Nellore News : నెల్లూరు జిల్లా చేజర్ల మండలం ఆదూరుపల్లిలో పార్కింగ్ చేసిన కారు నుంచి 5 లక్షల రూపాయలు చోరీకి గురయ్యాయి. గతంలో ఇలాంటి దొంగతనాలు అక్కడక్కడ జరిగే ఉంటాయి. కానీ ఈ దొంగతనం తీరే వేరు. కారు అద్దాలు పగలగొట్టే క్రమంలో ఆ దొంగ చేతికి గాయమైంది. గాయం తాలూకు రక్తం కూడా కారుకు అంటుకుంది. కానీ డబ్బు కోసం గాయాన్ని సైతం లెక్కచేయకుండా అనుకున్న పని సాధించి అక్కడినుంచి పరారయ్యాడు ఆ దొంగ. కారు కొనుగోలు కోసం పొద్దుటూరు నుంచి ఆదూరూపల్లి వచ్చిన ఖాదర్ భాష అనే వ్యక్తి అక్కడే భోజనం చేయడానికి ఆగాడు. భోజనం తర్వాత కారు డీల్ సెటిల్ చేసుకుందామనుకున్నారు. కారులోనే 5 లక్షల రూపాయల నగదు డ్యాష్ బోర్డ్ లో ఉంచాడు. తెలిసినవారి పనో లేక, ఎవరూ లేరని దొంగ ధైర్యం చేశాడో కానీ, మొత్తానికి కారు అద్దాలు పగలగొట్టి డ్యాష్ బోర్డ్ లోని క్యాష్ మాయం చేశాడు. దగ్గర్లోని సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఏఎస్ఐ ఇంట్లో చోరీ
దొంగల్ని పట్టుకునే పోలీసుల ఇంటికే కన్నం వేశాడో దొంగ. ఏకంగా ఏఎస్ఐ ఇంట్లోనే దొంగతనం చేశాడు. ఏఎస్ఐ ఇంట్లో నగదు, బంగారం అపహరించిన సంఘటన రంగారెడ్డి జిల్లా మీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన చోటు చేసుకుంది. సీఐ మహేందర్ రెడ్డి చెప్పిన కథనం ప్రకారం మీర్‌పేట మున్సిపాల్ కార్పొరేషన్ పరిధిలోని విజయపురి కాలనీలో ఏఎస్ఐ శంకర్ ఉంటున్నారు. ఆయన ఛత్రినాక పోలీస్ స్టేషన్ లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నారు.
కూతురు పెళ్లికి తెచ్చిన నగదు, నగలు మాయం
బుధవారం ఏఎస్ఐ శంకర్ బార్య ముడావత్ లక్ష్మి ఆమనగల్ మండలంలోని కలకొండలో జరిగే ఓ కార్యక్రమానికి వెళ్లారు. శంకర్ గురువారం ఉదయం 10 గంటలకు డ్యూటీకి వెళ్లారు. ఆయన వెళ్లే సమయంలో కుమారుడు రాజేష్ ఇంట్లోనే ఉన్నారు. గురువారం మధ్యాహ్నం గం.1.30 లకు డ్యూటీ ముగించుకొని శంకర్ ఇంటికి వచ్చే సరికి ఇంటి తాళం పగలగొట్టి ఉన్నట్లు గమనించి పోలీసులకు సమాచారం అందించారరు. భార్య లక్ష్మి గురువారం సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత 35 తులాల బంగారం, రూ.17 లక్షలు పోయినట్లు మీర్‌పేట పోలీస్ స్టేషన్‌లో ఏఎస్ఐ ఫిర్యాదు చేశారు. అయితే నగలు, నగదు కూతురు పెళ్లి కోసం తీసుకువచ్చిన్నట్లు పోలీసులకు తెలిపారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు డీసీపీ సన్ ప్రీత్ సింగ్, ఏసీపీ పురుషోతం రెడ్డి, సీఐ మహేందర్ రెడ్డి, డీఐ భాస్కర్ తదితరులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.