Manipur Violence: 


అమిత్‌షా కీలక సమావేశం 


మణిపూర్‌లో హింసాత్మక ఘటనలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. దాదాపు 20 రోజులుగా అక్కడ ఉద్రిక్తతలు చోటు  చేసుకుంటున్నాయి. కేంద్ర బలగాలు రంగంలోకి దిగి పరిస్థితులు చక్కదిద్దాలని చూసినా...అది సాధ్యపడడం లేదు. ఎక్కడో ఓ చోట అల్లర్లు మొదలవుతున్నాయి. గిరిజన, గిరిజనేతర వర్గాల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ అల్లర్లపై కేంద్రం దృష్టి పెట్టడం లేదన్న విమర్శల నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా మణిపూర్ పర్యటనకు వెళ్లారు. అక్కడి పరిస్థితులు దగ్గరుండి మరీ సమీక్షించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి బైరెన్ సింగ్‌తో ప్రత్యేకంగా భేటీ అయిన అమిత్ షా...కీలక ప్రకటన చేశారు. మే 3వ తేదీ నుంచి మొదలైన ఈ అల్లర్లలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం ఇస్తామని ప్రకటించారు. అయితే...ఇందులో రూ.5 లక్షలు కేంద్రం ఇవ్వనుండగా..మరో రూ.5 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం భరించనుంది. కేవలం డబ్బులిచ్చి ఊరుకోకుండా బాధిత కుటుంబాల్లోని అర్హులైన వ్యక్తులకు ప్రభుత్వ ఉద్యోగమూ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు షా. అంతే కాదు. రాష్ట్రంలో బాధితులెవ్వరికీ ఇబ్బంది కలగకుండా నిత్యావసర సరుకులనూ పంపిణీ చేయాలని ఆదేశించారు. దీంతో పాటు అక్కడి భద్రతనూ పరిశీలించారు అమిత్‌ షా. మణిపూర్‌ పోలీసులతో పాటు కేంద్ర సాయుధ బలగాలు, ఇండియన్ ఆర్మీకి చెందిన సీనియర్ అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ భేటీ తరవాత అమిత్‌షా కీలక ట్వీట్‌లు చేశారు. మణిపూర్‌లో శాంతి భద్రతలు కాపాడడమే తమ లక్ష్యమని తేల్చి చెప్పారు. శాంతియుత వాతావరణంలో అలజడి రేపే వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 


"మణిపూర్‌లో శాంతి భద్రతలు కాపాడడానికే ప్రాధాన్యతనిస్తున్నాం. అనవసరంగా అల్లర్లు సృష్టించే వారిని ఉపేక్షించం. శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. ఇప్పటికే కొన్ని సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్‌తో చర్చించాం. ఆయా సంస్థలకు చెందిన ప్రతినిధులు కూడా మాకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. కలిసి కట్టుగా త్వరలోనే మణిపూర్‌లో ప్రశాంత వాతావరణం నెలకొనేలా చూస్తాం"


- అమిత్ షా, కేంద్ర హోం మంత్రి