హైదరాబాద్‌ లాంటి ప్రధాన నగరాల నుంచి వేర్వేరు ఊళ్లకు వెళ్లే బస్సులు భోజనాలు, టిఫెన్‌ చేయడానికి సిటీ దాటిన తర్వాత ఆపడం సర్వసాధారణం. అందులో చాలా మంది రెస్ట్‌రూమ్‌కని, భోజనం చేద్దామని దిగుతూ ఉంటారు. అలాంటి వాళ్లంతా అలర్ట్ అవ్వాల్సిన న్యూస్ ఇది. 


భోజనాలకు, రెస్ట్ కోసం ఇలా బస్‌ ఆపారో లేదో...  చాలా మంది హడావుడిగా దిగి వెళ్లిపోతుంటారు. అయితే ఇలాంటి వారినే టార్గెట్ చేసుకొని ఓ ముఠా చెలరేగిపోయింది. అంతా బస్‌ దిగిన తర్వాత బ్యాగ్‌లను వెతికి మరీ విలువైన వస్తువులను కొట్టేసి అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయే ముఠా ఇది. 


అందరిలాగానే ఎక్కడికో ఒక చోటకు టికెట్ తీసుకుంటారు. మధ్యలో బస్ ఆగిన వెంటనే చేతికి పని చెప్పి... జారుకుంటారు. మరికొందరు బస్‌లు ఎక్కువ ఆగి... ఎక్కువ ప్రయాణికులు ఉండే దాబాలు, హోటల్స్ వద్దే రెక్కీ వేస్తుంటారు. ఇలాంటి కన్నింగ్ ముఠాను నల్గొండ జిల్లా పోలీసులు పట్టుకున్నారు. 9 మందిని అరెస్టు చేసి వారి నుంచి నగదు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. 


నార్కెట్ పల్లి శివారులోని ఓదాబా వద్ద కొందరు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరగడాన్ని స్థానికులు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి వాళ్లను పట్టుకొని విచారిస్తే వాళ్లు చేసిన కంత్రీ పనుల చిట్టా విప్పారు. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన తాజ్, సర్ఫరాజ్ ఈ ముఠాను లీడ్ చేశారు. పదిహేను ఏళ్ల నుంచి యూపీతోపాటు బెంగళూరు, చెన్నై, తిరుపతి, విజయవాడ, వైజాగ్‌, గుంటూరు బస్‌స్టాండ్‌లలో చేతికి పని చెప్పారు. ప్రయాణీకుల బ్యాగ్‌ల నుంచి డబ్బులు, బంగారం మాయం చేసి ఎస్కేప్ అవుతారు. 


తాజ్, సర్ఫరాజ్ కలిసి తెలంగాణలో నల్లగొండ, నార్కెట్‌పల్లి, కోదాడ, షాద్‌నగర్, హైదరాబాద్ పరిధిలలో కూడా దొంగతనాలు చేశారు. ఇద్దరూ 9 నెలలు జైలు శిక్ష కూడా అనుభవించినారు. జైలు నుంచి విడుదలై నతర్వాత బంధువులను కలుపుకొని ఓ ముఠాగా ఏర్పడ్డారు. 


తొమ్మిదో నెల ఏడో తేదీన నార్కెట్‌పల్లి శివారులోని ఓ హోటల్ వద్ద బస్సు టిఫిన్ కోసం ఆపగా బస్ లాగేజి స్టాండ్‌లో ఉన్న 30 లక్షలు ఉన్న బ్యాగ్‌ను ఎత్తేశారు. దీంతో బాధితులు హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌లో కేసు నమోదు చేశారు. విచారణ కోసం ఆ కేసును నార్కెట్‌పల్లికి తరలించారు పోలీసులు. 


ఈ కేసు దర్యాప్తు సాగుతుండగానే.. పోలీసులకు అనుమానితులు తిరుగుతున్నట్టు సమాచారం వచ్చింది. వారిని అరెస్టు చేసి విచారిస్తే అసలు గుట్టు వెలుగు చూసింది.