అమెరికాలోని ఓ ట్రక్ డ్రైవర్‌ను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. అమెరికాలో ఉంటూ భారత్‌లోని ఓ ఐపీఎస్ అధికారిణికి మెసేజ్‌లు పంపించాడు. ఆమె కదలికలను సోషల్ మీడియా ద్వారా తెలుసుకొని వాటి వివరాలతో మెసేజ్ చేసేవాడు. చివరకు ఆమెను కలిసేందుకు హైదరాబాద్ వచ్చి అరెస్ట్ అయ్యాడు.
పంజాబ్‌కు చెందిన మల్‌రాజ్ సింగ్ అలౌక్ కాలిఫోర్నియాలో ఉంటున్నాడు. ట్రక్ డ్రైవర్‌గా పని చేస్తున్న అతనికి గ్రీన్ కార్డు కూడా ఉంది. సోషల్ మీడియాలో ఓ ఐపీఎస్ అధికారిణి చూసి చాటింగ్ స్టార్ట్ చేశాడు.
ముందు హాయ్ హలో అంటూ మొదలైన చాటింగ్ తర్వాత వేరే ట్నర్ తీసుకుంది. అయితే అలౌక్ పంపించిన మెసేజ్‌లకు దేనికి కూడా ఆ అధికారిణి స్పందించలేదు. ఇలాంటి చాలా వస్తుంటాయని లైట్ తీసుకున్నారు.
అలౌక్ మాత్రం ఆమెకు మెసేజ్‌లు చేస్తూనే ఉన్నాడు. ఆమె చూస్తున్నారా లేదా అనే ఆలోచన లేకుండా మెసేజ్‌లు పంపిస్తూనే ఉన్నాడు. ఆమె ఎక్కడకు వెళ్తున్నారు... ఏం చేస్తున్నారు లాంటి అన్ని వివరాలు తెలుసుకుంటున్నాడు. ఇంత చేస్తున్నా ఆమె లైట్ తీసుకున్నారు. ఇలాంటి పోకిరీలు చాలామంది ఉంటారులే అనుకున్నారు.
పంజాబ్ కేడర్‌కు చెందిన ఆ ఐపీఎస్ అధికారిణి... ట్రైనింగ్ కోసం జనవరి 17 నుంచి ఏప్రిల్ 29 వరకు హైదరాబాద్ వచ్చారు. ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలోనే ఉంటూ ట్రైనింగ్ తీసుకున్నారు. ఓ రోజు సడెన్‌గా ఆమె ముందు ప్రత్యక్షమయ్యాడు అలౌక్.
అలౌక్ అలా హైదరాబాద్ రావడంతో షాక్ అయ్యారు సదరు ఐపీఎస్ అధికారిణి. ఆమెతో మాట్లాడేందుకు అలౌక్ ట్రై చేశాడు. ఆమె రిజెక్ట్ చేశారు. ఇది ఇంకా డ్రాగ్ చేస్తే ప్రమాదమని గ్రహించి విషయాన్ని పోలీసులకు చెప్పారు.
ఐపీఎస్ అధికారి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు అలౌక్‌ను అరెస్టు చేశారు. సోమవారం రిమాండ్‌కు తరలించారు..