Nalgonda Crime News: బుడి బుడి అడుగులు వేస్తూ.. బుజ్జి బుజ్జి మాటలు చెప్పే వయసు. ఆ పాపను చూసిన ఎవరైనా సరే చేతుల్లోకి తీసుకొని ఆడుకోవాలి అనిపించేంత అందం, అమాయకత్వం. కానీ కన్నతల్లికి మాత్రం ఆ పాపను చూస్తే చచ్చేంత చిరాకు. తరచూ తన వివాహేతర సంబంధానికి అడ్డు వస్తోందని విపరీతమైన కోపం. చాలా రోజుల నుంచి పాపను సరిగ్గా చూసుకోవడమే మానేసింది. గిల్లడం, కొట్టడం వంటివి చేసేది. ఇక ఏం చేసినా లాభం లేదనుకొని చంపేస్తే.. అడ్డు తొలగుతుందని భావించింది. ఇక అనుకున్నదే తడవుగా ప్రియుడిని ఇంటికి రప్పించింది. పాప చెంపపై గట్టిగా కొట్టింది. ఆపై గోడకేసి కొట్టింది. తర్వాత ముక్కూ, నోరూ మూసి మరీ శ్వాస ఆడకుండా చేశారు. దీంతో పాప అక్కడికక్కడే మృతి చెందింది. ఆ తర్వాత కర్కోటకపు తల్లి పాప మూర్ఛతో చనిపోయిందంటూ అందిరినీ నమ్మించే ప్రయత్నం చేసింది. కానీ ఆమె మామకు అనుమానం రావడం, పోలీసుల విచారణతో విషయం అంతా వెలుగులోకి వచ్చింది. 


అసలేం జరిగిందంటే..?


నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఎలికట్టె గ్రామానికి చెందిన ఉయ్యాల వెంకన్నతో కనగల్ మండలంలోని లచ్చుగూడేనికి చెందిన రమ్యకు 2015లో పెళ్లి జరిగింది. అయితే వీరి అన్యోన్య దాంపత్యానికి ప్రతీకలుగా ఇద్దరు పిల్లలు పుట్టారు. వాళ్లే ఐదేళ్ల కుమారుడు శివరాం, రెండేళ్ల కుమార్తె ప్రియాన్షిక. ఉయ్యాల  వెంకన్న 2022లో కరోనా కారణంగా చనిపోయారు. భర్త మృతి తర్వాత రమ్య కొంత కాలం అత్త, మామ, పిల్లలతో కలిసి నివాసం ఉంది. కొన్నాళ్ల తర్వాత అదే గ్రామానికి చెందిన పెరిక వెంకన్న అలియాస్ వెంకటేశ్వర్లుతో రమ్య వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఆ తర్వాత అత్తింటి వారి నుంచి వెళ్లిపోయి ఓ అద్దె ఇంట్లో పిల్లలతో కలిసి ఉంటూ.. అతడితో సహజీవనం చేస్తోంది. అయితే బాబు పెద్దోడు కావడంతో అతడిని బడికి పంపిస్తోంది. కానీ పాపకు రెండేళ్లు మాత్రమే  ఉండడంతో తల్లితోనే ఉంచుకుంటుంది.


పథకం ప్రకారమే పాపను హత్య చేసిన తల్లి 


ఈ క్రమంలోనే ప్రియుడితో కలిసి ఉండగా పాప ఏడ్వడం వంటివి చేస్తోంది. ప్రతీసారి ఇలాగే జరగడంతో పాపపై తల్లి కోపం పెంచుకుంది. వాళ్లను డిస్ట్రబ్ చేసిన ప్రతీ సారి కొట్టడం, గిచ్చడం వంటివి చేసేంది. ఇక లాభం లేదనుకొని పాపను చంపేయాలని ప్రియుడితో కలిసి పథకం పన్నంది. ఈ క్రమంలోనే పిల్లలకు ఏదైనా హానీ జరిగితే.. గ్రామస్థులు, అత్తింటి వాళ్లే కారణం అని వీడియో తీసింది. దాన్ని వివిధ గ్రూపుల్లో పోస్టు కూడా చేసింది. ఈనెల 14వ తేదీ రాత్రి పాపను చంపాలనుకున్నారు. ముందుగా పాపపై చెంపపై, ఆపై గోడకేసి గట్టిగా కొట్టారు. తీవ్ర గాయాల పాలైన పాప తట్టుకోలేక విపరీతంగా ఏడ్చింది. అదే సమయంలో ఆమె మూక్కూ, నోరు మూసి శ్వాస ఆడకుండా చేశారు. దీంతో ప్రియాన్షిక అక్కడికక్కడే చనిపోయింది. 


మూర్ఛ వచ్చిందంటూ తల్లి హైడ్రామా..


పాప మృతదేహాన్ని పట్టుకొని మూర్ఛ వచ్చిందని చెబుతూ.. ఆస్పత్రికి పరుగులు పెట్టింది పాప తల్లి. నల్గొండలోని ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లగా... పాప అప్పటికే మృతి చెందిందని వైద్యులు చెప్పారు. అయితే మృతదేహాన్ని మార్చురీలో ఉంచి వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న పాప నానమ్మ, తాతయ్యలు ఆసుపత్రికి పరుగులు పెట్టారు. పాప చెంపపై దెబ్బలను గుర్తించిన తాత యాదగిరికి అనుమానం వచ్చింది. వెంటనే వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసలు దర్యాప్తు ప్రారంభించారు. అయితే పాప తల్లి ప్రవర్తనలో మార్పు ఉండడం, అడిగిన ప్రతీసారి ఏదో ఒకటి చెప్పడంతో అనుమానం వచ్చి గట్టిగా విచారించగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో రమ్యతో పాటు ఆమె ప్రియుడు వెంకటేశ్వర్లును కూడా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.