Pak Man Kills Friend: పాకిస్థాన్‌లో ఓ యువకుడు ఫ్రెండ్‌ని దారుణంగా హత్య చేశాడు. లవర్‌ కోసం ఆర్డర్ చేసిన బర్గర్‌ని రుచి చూశాడన్న కోపంతో చంపేశాడు. కరాచీలో జరిగిందీ ఘటన. ఫిబ్రవరి 8వ తేదీన జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ARY News ఈ విషయం వెల్లడించింది. బాధితుడు అలీ కీరియో సెషన్స్ జడ్జ్‌ కొడుకు అని పోలీసులు వెల్లడించారు. ఇక నిందితుడు దనియాల్‌ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కొడుకు కావడం వల్ల ఈ ఘటన మరింత సంచలనమైంది. పోలీస్ కొడుకే హత్య చేయడం స్థానికంగా అలజడి సృష్టించింది. 


ఏం జరిగిందంటే..?


నిందితుడు దనియాల్ తన గర్ల్‌ఫ్రెండ్‌ షాజియాని తన ఇంటికి పిలిచాడు. ఆ సమయంలో ఇంట్లో దనియాల్‌ సోదరుడితో పాటు ఫ్రెండ్‌ కూడా ఉన్నారు. అయితే దనియాల్ రెండు బర్గర్‌లు ఆర్డర్ పెట్టాడు. గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి తినాలనుకున్నాడు. అయితే...దనియాల్ స్నేహితుడు కీరియో ఓ బర్గర్‌ని తినేశాడు. ఈ విషయంలో స్నేహితులిద్దరికీ గొడవ జరిగింది. చిన్న గొడవ కాస్తా పెద్దదైంది. వెంటనే తన ఇంట్లోని రైఫిల్‌తో స్నేహితుడిపై కాల్పులు జరిపాడు దనియాల్. బాధితుడిని వెంటనే హాస్పిటల్‌కి తరలించారు. అప్పటికే తీవ్ర గాయాలు కావడం వల్ల చికిత్స పొందుతుండగానే బాధితుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు...వెంటనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.