Maharashtra News : చిన్న చిన్న కారణాలకే విలువైన జీవితాలను అర్థాంతరంగా ముగించుకుంటున్నారు కొందరు. భర్త సినిమాకు తీసుకెళ్లలేదని, నచ్చిన కూర వండలేదనో, నాన్న బైక్ కొనివ్వలేదనో ఇలా కారణాలు ఏమైనా సరే ఎంతో చిన్న కారణాలకు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనే మహారాష్ట్రలో చోటుచేసుకుంది. ఔరంగాబాద్‌కు చెందిన సమాధాన్ సాబ్లే(24) అనే యువకుడు తనకన్నా వయసులో ఆరేళ్ల పెద్దదైన యువతిని వివాహం చేసుకున్నాడు. పెళ్లి అయిన తర్వాత భార్య ప్రవర్తన సరిగా లేదని కారణం చెబుతూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే ఆత్మహత్యకు యువకుడు రాసిన సూసైడ్ నోట్ చూసి పోలీసులు షాక్ అయ్యారు. తన భార్యకు కనీసం చీర కూడా ఆరేయడం కూడా రాదని, సరిగా నడవలేదని, మాట్లాడలేదని ఇలా రాసుకొచ్చాడు. తనతో జీవితాన్ని కొనసాగించలేనని చెప్పి ఆత్మహత్య చేసుకున్నాడు.
అసలేం జరిగింది?
మహారాష్ట్రలోని ఔరంగాబాద్ నగరంలో 24 ఏళ్ల యువకుడు తన భార్యపై అసంతృప్తితో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు మంగళవారం తెలిపారు. ముకుంద్‌నగర్‌లో నివాసం ఉంటున్న సమాధాన్ సాబ్లే సోమవారం తన ఇంట్లో ఉరివేసుకుని కనిపించాడని ముకుంద్‌వాడి పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు. ముకుంద్‌వాడి పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ బ్రహ్మ గిరి మాట్లాడుతూ "సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నాం. అందులో తన భార్య చీర సరిగ్గా కట్టుకోలేదని, నడవడం లేదా మాట్లాడటం రాదని అతను పేర్కొన్నాడు. ఆ వ్యక్తి తన కంటే ఆరేళ్లు పెద్దదైన మహిళతో ఆరు నెలల క్రితం వివాహం చేసుకున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేశాం. తదుపరి విచారణ జరుగుతోంది " అని అధికారి తెలిపారు.
పెళ్లి ఇష్టం లేక ఆత్మహత్య
తన చావుకు తానే కారణమని రాసి ఓ యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం గుర్రంగూడ బాపిరెడ్డి కాలనీకి చెందిన శివకృష్ణ (27) నారాయణఖేడ్‌లో మిషన్ భగీరథ పథకం ఏఈగా పనిచేస్తున్నారు. అతనికి ఇటీవలే వివాహం కుదిరింది. ఈ నెల 13న నారాయణఖేడ్ నుంచి ఇంటికి వచ్చిన శివకృష్ణ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రెండు రోజుల తర్వాత శివకృష్ణకు తండ్రి ఫోన్ చేయగా అతడు లిఫ్ట్ చేయలేదు. దీంతో పెద్ద కుమారుడికి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పాడు. గుర్రంగూడలోని తెలిసిన వ్యక్తికి ఫోన్ చేసిన పెద్ద కుమారుడు ఇంటికెళ్లి చూడమని చెప్పాడు. సోమవారం రాత్రి అతడు ఇంటికి వెళ్లగా, తలుపు తెరవకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు తలుపులు బద్దలుగొట్టి లోపలికి వెళ్లారు. గదిలో శివకృష్ణ ఉరికి వేలాడుతూ కనిపించాడు. అతడి దుస్తుల్లో ఉన్న సూసైడ్ నోట్‌లో తన చావుకు ఎవరూ కారణం కాదని రాశాడు. తనకు తానే కారణమని పేర్కొన్నాడు. పెళ్లి ఇష్టం లేక అతడు ఈ పనికి పాల్పడినట్టు శివకృష్ణ తండ్రి పోలీసులకు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.