ఇటీవల నెల్లూరు జిల్లాలో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లో భారీ అవినీతి బయటపడింది. ఈ కేసులో ప్రమేయం ఉన్నట్టు తేలడంతో ఏకంగా ఆర్డీవోనే అరెస్ట్ చేశారు ఏసీబీ అధికారులు. ఆమెను రిమాండ్ కి తరలించారు. అవినీతి కేసులో ఆర్డీవో స్థాయి అధికారి అరెస్ట్ కావడంతో ఈ ఘటన సంచలనంగా మారింది. రాష్ట్రంలోనే ఇది ఓ ప్రత్యేక కేసుగా నిలిచింది.


కోట్ల రూపాయలు కొట్టేసిన రోజ్మండ్..


సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కి ఎండీగా పనిచేసిన సమయంలో రోజ్మండ్.. కోట్ల రూపాయలు కొట్టేసినట్టు తెలుస్తోంది. అయితే ఆమె నేరుగా ఆ డబ్బు ముట్టలేదు. ఇంట్లో ఫంక్షన్ ని ఘనంగా నిర్వహించేందుకు పరోక్షంగా దాన్ని వాడుకున్నారు. ఆ లింకులన్నీ ఇప్పుడు తేలడంతో పక్కా ఆధారాలతో ఏసీబీ అధికారులు ఆమెను అరెస్ట్ చేశారు.


ఉమ్మడి నెల్లూరు జిల్లా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లో గతంలో ఎండిగా పనిచేశారు రోజ్మండ్. ప్రస్తుతం ఆమె ఉమ్మడి నెల్లూరు జిల్లాలో భాగం అయిన తిరుపతి జిల్లా సూళ్లూరు పేట ఆర్డీవోగా పనిచేస్తున్నారు. గతంలో ఆమెపై ఆరోపణలు వినిపించినా ఎక్కడా ఆధారాలు బయటపడలేదు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న ఏసీబీ అధికారులు ఎట్టకేలకు పక్కా ఆధారాలు సేకరించి ఆమెను అరెస్ట్ చేశారు. ముందుగా రాష్ట్ర చీఫ్ సెక్రటరీ పర్మిషన్ తీసుకున్నారు. ఆ అనుమతి రాగానే అదుపులోకి తీసుకుని కోర్టుకు హాజరు పరిచారు. కోర్టు ఆమెకు జనవరి 4వ తేదీ వరకు రిమాండ్ విధించింది.


ఇప్పటికే ఈ కేసుతో సంబంధం ఉన్న అనేక మందిని అదుపులోకి తీసుకుని విచారించిన ఏసీబీ అధికారులు పలుచోట్ల వారికి సంబంధించిన ఆస్తులను గుర్తించి సీజ్ చేస్తున్నారు. ప్రస్తుతం సూళ్లూరు పేట ఆర్డీవో రోజ్మండ్ అరెస్టుతో కేసు కీలక దశకు చేరుకున్నట్టు తెలుస్తోంది. ఈమెకు సంబంధించిన ఆస్తులు కూడా త్వరలోనే గుర్తించి ప్రభుత్వం స్వాధీనం చేసుకోబోతోంది.


అసలేంటి ఈ కేసు..?


ధాన్యం సేకరణలో రైతులకు ఇవ్వాల్సిన సొమ్ముని పౌరసరఫరాల శాఖ అధికారులు నకిలీ బిల్లులతో మాయం చేశారు. చాన్నాళ్లుగా ఈ వ్యవహారం సాగుతున్నా.. ఇటీవల అనుకోకుండా జరిగిన తనిఖీలో ఆదాయపు పన్నుకు సంబంధించి నకిలీ చలానాలను అధికారులు గుర్తించారు. దానిపై వారు ఎంక్వయిరీ చేశారు. సిబ్బంది సరిగా స్పందించకపోవడంతో జాయింట్ కలెక్టర్ స్థాయి అధికారి ఎంక్వయిరీ చేపట్టారు. నిజమేనని తేలడంతో ఏసీబీకి ఫిర్యాదు చేశారు. ముందుగా 2019 వరకు ఉన్న ఫైళ్లను పరిశీలించారు జాయింట్ కలెక్టర్. అక్రమాలు నిజమని తేలడంతో.. 2017 వరకు ఫైళ్లను పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు. కార్పొరేషన్ డీఎం బ్యాంకు ఖాతా నుంచి ఇతరుల ఖాతాలకు నగదు జమ అయినట్టు గుర్తించారు. మొత్తం 40కోట్ల రూపాయలు ఇలా పక్కదారి పట్టినట్టు నిర్థారించారు. అప్పటి డీఎం పద్మతో సహా.. అయిదుగురిని సస్పెండ్‌ చేశారు ఉన్నతాధికారులు. ఆ తర్వాత ఈ ఘటనతో ప్రమేయం ఉన్న మొత్తం 11 మందిపై కేసు నమోదు చేశారు. విచారణ చేపట్టారు. ప్రస్తుతానికి ఇద్దరు డీఎంలు అరెస్ట్ అయ్యారు. వారి బదిలీ కాలంలో మధ్యలో మరో ఇద్దదరు డీఎంలు పనిచేశారు. వారి పాత్రపై కూడా విచారణ కొనసాగుతోంది.