Hyderabad Crime News: హైదరాబాద్ లో సంచలనం  సృష్టించిన హానీట్రాప్‍( Honey Trap) కేసులో తవ్విన కొద్దీ ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. స్థిరాస్తి వ్యాపారిని బురిడీ కొట్టించి ఇంటికి పిలిపించి హత్యకు సహకరించిన 'కిలేడీ'ల చరిత్ర సినిమా కథను తలపిస్తోంది. వారిపై ఉన్న కేసులు చూస్తే....ఈ అమ్మాకూతుళ్లు బయట ఉంటే ఎంత ప్రమాదమో తెలుస్తుంది. రియాల్టర్ సింగోట రామన్నను హానీట్రాప్ చేసి ఇంటికి పిలిపించుకున్న  ఇమామ్ బీ..ఆపై హత్యకు సహకరించింది. ఈ కేసు తెలుగు రాష్ట్రాల్లోనే సంచలనం రేకెత్తించింది.
కిలేడీలు  
హైదరాబాద్( Hyderabad) యూసఫ్‌ గూడలో సింగోటం రాము హత్య కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తించింది. రామును అతిదారుణంగా పదిమంది కలిసి కత్తులతో నరికి చంపేశారు. అలాగే మర్మాంగాలను కోసి పైశాచిక ఆనందం పొందారు. ఆయన ఒంటిపై దాదాపు 50కి పైగా కత్తిపోట్లు ఉన్నాయంటే నిందితులు రాముతో ఎంతగా వేధించి చంపారో అర్థమవుతోంది. ఇప్పటి వరకు ఈ కేసులో స్థిరాస్తి గొడవలే హత్యకు కారణమని పోలీసులు భావించారు. కానీ ఈ హత్య వెనకు ఇద్దరు కిలేడీలు ఉన్నారని అనుమానిస్తున్నారు. వారే రామును హానీట్రాప్‌లో పడేసి ఇంటికి పిలిపించుకున్న తల్లీకూతుళ్లు హిమంబీ, నసీమా.వీరిద్దరూ మామూలు ముదుర్లు కాదని పోలీసుల విచారణలో తేలింది. బడాబాబులను లైన్‌లో పెట్టడం...ట్రాప్‌ చేసి లక్షలు లక్షలు గుంజడం హిమంబీకి వెన్నతో పెట్టిన విద్య. దీనికి ఆమె కూతురు నసీమానే ఆమె ఎరగా వేయడం విశేషం...
మహా ముదుర్లు 
సింగోట రామన్న హత్యలో కీలకపాత్ర పోషించిన తల్లి హిమాంబీపై ఇప్పటికే పోలీసుస్టేషన్‌లో ఐదు కేసులు ఉన్నాయి. బెదిరింపులకు పాల్పడటం, అమ్మాయిలను వ్యభిచార రొంపిలోకి దింపి డబ్బులు గుంజడం, డబ్బున్న మగాళ్లకు కూతురిని వలవేసి అందినకాడికి దోచుకోవడం వీరి దినచర్య. వీరి వలలో చిక్కి చాలామంది బడాబాబులు లక్షలాది రూపాయల చేతి చమురు  వదిలించుకున్నారని తెలిసింది. గట్టిగా మాట్లాడితే రోడ్డెక్కి పరువు తీస్తారని బయపడి చాలామంది పోలీసులకు ఫిర్యాదు చేయకుండా ఉండిపోయారు.  హత్యకు గురైన పుట్టా రాము అలియాస్ సింగోటం రాము(Singotam Ramu)కు కూడా హిమాంబీ తన కూతురును ఎర వేసింది. రాముని లొంగదీసుకున్న హిమంబీ(Himabi) అతడి వద్ద నుంచి భారీ మొత్తంలో డబ్బులు కొట్టేసింది. తల్లీకూతుళ్ల వలకు చిక్కిన రాము లక్షలాది రూపాయలు వారికిచ్చి మోసపోయాడని సమాచారం. ఈ డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగినందుకే ...అతని అడ్డు తొలగించుకునేందుకు హిమాంబీ పథకం వేసిందని తెలుస్తోంది. తమ చేతికి మట్టి అంటకుండా  పనికానిచ్చేందుకు ప్రణాళికలు రచించారు. రాముపై ఎప్పటి నుంచో కక్ష పెంచుకున్న మణికంఠకు ఉప్పందించారు. మణికంఠ వద్ద కూడా డబ్బులు తీసుకున్న తల్లీకూతుళ్లు... హనీ ట్రాప్‌నకు పాల్పడ్డారు. నసీమాతో కాల్ చేయించిన రామును ఇంటికి పిలిపించింది  హిమాంబీ. అదును చూసి మణికంఠకు సమాచారం అందించినట్లు తెలిసింది. నిందితులతోపాటు తల్లీకూతుళ్లను అరెస్ట్‌ చేసిన పోలీసులు...వారి నేరచరిత్ర చూసి విస్తుపోయారు. ఇప్పుడు ఉంటున్న ఇంటిని అమ్మి డబ్బులు తీసుకున్నా...ఖాళీ చేయకుండగా కొనుగోలు చేసిన వారిపైనే తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారు. తప్పుడు కేసులు పెట్టి బ్లాక్ మెయిల్ చేసినట్లు తెలిసింది.తాము అమ్మిన  ఇల్లు వెనక్కి రాయాలని అతనిపై ఒత్తిడి తెస్తున్నారని పోలీసులు విచారణలో తేలింది. అతను అంగీకరించకపోవడంతో... అతనికి కూడా కూతురుని ఎరగా వేసిందని సమాచారం. ఇప్పుడిప్పుడే ఈ జగత్ కిలాడీలపై ఫిర్యాదు చేసేందుకు బాధితులు వస్తున్నారని సమాచారం.


కేసులే కేసులు
తల్లీకూతుళ్లు ఇద్దరిపైనా పోలీసుస్టేషన్‌లో లెక్కకు మించి కేసులు ఉన్నాయి. 2017లో షేక్ సనా అనే అమ్మాయితో వ్యభిచారం చేయిస్తూ హిమాంబి రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయింది. అదే ఏడాది  విష్ణుకాంత్ అనే వ్యక్తిని బ్లాక్‌ మెయిల్‌ చేసి రూ.3 లక్షలు గుంజుకుందని పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. 2018లో రేణుక అనే అమ్మాయితో వ్యభిచారం చేయించిన కేసులోనూ హిమాంబిని పోలీసులు అరెస్ట్ చేశారు. 2019లో తన కూతురు నసీమాను రాజు అనే వ్యక్తి కిడ్నాప్ చేశాడంటూ హిమాబీ తప్పుడు ఫిర్యాదు చేసి బెదిరింపులకు పాల్పడినట్లు సమాచారం. 2020లో జూబ్లీహిల్స్ వెంకటగిరిలో వ్యభిచారం చేస్తూ  హిమాంబీ దొరికిపోయింది. కుమార్తెతో కలిసి ఇతర అమ్మాయిలను ఎరగా వేసి హిమాంబి వ్యభిచారం చేస్తూ సంపాదిస్తోందని పోలీసుల విచారణలో తేలింది.