Telangana Crime News: రోజు తాగొచ్చే భర్త.. ఇంటికి వచ్చి చిత్ర హింసలు పెడుతున్నాడు.. కొడుతున్నాడు. ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నాడు. అయినా అతని భార్య భరించింది. సంసారాన్ని బజారు పాలు కాకుండా కుటుంబాన్ని బాగా చూసుకోవాలని తలచింది. తీరు మార్చుకోవాలని భర్తను బతిమాలింది. మద్యం మానేయాలని ప్రాధేయపడింది. అందరిలో పరువు తీయొద్దని వేడుకుంది. కానీ తీరు మార్చుకోని భర్త అంతా తన ఇష్టమని, తాను చెప్పినట్లే చేయాలని భార్యపై హుకుం జారీ చేశాడు. అంతేకాకుండా తాగొచ్చి వేధింపులకు గురి చేశాడు.
అయినా వాటిని పట్టించుకోకుండా తనకు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్న భర్త పట్ల విసుగు చెందింది. భర్తను హతమార్చేందుకు నిర్ణయించుకుంది. తాళ్లతో బంధించింది. తనను ఎంతలా వేధించాడో గుర్తు తెచ్చుకుని చిత్ర హింసలకు గురి చేసి చంపేసింది. ఈ ఘటన మెదక్ జిల్లా తుఫ్రాన్ మండలంలో ఘణపూర్‌లో జరిగింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. స్థానికుల వివరాల మేరకు.. మెదక్ జిల్లా తూఫ్రాన్ మండలం ఘణపూర్‌కు చెందిన వెంకటేష్, విజయ భార్య భర్తలు. వెంకటేష్ మద్యానికి బానిసయ్యాడు. నిత్యం తాగొచ్చి భార్య విజయని వేధించేవాడు.. కొట్టేవాడు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. తాగుడుకు డబ్బు ఇవ్వాలని పీడించేవాడు. అయితే విజయ అతన్ని వారించేందుకు యత్నించేది. మద్యంతో జీవితాలు నాశనం అవుతున్నాయని, మందు మానుకోవాలని ప్రాధేయపడింది. జీవితంలో అందరి కంటే మిన్నగా జీవించాలని వేడుకుంది. ఇవేవీ పట్టించుకోని వెంకటేష్ తీరు మార్చుకోలేదు. రోజు తాగొచ్చి భార్యను వేధించేవాడు. ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించేవాడు. పైశాచిక ఆనందం పొందేవాడు.
శనివారం సైతం వెంకటేష్ ఇంటికి తాగి వచ్చాడు. విజయతో గొడవ పడ్డాడు. నిత్యం తాగిరావడం, ప్రవర్తనలో ఎలాంటి మార్పూ లేకపోవడంతో విజయ సహనం కోల్పోయింది. తాగొచ్చిన భర్తను ఆగ్రహంతో తాళ్లతో బంధించింది. కళ్లలో కారం కొట్టింది. అంతటితో ఆగకుండా అతడి ఒంటిపై వేడినీళ్లు పోసింది. బాధను తాళలేకపోతున్న అతడిని చూసి ఆనందంతో బిగ్గరగా కేకలు వేసిందని స్థానికులు చెబుతున్నారు.
స్థానికులు ఇచ్చిన సమాచారం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. విజయ చేసిన పనులకు తీవ్రంగా గాయపడిన వెంకటేష్‌ను తూఫ్రాన్ ప్రభుత్వ ఆస్పత్రిలో తరలించి చికిత్స అందించారు. అయితే చికిత్సకు స్పందించక వెంకటేష్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ హత్యకు పాల్పడ్డ విజయపై పోలీసు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టానికి తరలించారు. ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.
కేసులో కొత్తకోణం
భర్త వెంకటేష్ హత్య కేసులో మరో అంశం ప్రచారం జరుగుతోంది. తాగొచ్చిన భర్తను హతమార్చడంలో ఆమె బంధువులు కీలకంగా సహకరించారని తెలుస్తోంది. విజయ బంధువులతో కలిసి భర్త వెంకటేష్‌ను తాళ్లతో బంధించినట్లు సమాచారం. ఆ తరువాత విచాక్షణా రహితంగా కొట్టారని, అంతే కాకుండా ఒంటిపై యాసిడ్ పోశారని వెళ్లియారని ప్రచారం జరుగుతోంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వెంకటేష్ మృతి చెందగా పోలీసులు కేసు విచారణ వేగవంతం చేశారు. విజయ బంధువులను విచారణ చేస్తే అసలు విషయం బయటపడుతుందని భావిస్తున్నారు. వెంకటేష్ హత్య కేసులో అనుమానిత వ్యక్తుల కోసం గాలిస్తున్నట్లు తెలుస్తోంది.