Chennai influencer killed by husband : సోషల్ మీడియాలో మెరిసే అందమైన వీడియోల వెనుక కొన్నిసార్లు భయంకరమైన చీకటి నిజాలు దాగి ఉంటాయని నిరూపించింది ఈ ఘటన. చెన్నైకి చెందిన ప్రముఖ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్, శ్రీ సాయి సిల్క్స్ నాగలక్ష్మి తన సొంత ఇంట్లోనే భర్త చేతిలో హత్యకు గురయ్యారు. ఆ తర్వాత ఆమె భర్త సుబ్రమణ్యం కూడా ఆత్మహత్య చేసుకుని తనువు చాలించారు. నంగనల్లూరులోని వారి నివాసంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది.
ఎవరీ నాగలక్ష్మి?
నాగలక్ష్మి అంటే కేవలం ఒక వ్యాపారవేత్త మాత్రమే కాదు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు 3 లక్షల మందికి పైగా ఫాలోయర్లు ఉన్నారు. రంగురంగుల పట్టుచీరలను ఎలా ధరించాలి? ఏ చీరకు ఎలాంటి నగలు బాగుంటాయి? అంటూ ఆమె చేసే వీడియోలకు విపరీతమైన క్రేజ్ ఉండేది. ఇంటికి ఏకైక ఆధారం ఆమెనే. నంగనల్లూరు, అన్నా నగర్ ప్రాంతాల్లో తన వ్యాపారాన్ని విజయవంతంగా నడిపిస్తూ, ఒక కొడుకును రష్యాలో ఎంబీబీఎస్, మరో కొడుకును డెంటిస్ట్రీ చదివిస్తున్నారు.
కలత పెట్టిన డిస్టర్బింగ్ మెసేజ్
పోలీసుల కథనం ప్రకారం.. భార్యాభర్తల మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. రెండేళ్ల క్రితం ఇల్లు వదిలి వెళ్లిపోయిన సుబ్రమణ్యం, ఇటీవల మళ్లీ ఇంటికి వచ్చారు. ఏప్రిల్ 27న తండ్రి నుండి వచ్చిన ఒక వింతైన మెసేజ్ చూసి భయపడ్డ చిన్న కొడుకు హుటాహుటిన ఇంటికి చేరుకున్నాడు. తీరా లోపలికి వెళ్లి చూసేసరికి అమ్మానాన్నలిద్దరూ విగతజీవులై పడి ఉండటంతో ఆ యువకుడు కుప్పకూలిపోయాడు.
గొడవకు కారణం ఏమిటి?
ప్రాథమిక విచారణలో దంపతుల మధ్య తలెత్తిన తీవ్రమైన వాగ్వాదమే ఈ హత్యకు దారితీసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. భార్య ఎదుగుదల చూసి కలిగిన అసూయనా? లేక ఆర్థికపరమైన గొడవలా? అన్న కోణంలో దర్యాప్తు సాగుతోంది. నాగలక్ష్మిని చంపిన తర్వాత, సుబ్రమణ్యం కూడా బలవన్మరణానికి పాల్పడినట్లు నిర్ధారించారు. ప్రస్తుతం మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం చెంగల్పట్టు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మద్యానికి బానిసై .. డబ్బులివ్వలేదని ఇలా చేసినట్లుగా అనుమానిస్తున్నారు. సోషల్ మీడియాలో నవ్వుతూ కనిపించే ముఖాల వెనుక ఎన్ని బాధలు ఉంటాయో ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది.
