Minors Drugs Party: మొయినాబాద్ ఫాంహౌస్‌లో మైనర్ల మత్తు పార్టీ కలకలం, ఎస్ఓటీ పోలీసుల ఆకస్మిక దాడి
Moinabad Farm House | మొయినాబాద్ ఫాంహౌస్‌లో 50 మంది మైనర్ల ఆల్కాహాల్, డ్రగ్స్ పార్టీకి హాజరయ్యారు. రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసుల ఆకస్మిక దాడి చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

హైదరాబాద్: మైనర్లు కలిసి మత్తు పార్టీ చేసుకోవడం హైదరాబాద్‌లో సంచలనంగా మారింది. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మైనర్లు ఒక గ్రూపుగా ఏర్పడి ఏకంగా ఓ ఫామ్‌హౌస్‌లో మత్తు పార్టీకి హాజరుకావడం కలకలం రేపుతోంది. రాజేంద్రనగర్ ఎస్‌వోటీ పోలీసులు తనిఖీలు చేసి మత్తు పార్టీ గుట్టు రట్టు చేశారు. ఒంటరిగా వస్తే ఒక రేటు, జంటగా వస్తే మరో రేటుతో పాస్‌లు ఇచ్చి మరీ మొయినాబాద్ ఫాంహౌస్‌లో పార్టీ నిర్వహించారని పోలీసులు గుర్తించారు.
అసలేం జరిగిందంటే..
నగరానికి చెందిన ఓ డీజే ‘ట్రాప్ హౌస్.9ఎంఎం’ పేరుతో ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేశాడు. ఇ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌తో యాక్టివ్‌గాఉండే మైనర్ల టార్గెట్ చేశాడు. ఆ డీజే మొయినాబాద్‌లోని ఓ ఫామ్‌హౌస్‌లో ట్రాప్ హౌస్ పేరుతో పార్టీ నిర్వహిస్తున్నట్లు ప్రచారం చేశాడు. ఇది సాధారణ పార్టీ కాదని, ఇందులో హద్దులు లేని ఎంజాయ్‌మెంట్ సరదా ఉంటుందని మైనర్లను ఆకర్షించాడు. ఈ పార్టీకి పాస్‌లు తప్పనిసరి అనే కండీషన్ పెట్టాడు. పార్టీకి ఒక్కరు హాజరుకావాలంటే రూ.1,600 పాస్, జంటగా వస్తే రూ.2,800గా పాస్ ధర నిర్ణయించాడు.
ఇన్‌స్టాలో ఈ ప్రకటనను చూసిన మైనర్లు పార్టీకి ఉత్సాహంగా సిద్ధమయ్యారు. నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన దాదాపు 50 మంది మైనర్లు శనివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మొయినాబాద్‌లోని ఓక్స్ ఫామ్‌హౌస్‌లో ట్రాప్ హౌస్ పార్టీని ఆ డీజే ఏర్పాటు చేశాడు.
పక్కా సమాచారంతో ఎస్‌వోటీ పోలీసుల ఎంట్రీ..
వారంతా మైనర్లే.. హద్దులు లేని ఎంజాయ్ మెంట్ పార్టీకి హాజరయ్యారు. పార్టీ జోరుగా సాగుతుండగా, రాజేంద్రనగర్ ఎస్‌వోటీ పోలీసులు అకస్మాత్తుగా మొయినాబాద్ ఓక్స్ ఫాంహౌస్‌పై దాడి చేశారు. పార్టీలో పాల్గొన్న వారికి డ్రగ్ టెస్టులు నిర్వహించగా, ఇద్దరు మైనర్లు గంజాయి తీసుకున్నట్లు తేలంది. పోలీసులు ఆరుగురు నిర్వాహకులను అదుపులోకి తీసుకుని, 6 విదేశీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. వారిని మొయినాబాద్ పోలీసులకు అప్పగించారు.
ఈ ఘటనపై ఆదివారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పార్టీలో పాల్గొన్న మైనర్ల విషయాన్ని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పిల్లలు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు.. వారి అలవాట్లు ఎలా మారుతున్నాయో చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైనే ఉందన్నారు. డ్రగ్స్ కేసుల్లో దొరికితే వారి జీవితాలు నాశనం అవుతాయని.. ఇప్పటికైనా పిల్లలను సరైన దారిలో పెట్టుకోవాలని తల్లిదండ్రులకు పోలీసులు సూచించారు.






















