Nampally Fire Accident | హైదరాబాద్ లోని నాంపల్లిలో శనివారం సంభవించిన భారీ అగ్నిప్రమాదం పెను విషాదాన్ని మిగిల్చింది. మంటల్లో చిక్కుకుని కాలిపోయి ముగ్గురు చనిపోగా, ఆ చిన్నారుల్ని రక్షించేందుకు వెళ్లిన ఇద్దరు కూడా ప్రాణాలు కోల్పోయారు. అబిడ్స్ నుండి నాంపల్లి స్టేషన్‌కు వెళ్లే ప్రధాన రహదారిలో ఉన్న 'బచాస్ ఫర్నిచర్ క్యాస్టిల్' షోరూమ్‌లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో ఇద్దరు చిన్నారులు, ఒక మహిళతో సహా మొత్తం ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ప్లాస్టిక్, కెమికల్స్ దహనమవ్వడంతో వెలువడిన దట్టమైన విషపూరిత పొగ కారణంగా ఊపిరి ఆడక వారు అక్కడిక్కడే కన్నుమూశారు.

ఈ నాలుగు అంతస్తుల భవనంలోని మొదటి సెల్లార్‌లో షోరూమ్ కార్మికుల కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. శనివారం (జనవరి 24న) మధ్యాహ్నం 12:40 గంటల సమయంలో గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.లోపల ఉన్న ఫైబర్, లెదర్, పాలిష్ కెమికల్స్ కారణంగా మంటలు నిమిషాల వ్యవధిలో బిల్డింగ్ మొత్తానికి వ్యాపించాయి. ఈ సమయంలో సెల్లార్‌లో ఉన్న వాచ్‌మెన్ బేబీ (43), కార్మికుడు యాదయ్య కుమారులు అఖిల్ (12), ప్రణీత్ (9) మంటల మధ్య చిక్కుకుపోయారు.

కాపాడేందుకు వెళ్లి ఇద్దరు సజీవదహనం..

చిన్నారుల ఆర్తనాదాలు విన్న షోరూమ్ ఉద్యోగి మహ్మద్ ఇంతియాజ్ (27), ఆటో డ్రైవర్ హబీబ్ (40) ఏమాత్రం ఆలోచించకుండా వారిని రక్షించేందుకు సెల్లార్‌లోకి కెళ్లారు. కానీ, లోపల ఆక్సిజన్ అందకపోవడం, దట్టమైన పొగ అలుముకోవడంతో వారు కూడా బయటకు రాలేక ప్రాణాలు కోల్పోయారు.

అగ్నిమాపక సిబ్బంది 8 ఫైర్ ఇంజిన్లతో దాదాపు 10 గంటల పాటు శ్రమించినప్పటికీ, లోపలికి వెళ్లే మార్గం ఇరుకుగా ఉండటంతో సహాయక చర్యలు చేపట్టడానికి వీలు కాలేదు. ఎన్డీఆర్‌ఎఫ్ (NDRF) బృందాలు గోడలకు డ్రిల్లింగ్ చేసి లోపలికి వెళ్లే ప్రయత్నం చేయగా, ఫైర్ రోబోలను కూడా రంగంలోకి దించారు. హైదరాబాద్ సీపీ సజ్జనార్, మేయర్ విజయలక్ష్మి, కలెక్టర్ హరిచందన స్వయంగా రెస్క్యూ ఆపరేషన్‌ను పర్యవేక్షించారు. ప్రమాదానికి కొద్దిసేపటి ముందే పనుల నిమిత్తం బయటకు వెళ్లిన యాదయ్య, లక్ష్మి దంపతులు.. తిరిగి వచ్చేసరికి తమ పిల్లలు విగతజీవులుగా పడి ఉండటంతో వారి రోదనలు చూపరులను సైతం కంటతడి పెట్టించాయి.

తీవ్రంగా శ్రమించి మంటలు ఆర్పివేసిన సిబ్బంది..

ఈ భారీ ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోవడంతో పాటు కోట్ల రూపాయల విలువైన ఫర్నీచర్, ముడి సరుకులు అగ్నికి ఆహుతయ్యాయి. ఫర్నీచర్ దుకాణం కావడంతో మంటలు వేగంగా వ్యాపించాయి. మరోవైపు బిల్డింగ్ ఉన్నది ఇరుకైన వీధిలో ఉండటంతో భారీ క్రేన్లు, ఫైర్ ఇంజన్లు లోపలికి వెళ్లేందుకు వీలులేకపోవడంతో సహాయక చర్యలకు ఆటంకం తలెత్తింది. ఫైర్ సిబ్బంది పైపులను సుదూరం నుంచి లాగి మంటలను ఆర్పివేసేందుకు గంటలపాటు తీవ్రంగా శ్రమించారు. నేడు రెండో రోజు సైతం సెల్లార్ నుంచి రంధ్రం పెట్టి లోపలికి వెళ్లి అక్కడ చిక్కుకున్న వారిని రక్షించేందుకు డీఆర్ఎఫ్  బృందాలు, ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ ప్రయత్నిస్తున్నాయి. పోలీసులతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు నాంపల్లిలో అగ్నిప్రమాదం సంభవించిన స్థలానికి వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించారు. 

షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు. జన సంచారం, జనాలు ఎక్కువగా ఉండే భవనాల్లో సరైన అగ్నిమాపక భద్రతా చర్యలు లేకపోవడం, కేవలం ఒకే ఎంట్రీ- ఎగ్జిట్ పాయింట్ ఉండటం ఈ ప్రాణనష్టానికి ప్రధాన కారణాలుగా అధికారులు పేర్కొన్నారు. వెలికితీసిన మృతదేహాలను పోలీసులు పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.