Nalgonda Crime News: సంక్రాంతి పండుగ కోసం అమ్మమ్మ ఇంటికి వెళ్లింది. పండగ అయిపోయాక తిరిగి వెళ్లే క్రమంలో.. గ్రామానికి చెందిన ఓ యువకుడి కారులో ఎక్కింది. అందులో మరో ఇద్దరు యువకులు కూడా ఉన్నారు. బస్సు ఆగే దగ్గర దింపారు. అక్కడే సదరు యువకుడికి బట్టల షాప్ ఉండటంతో ఎండలో ఏం నిల్చుంటావు లోపలికి రా అని చెప్పాడు. ఆపై అత్యాచారానికి పాల్పడ్డారు. తీవ్ర రక్తస్రావమై బాలిక చనిపోయింది. భయపడ్డ యువకులు ఆమెను తీసుకొని స్థానిక ఆస్పత్రికి వెళ్లారు. స్పృహ తప్పి పడిపోయిందని చెప్పగా.. ఆమె చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
అసలేం జరిగిందంటే...?
హైదరాబాద్ కు చెందిన ఓ 13 ఏళ్ల బాలిక అమ్మానాన్నలతో కలిసి ఉంటోంది. కానీ సంక్రాంతి పండుగ కోసం నల్గొండ జిల్లా ఏపీపల్లి మండలంలో ఉంటున్న అమ్మమ్మ ఇంటికి వచ్చింది. పండుగను అందరితో కలిసి చాలా బాగా ఎంజాయ్ చేసింది. తిరిగి మంగళవారం రోజు హైదరాబాద్ కు పయనమైంది. పెద్ద అడిశర్లపల్లి మండలం వడ్డెరిగూడేనికి చెందిన యువకులు నరేష్, శివ, దిలీప్ కారులో అంగడిపేట క్రాస్ రోడ్డు వద్దకు వెళ్తుండగా... పరిచయస్తులే కావడంతో అక్కడి వరకు వస్తానని బాలిక వారి కారు ఎక్కింది. క్రాస్ రోడ్డు వద్ద కారు దిగిన బాలిక హైదరాబాద్ వెళ్లేందుకు బస్సు కోసం ఎదురు చూస్తుండగా బస్టాప్ ఎదురుగానే నరేష్‌కు బట్టల షాపు ఉంది.
ఎండలో ఏముంటావు.. లోపలికి రమ్మని అత్యాచారం!
ఎండలో నిలబడి బస్సు కోసం ఎదురు చూస్తున్న బాలికను.. సదరు యుకులు లోపలికి రమ్మని పిలిచారు. ఎండలో ఉండే బదులు.. ఇక్కడ ఫ్యాన్ కింద హాయిగా కూర్చొని వేచి చూడమని చెప్పారు. ఆ తర్వాత ముగ్గురు యువకులు దుకాణం తలుపులు మూసి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ క్రమంలోనే బాలిక స్పృహ తప్పి పడిపోయింది. భయపడిపోయిన యువకులు.. బాలికను వెంటనే స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు బాలిక చనిపోయినట్లు ధ్రువీకరించారు. ఈ క్రమంలోనే నరేష్, శివ, దిలీప్ పరారయ్యేందుకు ప్రయత్నించారు.
తీవ్ర రక్తస్రావమై బాలిక చనిపోయినట్లు వైద్యుల ధ్రువీకరణ
అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు ముగ్గురు యువకులను అరెస్ట్ చేశారు. దేవరకొండ డీఎఎస్పీ నాగేశ్వర్ రావు మృతదేహాన్నిపరిశీలించి విచారణ చేపట్టారు. ముగ్గురు యువకులు బాలికపై అత్యాచారం చేయడంతోనే తీవ్ర రక్తస్రావంతో బాలిక మృతి చెందిన ప్రాథమిక విచారణలో తేలినట్లు చెప్పారు. బాలిక మృతి విషయం తెలుసుకున్న అమ్మమ్మ, తల్లిదండ్రులు నల్గొండకు చేరుకున్నారు. మొన్నటి వరకు అమ్మమ్మ ఇంట్లో హాయిగా మహాలక్ష్మిలా తిరిగిన బాలిక చనిపోవడాన్ని వారెవరూ జీర్ణించుకోలకపోతున్నారు. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అమ్మమ్మ ఇంటికి వెళ్లి తిరిగొస్తానని చెప్పిన కూతురు.. అనంత లోకాలకు వెళ్లడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. బాలిక తండ్రి.. తన కూతురిపై అత్యాచారం చేసే ఆ ముగ్గురు యువకులు హత్య చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.