Medico attempt suicide case :   వరంగల్  కాకతీయ మెడికల్  కాలేజీలో  మెడికో   ప్రీతి ఆత్మహత్యాయత్నం  ఘటనలో  సీనియర్  మెడికో అయిన సైఫ్ ను  పోలీసులు అరెస్ట్ చేశారు.   కొంతకాలంగా  తమ కూతురు ప్రీతిపై సైఫ్ వేధింపులకు  పాల్పడుతున్నాడని  బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.  బాధిత కుటుంబం  ఫిర్యాదు  మేరకు  సైఫ్  పై  పోలీసులు  కేసు నమోదు  చేశారు.  సైఫ్ ను  పోలీసులు ఈ విషయమై  రోజంతా  ప్రశ్నించి అరెస్ట్ చేశారు. మెడికో  ప్రీతిని  విధుల విషయమై  మాత్రమే మందలించినట్టుగా  సైఫ్  పోలీసులకు చెప్పినట్లుగా తెలుస్తోంది. నిజానికి సైఫ్ వేధింపులకు పాల్పడుతున్నారని గతంలోనూ పై అధికారులకు ప్రీతి ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది.  సైఫ్   వేధింపులకు  గురి చేస్తున్నారని  మెడికో ప్రీతి  ఫిర్యాదు చేసింది.  ఈ విషయమై  వీరిద్దరికి  కౌన్సిలింగ్  కూడా ఇచ్చారని చెబుతున్నారు. ఇప్పుడు సైఫ్ ను అరెస్ట్ చేయడంతో వేధింపులు నిజమేనని భావిస్తున్నారు.  


సైఫ్ వేధింపులు తట్టుకోలేక పాయిజన్ ఎక్కించుకున్న  డాక్టర్ ప్రీతి ! 


హైదరాబాద్‌లో ఏఎస్ఐగా పని చేస్తున్న నరేందర్ కూతురు ప్రీతి కాకతీయ మెడికల్ కళాశాలలో పీజీ మొదటి సంవత్సరం చదువుతూ ఉంది. విధుల్లో ఉన్నపుడే హానికరమైన ఇంజక్షన్ ను ఆమె ఎక్కించుకున్నారు. తోటి వైద్యులు ఈ విషయం గమనించి ఆమెకు చికిత్స అందిస్తున్నారు. డాక్టర్ ప్రీతి ఆత్మహత్యాయత్నం విషయాన్ని కాకతీయ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్ దాస్ ధ్రువీకరించారు. విధి నిర్వహణలో సీనియర్ వైద్య విద్యార్థి సైఫ్ ఇబ్బందులకు గురిచేస్తున్నాడని కేఎంసీ ప్రిన్సిపల్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని కొంత మంది విద్యార్థులు రోపించారు. 


విషమంగా ప్రీతి ఆరోగ్య పరిస్థితి ! 
 
సీనియర్ విద్యార్థి వేధింపులలు తాళలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ వరంగల్ మెడికో విద్యార్థిని పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. హైదరాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రిలో విద్యార్థిని చికిత్స పొందుతోంది. ప్రీతికి వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నట్లు నిమ్స్ వైద్యులు వివరించారు. ప్రీతికి మళ్లీ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ జరిగిందని, చికిత్సకు ఆమె శరీరం ఏమాత్రం సహకరించడం లేదని చెబుతున్నారు. బీపీ, పల్స్ రేటు నమోదు కాని పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రీతికి డాక్టర్ పద్మజ ఆధ్వర్యంలోని ఐదుగురు వైద్యుల బృందం చికిత్స అందిస్తోంది. బుధవారం రాత్రి ప్రీతి టెస్ట్ రిపోర్టర్లను డాక్టర్ పద్మజ పరిశీలించారు. వరంగల్ నుంచి ప్రీతిని నిమ్స్ కు తీసుకువచ్చే సమయంలోనే రెండుసార్లు గుండె ఆగిపోయింది. వెంటనే వైద్యులు సీపీఆర్ చేసి గుండె కొట్టుకునేలా చేశారు. అనస్తీషియా, కార్డియాలజీ, న్యూరాలజీ, జనరల్ ఫిజీషియన్, ఇతర వైద్యులు ప్రీతికి వైద్య చికిత్స అందిస్తున్నారు. అయితే ప్రీతి ఆరోగ్య పరిస్థితిపై ఇప్పడే ఏం చెప్పలేమని.. వైద్యులు చెబుతున్నారు. 


ఎక్మో సపోర్ట్‌తో ప్రీతికి నిమ్స్‌లో వైద్యం !           


వైద్య విద్యార్థిని ప్రీతి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని.. ఎక్మోపై చికిత్స అందిస్తున్నామని నిమ్స్ వైద్యులు హెల్త్ బులెటిన్ ప్రకటించారు. మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ అయితేనే ఎక్మో చికిత్స అందిస్తారు.