సిద్దిపేట: ఈజీ మనీకి అలవాటు పడిన తల్లి దురాశతో కొడుకును సైతం నేరాలకు ప్రేరేపించింది. తన పెంపకంతో క్రమశిక్షణ నేర్పించాల్సిన మైనర్ కుమారుడిని ప్లాన్ ప్రకారం సీరియల్ కిల్లర్‌గా మార్చిందని తెలిసి పోలీసులు సైతం షాకయ్యారు. కొడుకు శారీరకంగా ఎక్కువ ఫిట్‌నెస్ ఉండాలని, ఇంట్లోనే జిమ్ పరికరాలు సమకూర్చింది. కుమారుడి సాయంతో అమాయక మహిళలను హత్య చేసి, దోపిడీలకు పాల్పడుతోంది. సిద్ధిపేట జిల్లా భూంపల్లి గ్రామంలో ఈ దారుణాలు జరిగాయి.
సిద్దిపేట జిల్లా పోలీస్ కమిషనరేట్‌లో సీపీ రష్మీ పెరుమాళ్, ఏసీపీ రవీందర్‌రెడ్డిలతో కలిసి ఈ హత్యలకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. సిరిసిల్ల నుంచి కొన్నేళ్ల కిందటే వచ్చి భూంపల్లిలోని డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల వద్ద తెల్లాకుల రజిత (38) నివాసం ఉంటోంది. ఆమె భర్త అనారోగ్య సమస్యలతో బాధపడుతుండగా, ఇంటర్ చదివిన కుమారుడు ఉన్నాడు. చిన్న కిరాణా దుకాణం నడుపుతున్న రజిత తన వద్ద కొనేందుకు వచ్చే వారితో మాటలు కలిపి వారి కుటుంబ సమస్యలు, భూతగాదాలను ఆరా తీసేది. ఈ క్రమంలో ఆగస్టు 8న తన దుకాణానికి వచ్చిన అతికం విజయ (45) అనే మహిళను పలు విషయాలు అడిగింది. మాటల్లో పెట్టి లోపలికి తీసుకెళ్లి, కొడుకుతో కలిసి విజయ గొంతు నులిమి హత్య చేసింది. తరువాత ఆమె నగలు దోచేశారు. మృతదేహాన్ని బైక్‌పై రామక్కపేట శివారుకు తరలించి పెట్రోల్ పోసి దహనం చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు సిసిటీవీ ఫుటేజీ ఆధారంగా రజితను అదుపులోకి తీసుకుని విచారించడంతో ఈ సంచలన నిజాలు వెలుగుచూశాయి.
గతంలో చేసిన మరిన్ని దారుణాలు పోలీసుల విచారణలో బయటపడ్డాయి. మే 28న కుంట రేఖ అనే మహిళను కూడా ఇదే తీరుగా హత్య చేశారు. అచ్చుమాయపల్లి శివారులో డెడ్‌బాడీని దహనం చేసినట్లు తేలింది. గతేడాది జూన్‌లో సర్పంచ్ భార్యపై దాడి చేసి నగలు దోచుకోవడమే కాకుండా, మరో ముగ్గురు మహిళలను హత్య చేసేందుకు వీరు స్కెచ్ వేశారు. సర్పంచ్ భార్య మార్నింగ్ వాకింగ్ కు వెళ్లగా ముసుగు ధరించిన వచ్చిన తల్లీ కొడుకు ఆమెపై కర్ర, రాళ్లతో దాడి చేసి బంగారు నగలు ఎత్తుకెళ్లారు.
భర్తను సైతం హత్య చేయాలని ప్లాన్..భర్త పేరుపై ఇన్సూరెన్స్ చేయించి అతనిని కూడా హత్య చేయాలని నిందితురాలు రజిత ప్లాన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. భర్తను టార్చర్ చేసి మంచానికే పరిమితం చేసింది. హత్యలు, దోపిడీలు చేయడానికి తల్లి కొడుకు యూట్యూబ్‌లో క్రైమ్ వీడియోలు చూసేవారని పోలీసులు తెలిపారు. నిందితుల వద్ద నుంచి 5.6 తులాల బంగారు ఆభరణాలు, 53 తులాల వెండి, బైక్, రూ. 1.03 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు రజితను జిల్లా జైలుకు, ఆమె మైనర్ కుమారుడిని జువెనైల్ హోమ్‌కు తరలించారు. సిద్దిపేటలో జరిగిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతోంది.
