Medical Student Forceful Death In Vijayanagaram: విజయనగరం జిల్లాలో (Vijayanagaram District) తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పరీక్ష ఫెయిలై ఓ వైద్య విద్యార్థి తీవ్ర మనస్తాపంతో బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నెల్లిమర్ల మిమ్స్ (MIMS) వైద్య కళాశాల విద్యార్థి అటుకూరి సాయిమణిదీప్ (24) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వసతి గృహంలోని తన గది తలుపులు తీయకపోవడంతో తోటి విద్యార్థులు అనుమానంతో తలుపులు తెరిచి చూశారు. సాయిమణిదీప్ అపస్మారక స్థితిలో ఉండడాన్ని గమనించిన విద్యార్థులు.. వెంటనే కళాశాల యాజమాన్యానికి సమాచారం అందించారు. వీరు పోలీసులకు సమాచారం అందించగా వారు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
సాయిమణిదీప్ రెండో ఏడాది ఎంబీబీఎస్ పరీక్ష తప్పడంతో మానసికంగా ఆందోళనకు గురైనట్లు ఎస్ఐ తెలిపారు. తోటి విద్యార్థులంతా చదువు పూర్తి చేసి వెళ్లిపోతారని.. తనకు మాత్రం ఇలా జరిగినట్లు తీవ్ర మనస్తాపానికి గురైన విద్యార్థి పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడినట్లు చెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతునిది పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలుగా గుర్తించారు.