Markapuram Road Accident:ఆంధ్రప్రదేశ్‌లోని మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో పలక క్వారీల వద్ద ప్రమాదం జరిగింది. ప్రైవేటు ట్రావెల్స్ బస్‌ , టిప్పర్ ఎదురెదురుగా ఢీ కొన్న ప్రమాదంలో 13 మంది ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు. డీజిల్ ట్యాంక్ పగిలిపోవడంతో క్షణాల్లో మంటలు వ్యాపించాయి. బస్ పూర్తిగా కాలిపోయింది. 

మార్కాపురం జిల్లా మార్కాపురం గ్రామీణ మండల పరిధిలోని రాయవరం సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది. గురువారం తెల్లవారుజామున ప్రయాణికులు గాఢ నిద్రలో ఉన్నప్పుడు హరికృష్ణ ట్రావెల్స్‌కు చెందిన బస్‌ ఎదురుగా వస్తున్న టిప్పర్‌ను ఢీ కొట్టింది.  

ప్రమాదం జరిగిన సమయంలో బస్‌లో సుమారు 40 మంది ప్రయాణికులు ఉన్నారు. హైదరాబాద్‌ నుంచి ప్రకాశం జిల్లాలోని కనిగిరి వైపు వెళ్తున్న టైంలో ఈ ప్రమాదం రాయవరం వద్ద జరిగింది. 

ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం బస్, టిప్పర్ అతివేగంగా ఎదురెదురుగా  ఢీ కొనడంతో ప్రమాదం జరిగింది. ప్రమాదంలో టిప్పర్ డీజిల్ ట్యాంక్ పగలడంతో మంటలు చెలరేగాయి. సెకన్లలో రెండు వాహనాలు దగ్ధమయ్యాయి. లోపల ఉన్న ప్రయాణికులు సీట్ల నుంచి లేచి బయటకు వచ్చే అవకాశం లేకుండా పోయింది. బస్ నిమిషాల్లోనే పూర్తిగా కాలిపోయింది. 

చాలా మంది ప్రయాణికులు నిద్రమత్తులో ఉండటంతో అసలు ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే మంటలు చుట్టుముట్టాయి. కొందరు సాహసించి బస్ కిటికీలు పగులుగొట్టి ప్రాణాలతో బయటపడగా, లోపల చిక్కుకున్న 13మంది సజీవదహనం అయ్యారు. 

సహాయక చర్యలు

ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే బస్ పూర్తిగా అస్తిపంజరంలా మారిపోయింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరికొందరు ప్రయాణికులను పోలీసులు మార్కాపురం ప్రభుత్వాసుపత్రికి  తరలించారు. 

ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని, దీని వల్ల మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

రాయవరం సమీపంలోనీ ఈ ప్రాంతంలో క్వారీలకు ప్రసిద్ధి. ఇక్కడ భారీగా టిప్పర్ల రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా తెల్లవారుజామున అతి వేగం, డ్రైవర్ల అజాగ్రత్త ప్రమాదాలకు కారణమమవుతుంటాయి. ఈ ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధితులకు అవసరమైన వైద్య సహాం అందించడంతోపాటు మృతుల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేశారు. 

మార్కాపురం రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రయాణికుల మరణంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్‌తో మాట్లాడారు. క్షతగాత్రులకు అందుతున్న సాయంపై ఆరా తీశారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. అసలు ప్రమాదం ఎలా జరిగింది. అక్కడ ఏం జరిగిందో పూర్తి వివరాలతో సమగ్ర నివేదిక ఇవ్వాలని చెప్పారు. 

మార్కాపురం ప్రమాద ఘటనపై మంత్రి గొట్టిపాటి రవి కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై అధికారులు, స్థానిక ఎమ్మెల్యేతో మాట్లాడారు. ప్రమాద వివరాలను మంత్రి గొట్టిపాటికి అధికారులు వివరించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆయన ఆదేశించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.