Pune real estate builder son killed before grand wedding: మహారాష్ట్రలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం లోనావాలా సమీపంలో ఉన్న లోహగడ్ కోట వద్ద కొద్దిరోజుల క్రితం జరిగిన యువ పారిశ్రామికవేత్త మరణం రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. మొదట ప్రమాదవశాత్తూ లోయలో పడి చనిపోయాడని భావించిన ఈ ఘటన.. పోలీసుల లోతైన దర్యాప్తులో పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన ఘోర హత్యగా తేలింది. పింప్రి చించ్వాడ్‌కు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి విశాల్ అగర్వాల్ కుమారుడు కేతన్ అగర్వాల్ ను, అతడి కాబోయే భార్య సియా గోయల్ తన ప్రియుడు చేతన్ చౌదరితో కలిసి కుట్రపూరితంగా లోయలోకి తోసి చంపేసిందని పూణే రూరల్ పోలీసులు వెల్లడించారు.
రూ. 17 కోట్లతో రాయల్ వెడ్డింగ్ ప్లాన్.. ఇంతలోనే దారుణం
ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్లి, ఇటీవలె తిరిగివచ్చిన కేతన్ అగర్వాల్.. తండ్రి వ్యాపార బాధ్యతలను చూసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే కేతన్‌కు సియా గోయల్‌తో నిశ్చితార్థం కాగా, ఈ ఏడాది నవంబర్ 25న వివాహం జరిపించేందుకు ఇరు కుటుంబాలు నిర్ణయించాయి. రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఉన్న ఒక ప్రసిద్ధ ప్యాలెస్‌ను ఏకంగా రూ. 17 కోట్ల భారీ వ్యయంతో పెళ్లి కోసం బుక్ చేశారు. అంతేకాదు, వీఐపీ అతిథుల ప్రయాణం కోసం రెండు ప్రైవేట్ విమానాలను కూడా సిద్ధం చేశారు. ఇరు కుటుంబాల్లో పెళ్లి సందడి మొదలైన తరుణంలోనే ఈ ఘోరం జరగడం అందరినీ షాక్‌కు గురిచేసింది.
పుట్టినరోజు వేడుకల నెపంతో కోటకు పిలిపించి..
సియా గోయల్‌కు జూన్ 19న పుట్టినరోజు కావడంతో, దానికి ఒకరోజు ముందు సెలబ్రేషన్స్ కోసమంటూ కేతన్‌ను బలవంతంగా లోహగడ్ కోట ట్రెకింగ్‌కు పిలిపించింది. నిజానికి జూన్ 14న కూడా ఆమె కేతన్‌ను అక్కడికి తీసుకెళ్లి లోయలోకి తోసేయాలని ప్రయత్నించగా, ఒక చెట్టు అడ్డుపడటంతో కేతన్ ప్రాణాలతో బయటపడ్డాడు. అప్పుడు పాము చూసి భయపడి నెట్టేసానంటూ సియా కట్టుకథ అల్లింది. ఎలాగైనా కేతన్‌ను వదిలించుకోవాలని డిసైడ్ అయిన సియా.. జూన్ 18న మరోసారి అతడిని అక్కడికి తీసుకెళ్లి, ఫోటోలు దిగుతున్న సమయంలో తన ప్రియుడు చేతన్ చౌదరితో కలిసి 400 అడుగుల లోతైన లోయలోకి నెట్టేసింది. కేతన్ బ్యాలెన్స్ తప్పి పడిపోయాడంటూ అప్పుడు కూడా అందరినీ నమ్మించింది.
ఎండలో హుడీ వేసుకున్న ప్రియుడు.. పోలీసుల చేతికి చిక్కిన క్లూ
కేతన్ అనుభవజ్ఞుడైన ట్రెక్కర్ కావడంతో అతడు అంత తేలిగ్గా జారిపడే అవకాశం లేదని కుటుంబ సభ్యులు లోనావాలా రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కోట పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. జూన్ లోనావాలాలో విపరీతమైన ఎండ, ఉక్కపోత ఉన్నప్పటికీ.. ఒక యువకుడు ఒళ్లంతా కప్పేసేలా పెద్ద హుడీ టీషర్ట్ వేసుకుని, హెడ్‌ఫోన్స్ పెట్టుకుని అనుమానాస్పదంగా తిరగడం పోలీసుల కంటపడింది. ఆ సాంకేతిక ఆధారాలు, మొబైల్ కాల్ డేటా రికార్డులను ట్రాక్ చేయగా.. ఆ హుడీ ధరించిన వ్యక్తి సియా రహస్య ప్రియుడు చేతన్ చౌదరిగా తేలింది.
కఠిన శిక్షకు డిమాండ్
పోలీసులు సియా గోయల్, చేతన్ చౌదరిలను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా వారు నేరాన్ని అంగీకరించారు. సియాకు కేతన్‌తో పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని, చేతన్‌తో ఉన్న ప్రేమబంధం వల్లే కేతన్‌ను వదిలించుకోవడానికి ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు తేలింది. పెళ్లి జరిగితే తమ ప్రేమకు అడ్డు వస్తాడని భావించి ఈ కిరాతక ప్లాన్ అమలు చేశారు. నిందితులిద్దరిపై లోనావాలా పోలీసులు హత్య కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అన్యాయంగా తమ బిడ్డను బలితీసుకున్న నిందితులకు ఉరిశిక్ష పడేలా చూడాలని కేతన్ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
