కర్నూలు జిల్లా శ్రీశైలం పుణ్యక్షేత్రంలో బుధవారం అర్ధరాత్రి ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఆలయ పరిధిలో కన్నడ భక్తులు వీరంగం సృష్టించారు. టీ షాపు వద్ద కన్నడ భక్తులు, దుకాణాదారుల మధ్య ఘర్షణ జరిగింది. ఆగ్రహంతో కన్నడ భక్తులు షాపులు, కార్లు, ద్విచక్రవాహనాలను ధ్వంసం చేశారు. కన్నడ భక్తులు ఓ టీ దుకాణానికి నిప్పు పెట్టారు. షాపు యజమానుల దాడిలో కన్నడ భక్తుడికి తీవ్రగాయాలు అయ్యాయి. దీంతో బాధితుడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. గాయపడిన యువకుడిని జగద్గురు పీఠాధిపతి పరామర్శించారు. 


తాత్కాలిక దుకాణాలకు నిప్పు 


శ్రీశైలం దేవాలయం పరిధిలోని తాత్కాలిక షాపులకు కన్నడ యువకులు నిప్పు పెట్టారు. దీంతో భక్తులు భయంతో పరుగులు పెట్టారు. ఈ దాడిలో 100 పైగా దుకాణాలు, 30 కార్లు, 10 బైక్ లు ధ్వంసం అయినట్లు తెలుస్తోంది. సుమారు రూ.30 లక్షల ఆస్తి నష్టం వాటిళ్లినట్లు సమాచారం. టీ షాపు నిర్వాహకుడికి కన్నడ భక్తులకు మధ్య వాటర్ బాటిల్ విషయలో వాగ్వాదం చోటుచేసుకుంది. కన్నడ భక్తుడిపై టీ షాపు నిర్వాహకుడు గొడ్డలితో దాడి చేశాడు. ఈ దాడిలో గాయపడిన వ్యక్తిని సున్నిపెంట ఆస్పత్రికి తరలించారు. ఈ దాడితో వెంటనే అక్కడికి చేరుకున్న కన్నడ భక్తులు స్థానికంగా విధ్వంసం సృష్టించారు. దీంతో శ్రీశైలంలో భారీగా పోలీసులు మోహరించారు. కన్నడ భక్తులు న్యాయం చేయాలంటూ పోలీసు స్టేషన్‌ను ముట్టడించారు. 


అసలేం జరిగిందంటే?


శ్రీశైలంలో కన్నడ భక్తులు ఆందోళనకు దిగారు. పలు దుకాణాలపై దాడులు చేశారు. మరికొన్ని షాపులకు నిప్పంటించి రణరంగం సృష్టించారు. తెలుగోళ్లు కనబడితె చాలు విచక్షణారహితంగా కర్రలతో దాడులకు పాడ్డారు. లక్షల రూపాయలు సొమ్ము నష్టం వాటిల్లేలా బీభత్సం సృష్టించి స్థానికులను భయబ్రాంతులకు గురయ్యేలా కర్రలు పట్టుకుని రోడ్లపై అరుచుకుంటూ తిరుగుతూ కనపడినవారిని కనపడినట్లు చితకబాదారు. శ్రీశైలంలోని పలు షాపులకు నిప్పు పెట్టి ఆగ్నికి ఆహుతి చేశారు. కన్నడిగుల బీభత్సాన్ని చూసి స్థానికులు, భక్తులు భయాందోళనకు గురయ్యారు. మీడియా కవరేజ్ చేసేందుకు వెళ్లిన‌ కొందరిని కన్నడిగులు కర్రలతో వెంబడించారు. 


మూడు గంటల వరకూ బీభత్సం


శ్రీశైలంలోని పాతాళగంగ రోడ్డులోని కురువ సత్రం సమీపంలో ఒక దుకాణంలో వాటర్ బాటిల్ కొనేందుకు వెళ్లిన‌ కన్నడ భక్తులు షాపు యజమానికి రేటు విషయంలో గొడవపడ్డారు. అక్కడ నుంచి వెళ్లిన కన్నడిగులు కాసేపటికి మరికొంత మందితో వచ్చి గొడవలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. అయితే అక్కడితో ఆగక షాపులోని సామాన్లు బయటకు విసిరి షాపుకు నిప్పుపెట్టి ధ్వంసం చేశారు. అక్కడ మొదలైన గొడవ శ్రీశైలంలోని నంది సర్కిల్ మల్లికార్జునసదన్, శివసదన్, అన్నదాన మందిరం, జగద్గురు పీఠం సమీపంలో కొన్ని షాపులపై దాడులు చేసి స్థానికులు, భక్తులను భయాందోళనకు గురిచేశారు. అంతే కాకుండా స్థానిక పోలీస్ స్టేషన్ వద్దకు కొందరు చేరుకుని గట్టిగట్టిగా కేకలు వేస్తూ అల్లర్లు సృష్టించారు. అల్లరి మూకలను అదుపు చేసేందుకు పోలీసులు కూడా వెనుకడుగు వేశారు. కొన్ని గంటల వరకు అల్లరి మూకలను అదుపు చేయలేని పరిస్థితి నెలకొంది.


పరిస్థితి అదుపులోకి 


దీంతో రంగంలోకి దిగిన ఆత్మకూరు డీఎస్పీ శృతి పోలీసు సిబ్బందితో కలిసి పరిస్థితిని అదుపులో తెచ్చారు. అర్ధరాత్రి 12 నుంచి తెల్లవారు జాము మూడు గంటల వరకు కన్నడిగుల బీభత్సం సృష్టించారు. డీఎస్పీ శృతి ఆధ్వర్యంలో పోలీసులు పికెటింగ్ చేశారు. నాలుగు గంటలకు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. శ్రీశైలంలో ప్రసుత్తం పరిస్థితి అదుపులోకి వచ్చింది.  శ్రీశైలం వీధుల్లో పోలీసులు పహారాకాస్తున్నారు. అదనపు పోలీసు బలగాలను మోహరించారు.