హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్లో ఉన్న పుడింగ్ అండ్ మింక్ పబ్‌లో డ్రగ్స్ దొరకలేదని పోలీసులు కోర్టులో దాఖలు నిందితుల కస్టడీ రిపోర్టులో చెప్పారు. సంచలనం సృష్టించిన ఈ కేసులో నలుగురిపై కేసులు పెట్టిన పోలీసులు అభిషేక్, అనిల్ అనే ఇద్దర్నిఅరెస్ట్ చేశారు. వీరిని కోర్టు అనుమతితో కస్టడీకి తీసుకుని ప్రశ్నించారు. ఆ తర్వాత కోర్టుకు కస్టడీ రిపోర్ట్ సమర్పించారు. అందులో పోలీసులు అసలు డ్రగ్స్ ఆనవాళ్లేమీ పబ్‌లో దొరకలేదని చెప్పినట్లుగా తెలుస్తోంది. 


పబ్‌లో కొకైన్‌ విక్రయానికి సంబంధించిన ఆధారాలు దొరకలేదని కస్టడీ రిపోర్టులో పోలీసులు చెప్పినట్లుగా తెలుస్తోంది. నిందితులు అనిల్‌, అభిషేక్‌లను 36 గంటల పాటు విచారించామని చెప్పారు.  ఏడాది వ్యవధిలో అభిషేక్‌ తన కుటుంబంతో రెండు సార్లు విదేశాలకు వెళ్లారని అభిషేక్‌ కాల్‌ డేటాలో ఉన్న అందరి గురించి ఆరా తీశాం కానీ  డ్రగ్స్‌ విక్రేతలతో అభిషేక్‌కు సంబంధాలున్నట్లు ఆధారాలు లభించలేదని తెలిపారు. డ్రగ్స్‌ కేసుతో తనకు ఎటువంటి సంబంధం లేదని అభిషేక్‌ చెప్పాడని..  పబ్‌లోకి డ్రగ్స్‌ ఎలా వచ్చాయో తనకు తెలియదన్నారని వివరించారు. పబ్‌లో ప్రవేశం కోసం తనకు నిత్యం అనేక ఫోన్లు వస్తుంటాయని .. అభిషేక్‌కు సంబంధించి గత మూడేళ్ల కాల్‌డేటాను పరిశీలించామన్నారు.  గత 7 నెలలుగా పబ్‌ను లీజుకు తీసుకొని నడుపుతున్నట్లు అభిషేక్‌ చెప్పాడని కస్టడీ రిపోర్టులో పోలీసులు వివరించారు.


పబ్‌లో ఉన్న సీసీ కెమెరాల్లోనూ ఎలాంటి ఆధారాలు లభించలేదని పోలీసులు స్పష్టం చేశారు. పబ్‌కు వచ్చే హైప్రొఫైల్‌ కస్టమర్స్‌ కోసమే యాప్‌ అని.. మంచి ప్రొఫైల్‌ ఉంటేనే పబ్‌లోకి అనుమతిస్తారని చెప్పాడు. వయసు ధ్రువీకరణ పత్రం చూశాకే లోపలికి పంపిస్తామని  చెప్పారన్నారు. పోలీసుల కస్టడీ రిపోర్టులో అసలు పబ్ లో డ్రగ్స్ అమ్ముతున్నట్లుగా కానీ.. అక్కడ డ్రగ్స్ ఉన్నట్లుగా కానీ సీసీ కెమెరాల్లో కూడా నమోదు కాలేదని తెలిపారు. దీంతో ఫుడింగ్ అండ్ మింక్ పబ్‌ కేసు దాదాపుగా తేలిపోయినట్లేనని భావిస్తున్నారు.



ఉగాది రోజున పుడింగ్ పబ్‌లో తెల్లవారు జాము వరకూ జరుగుతున్న పార్టీపై పోలీసులుదాడి చేశారు. దాదాపుగా 150 మందిని అదుపులోకి తీసుకుని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ వ్యవహారం సంచలనాత్మకం అయింది. పెద్ద ఎత్తున డ్రగ్స్ వినియోగం జరుగుతున్నట్లుగా ప్రచారం జరిగింది. నలుగురిపై కేసులు పెట్టి ఇద్దర్ని అరెస్ట్ చేశారు. అయితే పోలీసులు ప్రాథమిక సాక్ష్యాలు కూడా సేకరించలేకపోయారని కస్టడీ రిపోర్టులో కోర్టుకు చెప్పిన దాన్ని అంచనా వేస్తున్నారు.