Mancherial Court Different Judgement: మద్యం తాగి వాహనాలు నడిపితే పోలీసులు చర్యలు తీసుకుంటారు. ఇది అందరికీ తెలిసిందే. అయితే, భారీగా జరిమానాలు విధించడం.. కౌన్సిలింగ్ ఇవ్వడం.. వాహనాలు సీజ్ చేయడం, కోర్టులో కౌన్సిలింగ్ ఇవ్వడం వంటివి మాత్రమే మనకు తెలిసిన శిక్షలు. కానీ, వీటన్నింటికీ భిన్నంగా మంచిర్యాల న్యాయస్థానం (Mancherial Court) విభిన్నమైన తీర్పు ఇచ్చింది. మద్యం సేవించి వాహనం నడపకూడదని కఠిన నిబంధనలు ఉన్నప్పటికీ కొందరిలో ఇంకా మార్పు రావడం లేదు. దీంతో కోర్టు వినూత్నంగా తీర్పు వెలువరించింది. తాజాగా, మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడ్డ 24 మందిని మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని శుభ్రం చేయాలని ఆదేశించింది. గురువారం నుంచి వారం రోజుల పాటు ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఆరోగ్యం కేంద్రంలో శుభ్రత పనులు చేయాలని న్యాయమూర్తి జస్టిస్ ఉపనిషద్విని తీర్పు ఇచ్చారు.


కఠిన నిబంధనలున్నా మందుబాబుల్లో మార్పు రావడం లేదని.. ఈ తీర్పుతోనైనా మార్పు రావాలని ట్రాఫిక్‌ పోలీసులు వెల్లడించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ వల్లే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. తమతో పాటు ఎదుటివారు కూడా బలవుతున్నారనే విషయాన్ని గ్రహించాలని సూచించారు. ఇటీవల జిల్లాలో మద్యం తాగి వాహనాలు నడిపేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తనిఖీల్లో దొరకకుండా ఉండేందుకు పలువురు అడ్డదారుల్లో వెళ్తున్నట్లు గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. పట్టుబడ్డ వారికి ఎన్నిసార్లు కౌన్సిలింగ్ చేసినా వారిలో మార్పు రావడం లేదని చెబుతున్నారు. కుటుంబ సభ్యుల సమక్షంలో వారికి మందు తాగి నడపటం వల్ల జరిగే దుష్పరిణామాల గురించి వివరించామని, పలువురు అప్పుడు తప్పు తెలుసుకున్నట్లు నటిస్తున్నారని తరువాత వారి ప్రవర్తన షరామామూలుగా ఉంటుందని తెలిపారు. ఇలాంటి వారి పట్ల కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. 


Also Read: Crime News: నగరంలో దారుణం - అత్తకు బలవంతంగా మద్యం తాగించి అల్లుడి లైంగిక దాడి