Mumbai BMW Hit and Run Case: ముంబయిలో BMW కార్ హిట్ అండ్ రన్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. శిందే శివసేన పార్టీకి చెందిన ఓ నేత కొడుకు వేగంగా వచ్చి ఓ బైక్‌ని ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. చేపలు అమ్ముకుంటూ జీవనం సాగించే భార్యాభర్తలు సాయంత్రం ఇంటికి వెళ్లే సమయంలో వెనక నుంచి BMW కార్ గట్టిగా ఢీకొట్టింది. బలంగా ఢీకొట్టడం వల్ల ఇద్దరూ గాల్లోకి ఎగిరి కింద పడ్డారు. దాదాపు 100 మీటర్ల దూరంలో ఎగిరి పడిన మహిళ తీవ్రంగా గాయపడింది. హాస్పిటల్‌కి తరలిస్తుండగానే మృతి చెందింది. కార్ నడిపిన మిహిర్ షా మద్యం మత్తులో ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. నిందితుడు శివసేన పార్టీకి చెందిన రాజేశ్ షా కొడుకు. పదో తరగతి వరకూ చదువుకుని ఆ తరవాత ఆపేశాడు. కన్‌స్ట్రక్షన్ బిజినెస్ చేసుకుంటున్నాడు. విలాసాలకు అలవాటుపడినట్టు పోలీసులు వెల్లడించారు. ప్రమాదం జరిగే రోజున రాత్రంతా మద్యం సేవించాడు. కార్ డ్రైవర్‌ని వెనక్కి వెళ్లమని చెప్పి తానే డ్రైవింగ్ చేశాడు. ఆ సమయంలోనే ఈ ప్రమాదం జరిగింది.
తెల్లవారుజామున 5.30 గంటలకు వేగంగా వచ్చి బైక్‌ని ఢీకొట్టాడు. వెంటనే కార్‌కి ఉన్న శివసేన పార్టీ గుర్తుని తీసేశాడు. ఓ చోట కార్‌ని వదిలి పెట్టి అక్కడి నుంచి పరారయ్యాడు. ఆ తరవాత తండ్రికి కాల్ చేసి యాక్సిడెంట్ గురించి చెప్పి ఫోన్ స్విచాఫ్ చేశాడు. గర్ల్‌ఫ్రెండ్ సాయంతో అక్కడి నుంచి తప్పించుకున్నట్టు పోలీసులు చెబుతున్నారు. ఈ కేసులో కార్ డ్రైవర్‌తో పాటు నిందితుడి తండ్రిని అరెస్ట్ చేశారు. అయితే..వీళ్లు విచారణకు సహకరించడం లేదని పోలీసులు వెల్లడించారు. త్వరలోనే కోర్టులో ప్రవేశపెట్టి తదుపరి చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం 6 టీమ్స్ రంగంలోకి దిగాయి. త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. ఇప్పటికే నిందితుడిపై కేసు నమోదు చేశారు.