Kukatpally girl murder case Update: కూకట్ పల్లిలో జరిగిన సహస్ర అనే బాలిక హత్య కేసులో పోలీసులు వారి పక్క ఇంట్లో ఉండే పదో తరగతి పిల్లవాడ్ని అదుపులోకి తీసుకున్నారు. హత్య కేసులో ఎలాంటి క్లూ దొరకకపోవడంతో పోలీసులు అనేక కోణాల్లో దర్యాప్తు చేశారు. అయితే కొంత మంది స్థానికులు ఇచ్చిన ఇన్ పుట్స్ తో.. పోలీసులు దర్యాప్తు చేయడంతో పక్కింట్లో ఉండే ఓ కుర్రాడి మీదకు దృష్టి వెళ్లింది. పోలీసులు అుదపులోకి తీసుకుని ప్రశ్నించడంతో పొంతనలేని సమాధానాలు చెప్పాడు. అతని వద్ద హత్య ఎలా చేయాలో ప్లాన్ చేసుకున్న కాగితం లభించడంతో పోలీసులకు చిక్కుముడి వీడినట్లయింది. 

దొంగతనం కోసం వచ్చి హత్య 

సహస్ర ఒంటరిగా ఇంట్లో ఉంటుందని.. ఆమె ఇంట్లో దొంగతనం చేయాలని పక్కింటి కుర్రాడు ప్లాన్ చేసుకున్నాడు. ఆ పిల్లగాడు కూడా పదో తరగతి చదువుతున్నాడు.తనకు ఎవరైనా అడ్డు వస్తే.. చంపేద్దామని ప్లాన్ చేసుకుని ఇంటి వద్ద నుంచి కత్తి తీసుకుని వచ్చాడు. సహస్రకు తెలియకుండా ఇంట్లోకి వచ్చాడు. రూ. 80వేలు ఉంటే దొంగతనం చేశాడు. వెళ్లే సమయంలో సహస్ర చూసింది. దాంతో ఆమెను తాను తెచ్చుకున్న కత్తితో పొడిచి చంపేసి తన దారిన తాను పోయాడు. దొంగతనం ఎలా చేయాలో.. అడ్డొస్తే ఎలా చంపాలో కూడా ఆ పిల్లవాడు ఓ కాగితంపై రాసి తెచ్చుకున్నాడని  పోలీసులకు ఆధారాలు లభించాయి. ఇదే జరిగిందని పోలీసులు ఓ క్లారిటీకి వచ్చారు. 

ఎన్నో అనుమానాలు !                

అయితే ఈ హత్య ఘటనపై ఎన్నో అనుమానాలు ఉన్నాయి. మొదట తల్లిదండ్రులే అబద్దాలు చెబుతున్నారని.. వారిపై కూడా అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే తమ బిడ్డను తాము ఎందుకు చంపుకుంటామని ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. పోలీసుల జాగిలాలు..ఆ ఇంటి నుంచి పక్కకుపోలేదు. పక్కింట్లో పిల్లవాడు హత్య చేసి ఉంటే.. రక్తపు మరకలతో అతను.. ఇంటికి పోయినా సులువుగా జాగిలాలు గుర్తించేవి. అలా.. అక్కడ దొరికిన వేలి ముద్రలతో సరిపోయాయో లేదో స్పష్టత లేదు. ఓ పదో తరగతి పిల్లవాడు.. తనతో పాటి  అమ్మాయిని చంపేసి.. ఏమీ తెలియనట్లుగా ఉండటం అసాధ్యమని భావిస్తున్నారు. అందుకే పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేసే అలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. 

కుటుంబ సభ్యులు ఏమైనా దాస్తున్నారా ?              

సహస్ర హత్యకు గురైన రోజున.. ఇంటి చుట్టుపక్కల వారితో గొడవలు ఉన్నాయని.. అంత మాత్రాన చంపేస్తారా అని తల్లిదండ్రులు పోలీసుల ఎదుట వాపోయారు. అయితే ఇప్పుడు హంతకుడిగా పోలీసులు గుర్తించిన బాలుడి కుటుంబంతో కూడా గొడవలు ఉన్నాయా లేదా అన్నదానిపై స్పష్టతలేదు. పోలీసులు ఒక వేళ బాలుడే హత్య చేశాడని నిర్దారిస్తే.. చాలా అనుమానాలకు క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుందని భావిస్తున్నారు. ఈ కేసుపై బాలిక ఇంటి చుట్టూ అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి.