్ని పోస్టుమార్టం తరలించిన చిత్తూరు టు టౌన్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. యాస్మిన్ భాను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారని కుటుంబ సభ్యులే మతాంతర వివాహం చేసుకున్నారని చంపేశారని సాయితేజ్ ఆరోపిస్తున్నారు. ఈ మృతిపై అనుమానితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒకటి, రెండు రోజుల్లో పూర్తి వివరాలను వెల్లడించే అవకాశం ఉంది.  

కుమార్తె ఎలా చనిపోయిదంన్న అంశంపై యాస్మిన్ భాను కుటుంబసభ్యులు నోరు మెదపడం లేదు. వారి తీరు అనుమానాస్పదంగా ఉండటంతో పోలీసులు కూడా దర్యాప్తు విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.