Munugode Police: ప్రస్తుతం మునుగోడు ఉపఎన్నిక జరుగుతోంది . ఈ ఉపఎన్నికలో అన్ని పార్టీలు పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెడుతున్నాయి. నామినేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో పెద్ద ఎత్తున పార్టీలు ప్రచారానికి సన్నాహాలు చేసుకుంటున్నాయి. అదే సమయంలో ఓటర్లకు పెద్ద ఎత్తున తాయిలాలు ఇచ్చేందుకు కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే భారీగా హలాలా డబ్బు పట్టుబడుతోంది. ఈ క్రమంలోనే నల్గొండ జిల్లా మునుగోడు నియోజక వర్గంలో ఓ బీజేపీ నేత కారులో కోటి రూపాలయ డబ్బులను గుర్తించారు. 



నల్గొండ జిల్లా మునుగోడు మండలంలో ఉప ఎన్నికల్లో భాగంగా కోటి రూపాయల హవాలా డబ్బును పోలీసులు గుర్తించారు. మునుగోడు మండలం చల్మెడ చెక్ పోస్ట్ వద్ద పోలీసుల వాహన తనిఖీలు నిర్వహించగా... బీజేపీకి చెందిన ఓ నేత వాహనంలో భారీగా హవాలా డబ్బు పట్టుబడింది. కారులో అక్రమంగా తరలిస్తున్న కోటి రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆ బీజేపీ నేత కరీంనగర్ జిల్లాకు చెందిన బీజేపీ కౌన్సిలర్ భర్త వేణు వాహనంగా పోలీసులు గుర్తించారు. పోలీసులు డబ్బుపై పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్నారు. 


వారం రోజుల క్రితం హైదరాబాద్ లో 3.5 కోట్లు..


గాంధీనగర్ పీఎస్ పరిధిలో అక్రమంగా తరలిస్తున్న డబ్బును ట్యాంక్ బండ్ హోటల్ మారియట్ వద్ద నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు గుర్తించారు. పక్కా సమాచారంతో తనిఖీలు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. గండి సాయికుమార్ రెడ్డికి వెంక‌టేశ్వ‌ర్ అనే వ్య‌క్తి రూ. 3.5 కోట్ల న‌గదు ఇచ్చాడు. ఆ న‌గ‌దును సైదాబాద్‌లో ఉండే బాలు, మ‌హేంద‌ర్‌కు ఇవ్వాల‌ని సూచించాడు. ఇదే స‌మ‌యంలో పోలీసులు అక్క‌డికి చేరుకుని త‌నిఖీలు నిర్వ‌హించారు. 3.5 కోట్ల రూపాయల న‌గ‌దుతో పాటు 7 సెల్‌ఫోన్లు, రెండు కార్ల‌ను స్వాధీనం చేసుకున్నారు. అలాగే గండి సాయికుమార్ రెడ్డి, గుండే మ‌హేశ్‌, సందీప్ కుమార్, మ‌హేంద‌ర్, అనూష్ రెడ్డి, భ‌ర‌త్‌ల‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నగదు ఎక్కడి నుంచి తీసుకువస్తున్నారు, ఎవరు ఇచ్చారు వంటి పూర్తి సమాచారం తెలపకపోవడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. 


ఎనిమిదో రోజుల క్రితం 2.5 కోట్లు..


జూబ్లీహిల్స్, భారతీయ విద్యాభవన్ సమీపంలో ద్విచక్ర వాహనంపై భారీ ట్రావెలర్స్ బ్యాగ్‌తో నగదును ఇద్దరు వ్యక్తులు తరలిస్తున్నారు. అనుమానం వచ్చి వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీ చేయగా ఆ బ్యాగులో రూ. 2,49,79,000 (2 కోట్ల 49 లక్షల 79 వేల రూపాయలు) ఉన్నట్లు సమాచారం. అందుకు సంబంధించిన రిసీప్ట్, పత్రాలు ఉన్నాయా అని ప్రశ్నించగా నిందితులు అవేమీ లేవని సమాధానమిచ్చారు. దీంతో టాస్క్ ఫోర్స్ ఆ ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుంది. వారి వద్ద నుంచి నగదును స్వాధీనం చేసుకున్నారు.


తొమ్మిది రోజుల క్రితం 79.26 లక్షల పట్టివేత..


హైదరాబాద్ పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో భారీగా హవాలా డబ్బు పట్టుబడింది. చంద్రాయణ గుట్ట ఎక్స్ రోడ్ వద్ద 79 లక్షల 25వేల హవాలా డబ్బును స్వాధీనం చేసుకున్నారు. చంద్రాయణ గుట్ట పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా.. అనుమానంగా కనిపించిన రెండు కార్లను ఆపి సోదాలు చేశారు. అందులో 79.25 లక్షల డబ్బు కనిపించింది. అయితే డబ్బు తరలిస్తున్న వ్యక్తులు ఆ డబ్బుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు చూపకపోవడంతో పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే కారు నడుపుతున్న ఉత్తర ప్రదేశ్ కు చెందిన ఇమ్రాన్ మాలిక్, సల్మాన్ మాలిక్, హైదరాబాద్ కు చెందిన వెంకట్ రెడ్డి, శేఖర్ లను అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.