AP Woman Harassment News: ప్రదేశం ఏదైనా మహిళలపై వేధింపులు ఆగడం లేదు. రోడ్డుపై నడిచేటప్పుడు, మాల్‌లో షాపింగ్ చేసే సమయంలో, రైలు ప్రయాణం ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి చోట ఆడ బిడ్డకు వేధింపులే ఎదురవుతున్నాయి. మగువలు విమానాలను సైతం నడుపుతున్న ప్రపంచంలో వారిపై మానవ మృగాల ఆగడాలు ఆగడం లేదు. విమనాల్లో ఆడబిడ్డలపై ఆగడాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి చేదు అనుభవమే తెలుగింటి ఆడపడుచుకు ఓ విమానంలో జరిగింది.


వివరాలు.. జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్డ్‌ నగరం నుంచి బెంగళూరు వస్తున్న విమానంలో తిరుపతికి చెందిన ఓ మహిళ (32) వేధింపులు ఎదుర్కొన్నారు. ఫ్రాంక్‌ఫర్ట్‌- బెంగళూరు లుఫ్తాన్సా విమానంలో నవంబర్‌ 6న ఈ ఘటన చోటుచేసుకుంది. మహిళ విమానంలో నిద్రపోతుండగా ఆమె పక్కనే కూర్చున్న 52 ఏళ్ల వ్యక్తి ఆమె ప్రైవేటు భాగాలను తాకి అసభ్యంగా ప్రవర్తించాడు. ప్రయాణ సమయంలోనూ ఆమెపై లైంగిక వేధింపులు కొనసాగించడంతో ఎయిర్‌లైన్స్‌ సిబ్బందికి చెప్పి బాధితురాలు తన సీటును మార్చుకున్నారు. 


బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగగానే అక్కడి పోలీసులకు తనకు జరిగన చేదు అనుభవం గురించి మహిళ ఫిర్యాదు చేశారు. నిద్రపోతున్న సమయంలో నిందితుడు లైంగిక వేధింపులకు గురిచేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో నిందితుడిపై పోలీసులు ఐపీసీ సెక్షన్‌ 354 ఎ (లైంగిక వేధింపులు) కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అనంతరం నిందితుడిని కోర్టులో హాజరుపరిచారు. ఆ తర్వాత అతడు బెయిల్‌పై విడుదలయ్యాడు.


స్పైస్‌ జెట్ ఫ్లైట్‌లో..
గత ఆగస్టు నెలలో ముంబయికి చెందిన స్పైస్‌ జెట్ ఫ్లైట్‌లో ఓ వృద్ధుడు ఎయిర్‌ హోస్టెస్‌ని దొంగ చాటుగా ఫొటోలు తీశాడు. ఇది గమనించిన ఎయిర్ హోస్టెస్ వెంటనే నిలదీసింది. చాలా సేపు ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియోని ఓ వ్లాగర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా..వైరల్ అయింది. అసభ్యకరంగా ఫొటోలు, వీడియోలు తీసినట్టు ఎయిర్‌ హోస్టెస్ తీవ్రంగా ఆరోపించింది. ఫొటోలు తీస్తుండడాన్ని గమనించిన వెంటనే ఫోన్ లాక్కుని చూసింది. కాసేపు గొడవ పడిన ఆ వృద్ధుడు ఆ తరవాత సారీ చెప్పాడు. వెంటనే ఆ ఫొటోలు, వీడియోలు డిలీట్ చేశాడు. ఆ తరవాత అపాలజీ లెటర్ కూడా రాశాడు. 


ఇండిగో ఫ్లైట్‌లో ఇలాంటి ఘటనే..
గత జులై చివరి వారం ఇండిగో ఫ్లైట్‌లో ఇలాంటి ఘటనే జరిగింది. మహిళా ప్యాసింజర్‌ని లైంగికంగా వేధించిన ప్రొఫెసర్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ నుంచి ముంబయికి వెళ్తున్న ఫ్లైట్‌లో ఈ ఘటన జరిగింది. తనను లైంగికంగా వేధించినట్టు 24 ఏళ్ల యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కంప్లెయింట్ ఆధారంగా నిందితుడు ప్రొఫెసర్ రోహిత్ శ్రీవాస్తవను అరెస్ట్ చేసిన పోలీసులు జ్యుడీషయల్ కస్టడీకి తరలించారు. ఆ తరవాత నిందితుడు బెయిల్‌పై విడుదలయ్యాడు. 


పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. శ్రీవాస్తవ, బాధితురాలి సీట్‌లు పక్కపక్కనే ఉన్నాయి. జులై 26న ఢిల్లీ నుంచి ఉదయం 5.30 గంటలకు ఇండిగో ఫ్లైట్ ముంబయికి బయల్దేరింది. మరి కాసేపట్లో ముంబయిలో ల్యాండ్ అవుతుందనగా.. పక్కనే ఉన్న మహిళను అసభ్యకరంగా తాకడం మొదలు పెట్టాడు. ముంబయిలో ఫ్లైట్ ల్యాండ్ అయిన వెంటనే సహార్ పోలీస్ స్టేషన్‌లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. తనను లైంగికంగా వేధించాడని బాధితురాలు పేర్కొంది. స్టేట్‌మెంట్ రికార్డ్ చేసుకున్న పోలీసులు...నిందితుడిపై FIR నమోదు చేశారు.