Newborn Mouth Buries Under Stones Miraculously Survives: రాజస్థాన్‌లోని భీల్‌వారా జిల్లాలో జరిగిన హృదయవిదారక సంఘటనలో, 15 రోజుల చిన్నారి నోటిని ఫెవిక్విక్‌తో అతికించి, ఏడవకుండా చేసి మండల్‌గఢ్ సమీపంలోని అడవిలో రాళ్ల కింద  పెట్టేసి వెళ్లిపోయారు గుర్తు తెలియని వ్యక్తులు. కడుపు తీపి కాస్త మిగిలే ఉందేమో కానీ ప్రాణం తీసి అక్కడ పడేసిపోలేదు. కానీ చనిపోవాలనే అలా చేశారు. కానీ ఆ బిడ్డ మృత్యుంజయుడు. పశువులు కాసుకునే వ్యక్తి చూడటంతో ప్రాణాలతో బయటపడ్డాడు.  సెప్టెంబర్ 23న మంగళవారం మండల్‌గఢ్ సమీపంలోని సీతా కుండ్ ఆలయం సమీపంలోని అడవిలో పశువులు మేపుకునే వ్యక్తి  రాళ్ల కుప్పల మధ్య ఏదో కదులుతున్నట్లు గమనించాడు. దగ్గరకు వెళ్లి చూసేసరికి, 10-15 రోజుల వయసున్న బాలుడు మట్టి, రాళ్లలో పడిపోయి ఉన్నాడు.  కష్టపడి శ్వాస తీసుకుంటూ ఉన్నాడు. చిన్నారి కళ్లు ఎర్రగా మారాయి. దాంతో పశువుల కాపరి వెంటనే   చిన్నారిని స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లాడు. డాక్టర్లు చిన్నారి ముఖం, తొడలపై  గాయాలు, రాయి వేడి వల్ల ఎడమ వైపు శరీరంపై  కాలిపోయినట్లుగా నిర్ధారించారు. అయినప్పటికీ, చిన్నారి బతికి ఉండటాన్ని డాక్టర్లు "అద్భుతం"గా అభివర్ణించారు. చిన్నారి పరిస్థితి ఇబ్బందికరంగా  ఉన్నా, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు మరియు మెరుగుపడుతోందని వైద్యులు చెబుతున్నారు. 

భీల్‌వారా పోలీసులు ఈ ఘటనపై తీవ్రంగా దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారి తల్లి, తండ్రి ఎవరో కనుగొనేందుకు స్థానిక ఆసుపత్రుల్లో ఇటీవల డెలివరీ రికార్డులు, CCTV ఫుటేజ్‌లు సేకరిస్తున్నారు. పొరుగు గ్రామాల్లో, మండల్‌గఢ్ ప్రాంతంలో  విచారిస్తున్నారు.   చిన్నారిని చంపే ప్రయత్నంగా ఇది కనిపిస్తోందని.. పెదాలకు ఫెవిక్విక్ రాసి  రాయి పెట్టి  ఏడుపు రాకుండా చేశారు.  తల్లిని కనుగొని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని  మండల్‌గఢ్ పోలీస్ స్టేషన్ అధికారి చెప్పారు. ఈ కేసు భారతీయ శిక్షా సంహిత (BNS)లోని శిశు క్రూరత్వం, హత్యా ప్రయత్నం సెక్షన్‌ల కింద నమోదు చేశారు. చిన్నారి DNA సాంపిల్స్ సేకరించారు.  

  చిన్నారి పూర్తిగా కోలుకున్న తర్వాత, అనాథ ఆశ్రమంలో లేదా దత్తతకు ఇవ్వవచ్చని పోలీసులు చెబుతున్నారు. రాజస్తాన్ లో అమ్మాయిల పుట్టుకపై వివక్ష ఉందనుకున్నా.. ఇక్కడ పడేసిన పసిబిడ్డ బాలిక కాదు.. బాలుడు. అబ్బాయిని ఇలా ఎందుకు చంపుకోవాలనుకున్నారన్నది తేలాల్సి ఉంది. రెండు రోజుల కిందట ప్రకాశం జిల్లాలోని గిద్దలూరులోనూ ఇలాంటి ఘటనే జరిగింది. చిన్న ప్రైవేటు ఆస్పత్రి బాత్ రూమ్‌లో ప్రసవించిన మహిళ.. బిడ్డను బాత్ రూమ్ బకెట్ లో పెట్టి వెళ్లిపోయింది. ఆ బిడ్డను ప్రాణాలు ఉన్నప్పుడే గుర్తించడంతో ఆస్పత్రికి తరలించారు. ఆ తల్లి కోసం వెదుకుతున్నారు.