Mahabubnagar Bride Death: పెళ్లి జరిగి కాసేపు కాకముందే ఓ నవ వధువు ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనంగా మారింది. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో జరిగింది. తల్లిదండ్రులు తనకు ఇష్టం లేకుండా బలవంతంగా పెళ్లి చేయడాన్ని సహించలేని ఆమె ప్రాణాలు తీసుకున్నట్లుగా స్థానికులు తెలిపారు. సరిగ్గా పెళ్లి జరిగిన కాసేపటికి అప్పగింతలకు ముందు విషం తాగి ఆత్మహత్య చేసుకుంది.


పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మహబూబ్ నగర్ పట్టణానికి చెందిన గుజ్జల పద్మకు నలుగురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. పెద్ద కుమార్తె లక్ష్మి (19) పదో తరగతి వరకు చదువుకుంది. ప్రస్తుతం ఇంటి వద్దే ఉంటి పనులు చూసుకుంటోంది. ఇటీవల ఆమెకు అనంతపురం జిల్లాకు చెందిన మల్లికార్జున్‌తో పెళ్లి కుదిరింది. అయితే, మహబూబ్ నగర్, అనంతపురం చాలా దూరం కాబట్టి, అంతదూరపు సంబంధం తనకు ఇష్టం లేదని లక్ష్మి అందుకు ఒప్పుకోలేదు. అయినా ఆమెను బలవంతంగా ఒప్పించారు. దీంతో ఆమెకు ఇష్టం లేకుండానే పెళ్లి చేసుకుంది. 


శనివారం ఉదయం 9 గంటలకు వివాహం జరిపించగా.. ఆ పెళ్లి ఇష్టం లేని లక్ష్మి సాయంత్రం అప్పగింతల సమయానికి ముందు విషం తాగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను హాస్పిటల్‌కు తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆమె అప్పటికే చనిపోయినట్లుగా ధ్రువీకరించారు. అప్పటి వరకు పెళ్లిలో నవ్వులతో కళకళలాడిన ఇల్లు విషాదంతో నిండిపోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.


విశాఖలో పెళ్లిపీటలపైనే..
విశాఖపట్నంలోనూ నవ వధువు మృతి అనుమానాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. మధురవాడలో విషాద ఘటన చోటు చేసుకుంది. పెళ్లి పీటల మీదే వధువు కుప్పకూలింది. హైదరాబాద్ కు చెందిన ముంజేటి ఈశ్వరరావు, అనురాధ కుమార్తె సృజన(22)కు విశాఖ పీఎంపాలెం ప్రాంతానికి చెందిన నాగోతి అప్పలరాజు, లలిత కుమారుడు శివాజీతో పెళ్లి సంబంధం కుదిరింది. ఈ నెల 11న రాత్రి 10 గంటలకు వివాహం నిశ్చయించారు. ఈశ్వరరావు స్వస్థలం శ్రీకాకుళం జిల్లా జలుమూరు. శివాజీ గతంలో టీఎన్ఎస్ఎఫ్ కార్యనిర్వాహక కార్యదర్శిగా కూడా పనిచేశారు. ఈ నేపథ్యంలో మూడు రోజులుగా ఇరువర్గాల ఇళ్లలో వివిధ కార్యక్రమాలు జరిగాయి. బుధవారం జరిగిన అనేక కార్యక్రమాల్లో వధూవరులిద్దరూ హుషారుగా పాల్గొన్నారు. వివాహ రిసెప్షన్ పలువురు టీడీపీ ప్రముఖ నేతలు కూడా హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ముహూర్తం సమయం దగ్గర పడుతుండగా సృజనకు నీరసంగా అనిపించింది. వరుడు జీలకర్ర, బెల్లం పెడుతున్న సమయంలో సృజన అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. తక్షణమే ఆమెను కుటుంబీకులు ఆస్పత్రికి తరలించారు.